నిలదీస్తే అరదండాలే..! | Sakshi
Sakshi News home page

నిలదీస్తే అరదండాలే..!

Published Thu, Jan 7 2016 11:36 PM

Employment Field Assistants

విజయనగరం కంటోన్మెంట్: సమస్యలున్నాయంటూ వచ్చే ప్రజలు గ్రామ సభలో  నిలదీసి ప్రశ్నిస్తే అరెస్టు చేయిస్తామని  గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు చేసిన వ్యాఖ్యలు వినతులు ఇచ్చేందుకు వచ్చిన వారిని ఆందోళనకు గురిచేశాయి. జిల్లా వ్యాప్తంగా  గురువారం నిర్వహించిన జన్మభూమి గ్రామసభల్లో అధికారులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీశారు. పాత సభల్లోని వినతులను పరిష్కరించకుండా ఇప్పుడెందుకొచ్చారని ఎక్కడికక్కడ  నిలదీశారు.  గంట్యాడ మండలంలోని లక్కిడాంలో గురువారం జన్మభూమి గ్రామసభ నిర్వహించారు.
 
  ఈ సందర్భంగా ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు అక్కడికి వచ్చి తమను అన్యాయంగా తొలగించారనీ, ఎటువంటి కారణాలు చూపకుండా తొలగించడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై ఎంఎల్‌ఏ మాట్లాడుతూ ఆ వ్యవహారం కోర్టులో ఉంది కదా! కోర్టు తేలుస్తుంది. మాకు నచ్చినట్టు చేస్తాం. లేకపోతే లేదు. అంతే అంటూ గ్రామ సభ సాక్షిగా అనడంతో అక్కడి వారంతా అవాక్కయ్యారు.తమను ఎందుకు తొలగించారన్న  ఫీల్డ్ అసిస్టెంట్ల  ప్రశ్నలకు  సమాధానం చెప్పలేదు. పార్వతీపురం మండలం పెదబొండపల్లి, సూడిగాం, పుట్టూరు గ్రామాల్లో సమస్యలు పరిష్కరించడం లేదని  ప్రజలు అన్నప్పుడు అధికారులు సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా మిన్నకుండిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు  ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 బలిజిపేట మండలం గలావిల్లిలో గ్రామసభకు వచ్చిన అధికారులు పింఛన్లు, రేషన్ కార్డులను అర్హులైన అందరికీ ఎందుకు ఇవ్వడం లేదని, పార్టీ ప్రకారంగా ఇస్తున్నారని వైఎస్సార్ సీపీకి చెందిన ఎం శ్రీకాంత్ ప్రశ్నించారు. ఇక్కడ  టీలు, మంచినీరు అందించేందుకు విద్యార్థులను నియమించుకోవడంపై పలువురు నిర్ఘాంత పోయారు.
 
 ‘దారి’ చూపి సభ పెట్టండి
  సీతానగరం మండలం రంగంపేటలో కలెక్టర్ ఎంఎం నాయక్, ఎమ్మెల్యే చిరంజీవులు పాల్గొన్నారు. కొమరాడ మండలం దేవుకూనలో రహదారి నిర్మించాలని ఏళ్ల తరబడి అవస్థలు పడుతున్నా పట్టించుకోకపోవడం ఏంటని ముందు రహదారి సంగతి తేలాకే గ్రామసభ నిర్వహించాలని పట్టుపట్టారు. కురుపాం మండలం జి శివడలో ఎల్‌ఈడీ దీపాలకు రూ.50 చొప్పున వసూలు చేస్తున్నారని గ్రామస్తులు నిలదీశారు. అలాగే విద్యుత్ మీటర్లు వేయించేందుకు కూడా అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. విజయనగరంలోని 18,29 వార్డుల్లో జరిగిన జన్మభూమి గ్రామసభల్లో పింఛన్లు, రేషన్ కార్డులను టీడీపీ కార్యకర్తలకే ఇస్తున్నారని ఎమ్మెల్యే మీసాల గీత,   మేయర్ ప్రసాదుల రామకృష్ణలను వైఎస్సార్ సీపీ నాయకులు ఆశపు వేణు తదితరులు నిలదీశారు.
 
 మెరకముడిదాం మండలం సోమలింగాపురంలో గడచిన రెండు విడతల జన్మభూమి గ్రామసభల్లో గుర్తించిన సమస్యలు, వచ్చిన దరఖాస్తులను ఎందుకు పరిష్కరించలేదని విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి బెల్లాన చంద్రశేఖర్, స్థానిక నాయకులు బూర్లి నరేష్, ఎస్‌నారాయణ మూర్తి, రాజు, నాని తదితరులు నిలదీశారు. పెన్షన్లు, రుణమాఫీ, రేషన్ కార్డుల సమస్యలను పరిష్కరించని ఈ గ్రామ సభలు ఎందుకని ప్రశ్నించారు. బొబ్బిలిలోని 5,6 వార్డుల్లో నిర్వహించిన గ్రామసభల్లో జూట్ మిల్లు తెరిపించాలని   సీఐటీ యూ నాయకులు రెడ్డి వేణు, పొట్నూ రు శంకరరావు, రమణమ్మలు అధికారులను కోరారు. తెర్లాం మండలం నంది గాం, సతివాడ, కుసుమూరు గ్రామాల్లో అర్హులకు పింఛన్లు ఇవ్వలేదని నిలదీశా రు. ఎస్ కోట మండలంలోని ధర్మవరం గ్రామంలో ఇళ్లు, పింఛన్లు, మరుగుదొడ్ల బిల్లులు ఇవ్వలేదని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఎదుటే ప్రజలు అధికారులను నిలదీశారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement