కాలిపోతున్న ‘ఉపాధి’ కూలీ | Sakshi
Sakshi News home page

కాలిపోతున్న ‘ఉపాధి’ కూలీ

Published Thu, May 3 2018 12:06 PM

Employement Scheme Workers Suffering In Summer Heat - Sakshi

డక్కిలి: జిల్లాలోని 46 మండలాల్లో 939 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 33, 428 గ్రూపుల్లో 5.87,125 మందికి జాబ్‌కార్డులు జారీ చేయగా ఇందులో 5,34,513 మంది కూలీలు ఉన్నారు. వీరిలో రోజుకు లక్ష మందికి ఉపాధి పనులు కల్పించాల్సి ఉంటే.. 70 వేలు నుంచి 80 వేలు మంది మాత్రమే కూలీలు ఉపాధి హామీ పనులు చేస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద పనిచేస్తున్న ప్రదేశాల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాల జారీ చేసింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతోన్నాయి.  కొద్ది రోజులుగా నమోదవుతున్న  ఉష్ణోగ్రతలు కారణంగా కూలీలు ఎండలో పనిచేసేందుకు జంకుతున్నారు.

జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40–46 డిగ్రీలు నమోదు అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కూలీలు పనిచేసే చోట మెడికల్‌ కిట్లతో పాటు దాహం తీర్చడానికి మంచి నీరు, మజ్జిగను సరఫరా చేయాల్చి ఉంది. విధిగా టెంట్‌ను ఏర్పాటు చేయాల్సి ఉన్నా..అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. డక్కిలి మండలంలోని 27 గ్రామ పంచాయతీల్లో 2 వేల మందికి పైగా కూలీలు పని చేస్తున్నారు. ఇక్కడ అధికారులు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. కనీసం తాగేందుకు నీళ్లు కూడా లేవు. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు కూడా లేకపోవడం చూస్తే కూలీలపై అధికారులకు ఉన్న భద్రత అద్దం పడుతుంది.  పనుల వద్ద వసతులు లేకపోవడం, ఎండ తీవ్రత, సకా లంలో బిల్లులు రాకపోవడంతో కూలీల హాజరు రోజు రోజుకు తగ్గుతుంది.

కనిపించని మెడికల్‌ కిట్లు
విధిలేని పరిస్థితుల్లో ఎండలోనే పనిచేస్తున్న ఉపాధి కూలీలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఉదయం 7 నుంచి సూర్యుడి ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఉపాధి కూలీలుకు వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లతో పాటు ప్రథమ చికిత్స చేసేందుకు అవసరమైన మెడికల్‌ కిట్లు ఏర్పాటు చేయాల్చి ఉన్నా.. ఎక్కడ కూడా కనిపంచడం లేదు. కొన్ని ప్రాంతాల్లో రెండేళ్ల క్రితం అందజేసిన మెడికల్‌ బాక్స్‌లనే ఇప్పటికీ వినియోగిస్తున్నారు. వీటిలో ఒక్క అయోడిన్‌ మినహ అన్నీ కాలం చెల్లడంతో ప్రథమ చికిత్స బాక్స్‌లను మూలన పడేశారు. ఈ పరిస్థితుల్లో వడదెబ్బ తగిలితే ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.   

 పగటి ఉష్ణోగ్రత భారీగా పెరుగుతోంది. ఎండ తీవ్రతతో ప్రజలు కాలు బయట పెట్టేందుకూ జంకే పరిస్థితి. అత్యవసరమైతే తప్ప..బయటకు రావద్దని జిల్లా అధికారులే హెచ్చరికలు చేస్తున్నారు. కానీ ఉపాధి హామీ పనులు చేసే చోట కూలీలు ఎండకు కాలిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకం పనులు చేపట్టే చోట ఎండాకాలంలో నీడ, మంచినీళ్లు, మజ్జిగ వంటి ఉపశమన చర్యలతో పాటు మెడికల్‌ కిట్లు కూడా అందుబాటులో ఉంచాల్సి ఉంది. అధికారులు పని ప్రాంతంలో ఎలాంటి వసతి కల్పించకపోవడంతో కూలీలు చుక్కలు చూడాల్చి వస్తుంది.

Advertisement
Advertisement