రాజధానిలో మళ్లీ పోటాపోటీ ఆందోళనలు | Sakshi
Sakshi News home page

రాజధానిలో మళ్లీ పోటాపోటీ ఆందోళనలు

Published Tue, Aug 27 2013 1:24 AM

రాజధానిలో మళ్లీ పోటాపోటీ ఆందోళనలు - Sakshi

 సాక్షి నెట్‌వర్క్ : సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల పోటాపోటీ ఆందోళనలతో సోమవారం రాజధానిలోని ప్రభుత్వ కార్యాలయాలు దద్దరిల్లాయి. తెలంగాణ ఉద్యోగుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు సోమవారం మధ్యాహ్నం విద్యుత్‌సౌధకు వచ్చిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హరీష్‌రావు, కొప్పుల ఈశ్వర్, విద్యాసాగర్‌రావులను పోలీసులు గేట్ బయటే అడ్డుకున్నారు. దీంతో తెలంగాణ ఉద్యోగులు ఒక్కసారిగా జెతైలంగాణ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీమాంధ్ర ఉద్యోగులు కూడా జై సమైక్యాంధ్ర నినాదాలు చేయడంతో విద్యుత్ సౌధ మార్మోగింది. అరగంటపాటు ఉద్రిక్తత నెలకొంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ బైఠాయించడంతో అట్టుడికిపోయింది. పరిస్థితి చేయిదాటిపోతుండడంతో పోలీసులు ఎమ్మెల్యేలను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.
 
 సీమాంధ్రులకు పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తూ తెలంగాణవాదులను అణచివేయాలని చూస్తున్నారని హరీశ్‌రావు పోలీసులపై మండిపడ్డారు. విద్యుత్‌సౌధలో సీమాంధ్ర ఉద్యోగుల దాడిలో గాయపడ్డ సంతోష్‌కుమార్ అనే ఉద్యోగిని పరామర్శించడానికి వస్తే లోనికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని ఆయన దుయ్యబట్టారు. సీమాంధ్రలో తెలంగాణ ఉద్యోగులపై దాడిచేసిన వారిపై కేసులు పెట్టలేదు కానీ, ఉద్యోగులకు మద్దతుగా సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారిని అరెస్ట్ చేస్తారా? అని హరీష్‌రావు పోలీసులను నిలదీశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ సమైక్యాంధ్ర ఉద్యోగుల ఫోరం ఆధ్వర్యంలో 15 రోజులుగా జరుగుతున్న సమ్మెకు సంఘీభావం తెలిపేందుకు సోమవారం ఏపీఎన్జీవోస్ నగర అధ్యక్షుడు సత్యనారాయణ రావడం ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణ ఉద్యోగులపై ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ తెలంగాణ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. పోలీ సులు శాంతింపజేసేందుకు యత్నించినా వారు వినలేదు. దీంతో సత్యనారాయణను బయటకు తీసుకువెళ్లడంతో తెలంగాణ ఉద్యోగులు శాంతించారు.
 
 దేవాదాయ ధర్మాదాయ శాఖ సమైక్యాంధ్ర ఉద్యోగుల జేఏసీ ప్రధాన కార్యదర్శి కృపావరం అధ్యక్షతన సీమాంధ్ర ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన, వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఏపీఎన్జీవోస్ ఇచ్చిన పిలుపు మేరకు గన్‌ఫౌండ్రీలోని వ్యవసాయ శాఖ కమిషనరేట్‌లో సమైక్యాంధ్ర జేఏసీ చైర్మన్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సీమాంధ్ర ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. అబిడ్స్ తిలక్‌రోడ్డులోని బీమాభవన్‌లో సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె కొనసాగింది.
 

Advertisement
Advertisement