ఉపాధి కరువు ! | Sakshi
Sakshi News home page

ఉపాధి కరువు !

Published Mon, Feb 9 2015 8:39 AM

Employment drought in chittor district



చిత్తూరు: సీఎం సొంత జిల్లా చిత్తూరులో ప్రభుత్వం పనులు కల్పించకపోవడంతో ఉపాధి కూలీలు వలస బాట పడుతున్నారు. అరకొర పనులు జరుగుతున్నా కూలీలకు కూలి గిట్టుబాటు కావడం లేదు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఒక్కొక్కరికి రూ.169 వరకు కూలి ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం రూ.105కు మించి లభించడం లేదు. కొందరు రూ.60 నుంచి 80తో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఉపాధి పనుల కల్పనలో రాష్ట్రంలోనే ముందున్నామంటూ అధికారులు గొప్పలు చెప్పుకుంటున్నా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.

ఉపాధి హామీ పథకానికి సంబంధించి జిల్లాలో 5.94 లక్షల జాబ్‌కార్డులు ఉన్నాయి. వీరిలో ఐదు శాతం మందికి కూడా అధికారులు పనులు కల్పిం చడం లేదు. జిల్లాలో 12 క్లస్టర్లు ఉండగా చిత్తూరు క్లస్టర్‌లో 3,478 మందికి, పుత్తూరు 1,248, నగరి 1,858, శ్రీకాళహస్తి 1,931, తిరుపతి 2,394, చంద్రగిరి 4,001, సదుం 2,551, పీలేరు 4,119, తంబళ్లపల్లె 2,820, మదనపల్లె 1,783, పలమనేరు 4,228, కు ప్పం 3,825 మందికి పనులు కల్పిస్తున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కన మొత్తం 34,796 మందికి మాత్రమే పనులు కల్పిస్తున్నారు. మిగిలిన 5.60 లక్షల మందికి పనుల్లేవు. ఒకవైపు వర్షాభావం, మరోవైపు కరువు నేపథ్యంలో అందరికీ పనులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

దీని గురించి ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. వాస్తవంగా 5.94 లక్షల మందికి ప్రభుత్వ నిబంధనల మేరకు రూ.169 చొప్పున రోజూ రూ.10,03,86,000 నిధులు వెచ్చించాల్సి ఉంది. అంత మొత్తం దేవుడెరుగు ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం మేరకైనా లక్ష మందికి రోజుకు రూ.1.69 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ప్రస్తుతం రోజూ 34,796 మందికి మాత్రమే పనులు కల్పిస్తున్నారు. కనీసం వీరికైనా ఒక్కొక్కరికి రూ.169 కూలి ఇస్తుంటే రూ.58,80,524 నిధులు వెచ్చించాల్సి వచ్చేవి. ప్రస్తుతం రోజూ ఒక్కొక్క కూలీకి రూ.105 లోపు మాత్రమే కూలి లభిస్తోంది.

ఈ లెక్కన రోజుకు ఉపాధి కూలీలకు ప్రభుత్వం రూ.34,53,580 మాత్రమే వెచ్చిస్తున్నట్లు ప్రభుత్వ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. పనులు లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా లక్షల సంఖ్యలో పేద లు వలసబాట పట్టారు. తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె, కుప్పం, పూతలపట్టు తదితర ప్రాంతాల నుంచి ప్రజలు బెంగళూరు, చెన్నైకు వలస వెళుతున్నారు. 80 శాతానికి పైగా బెంగళూరుకు వలస వెళుతుండగా, మిగిలిన 20 శాతం మంది చెన్నై ప్రాంతానికి వెళుతున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement