నొక్కేసినా.. నో ప్రాబ్లం! | Sakshi
Sakshi News home page

నొక్కేసినా.. నో ప్రాబ్లం!

Published Mon, May 23 2016 2:02 AM

నొక్కేసినా..   నో ప్రాబ్లం! - Sakshi

అవినీతి ఉద్యోగులపై చర్యలు శూన్యం
 ఆరు నెలల సస్పెన్షన్‌తో సరిపెట్టిన ఉన్నతాధికారులు
సొంతానికి వాడుకున్న సొమ్ము చెల్లించిన వెంటనే విధుల కేటాయింపు
 తదుపరి చర్యలు లేకుండా చక్రం తిప్పిన ఓ ఉన్నతాధికారి
జీఎంసీ సొమ్ము దుర్వినియోగం చేసినా చర్యలుండవన్న సంకేతాలు!!!

 
 
సాక్షి,గుంటూరు : అన్నం పెట్టే సంస్థకు కన్నం వేసిన వారిని ఏమనాలి..? వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి..? రెండోసారి ఇదే పని మరొకరు చేయకుండా ఉండేలా అవినీతికి పాల్పడిన ఉద్యోగులపై కొరడా ఝుళిపించాలి. మరి జీఎంసీ అధికారులు ఏం చేశారో తెలుసా.. ఏదో తూతూమంత్రంగా ఆరునెలలు సస్పెండ్ చేసి నొక్కిన సొమ్మును కట్టించుకుని వదిలేశారు.. వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.. ఒక ఇంక్రిమెంటు కూడా కట్ చేయలేదు.. క్రిమినల్ కేసులు నమోదు చేయించలేదు.. సొమ్ము చెల్లించారంటే అవినీతికి పాల్పడినట్లే కదా.. మరి అటువంటి వారిపై కనీసం సివిల్ సర్వీస్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోలేదు.. దీని వెనుక పెద్ద ఎత్తున ముడుపుల బాగోతం నడిచినట్లు ఆరోపణలున్నాయి.  


 తొమ్మిది మందిపై వేటు వేసి..
నగర ప్రజలు చెల్లించే ఆస్తి పన్నులకు సంబంధించిన రశీదులను తారుమారు చేసి బిల్లులు చెల్లించి వెళ్లిన వెంటనే వాటిని రద్దుచేసి ఆ సొమ్మును సొంతానికి కొంతమంది ఉద్యోగులు వాడుకున్నారు. ఈ భారీ అవినీతి బాగోతాన్ని గతేడాది సెప్టెంబర్‌లో ‘ సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీంతో నగరపాలక సంస్థ అధికారులతో పాటు నగరం ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సొమ్ము సొంతానికి వాడుకుంటున్న విషయం అప్పట్లో కొంతమంది ఉన్నతాధికారులకు తెలిసినా వారిని ప్రోత్సహించారు తప్ప చర్యలు తీసుకోలేదనిఆరోపణలొచ్చాయి. దీంతో అప్పటి కమిషనర్ సి.అనురాధ సంఘటనపై పూర్తి విచారణ జరిపి 9 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆమె బదిలీ అయిన వెంటనే ముగ్గురు అధికారుల సస్పెన్షన్‌ను వారి తప్పిదం లేదంటూ ఎత్తివేశారు. మిగిలిన ఆరుగురిపై వేటు కొనసాగించారు.


 తప్పు చేసినా తప్పించుకు తిరగొచ్చు..!
 అయితే నెల కిందట వీరిని సైతం విధుల్లోకి తీసుకున్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నా వీరిలో నలుగురు నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నారు. ఆస్తి పన్నులు చెల్లించిన వారి నుంచి రద్దు వారి ఇష్టప్రకారమే చేశామని లేఖలు తీసుకువచ్చినట్లు సమాచారం. మిగిలిన ఇద్దరిలో ఒకరు రూ.2.87 లక్షలు నొక్కేసినట్లు తేలడంతో ఆ నగదు చెల్లించాలని అధికారులు ఆ మహిళా ఉద్యోగినికి సూచించారు. దీంతో ఆ ఉద్యోగి వెంటనే డబ్బు చెల్లించారు. అయితే వీరిపై తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు  రెవెన్యూ విధులు పర్యవేక్షించే ఉన్నతాధికారి, కార్పొరేషన్‌లో కీలకపాత్ర పోషించే అధికారి, ఇద్దరూ కలిసి పెద్ద ఎత్తున లాబీయింగ్ చేసినట్లు సమాచారం. సస్పెన్షన్ ఎత్తివేయించేందుకు పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. తప్పు చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలింది.


 ఆ విధంగా ఒప్పించారు..
 నగర కమిషనర్‌గా ఎస్.నాగలక్ష్మి బాధ్యతలు చేపట్టాక మొత్తం సీన్ మారిపోయింది. ఆమెకు మున్సిపల్‌శాఖపై అవగాహన లేకపోవడాన్ని వారు అనుకూలంగా మలుచుకున్నట్లు చెప్పుకొంటున్నారు. ప్రతి పనిలో ఆమెకు తప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ తప్పుదారి పట్టిస్తున్నారనడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం. ఉద్యోగులు చేసిన తప్పు బయటపడితే డబ్బు చెల్లించారు.. ఒకవేళ బయటకు రాకపోతే అంతే సంగతులు కదా.. ఇలాంటి వారికి శిక్ష పడకపోతే తప్పుడు సంకేతాలు వెళతాయన్న విషయాన్ని సైతం పట్టించుకోకుండా వారితో లాలూచి పడి తిరిగి విధుల్లోకి తీసుకునేలా కమిషనర్‌ను ఒప్పించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి
 
 
 తప్పు చేసిన ఉద్యోగినిపై క్రమశిక్షణ  చర్యలు

క్యాష్ కౌంటర్‌లో డబ్బు కాజేసిన సంఘటనలో పూర్తి విచారణ జరిపాం. తప్పు చేసిన ఉద్యోగినితో డబ్బు కట్టించడంతోపాటు, ఆమెపై క్రమశిక్షణ  చర్యలు తీసుకుంటాం. మేజర్ ఇంక్రిమెంట్ కట్ చేస్తాం.  - కమిషనర్ నాగలక్ష్మి

Advertisement
Advertisement