బాబు వచ్చాక జాబులు ఊడుతున్నాయి.. ఇదెక్కడి న్యాయం? | Sakshi
Sakshi News home page

బాబు వచ్చాక జాబులు ఊడుతున్నాయి.. ఇదెక్కడి న్యాయం?

Published Tue, Aug 5 2014 2:37 AM

బాబు వచ్చాక జాబులు ఊడుతున్నాయి..  ఇదెక్కడి న్యాయం? - Sakshi

సాక్షి, అనంతపురం: ఎన్నికలకు ముందు ‘జాబు కావాలంటే బాబు రావాలి’ అన్నారు.. ఇప్పుడు బాబు వచ్చారు..కానీ మా జాబులు ఊడుతున్నాయి.. ఇదెక్కడి న్యాయమో చెప్పండి అంటూ ఐకేపీ వీఓఏలు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులును ప్రశ్నించారు.
 
 వీఓఏల బకాయి వేతనాల మంజూరు, ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు జీఓ ఉపసంహరణ, మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీల రద్దుపై రాజకీయ జోక్యానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది కార్మికులు సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో నగరంలోని టవర్‌క్లాక్ నుంచి ర్యాలీగా వెళ్లి డ్వామా కార్యాలయ ప్రాంగణానికి చేరుకున్నారు. ఆ సమయానికి డ్వామా కార్యాలయంలో మంత్రి పల్లె, చీఫ్ విప్ కాలవ, కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్‌లు అధికారులతో సమీక్షిస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఆందోళనకారులు అక్కడే రెండు గంటలపాటు బైఠాయించారు.  
 
 డీఆర్వో హేమసాగర్ వచ్చి ఆందోళనకారులతో జరిపిన చర్చలు సఫలం కాలేదు. మంత్రి వచ్చి తమకు న్యాయం చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చే వరకూ కదిలే ప్రసక్తే లేదని వారు అక్కడే భీష్మించారు. చివరకు పోలీసు బలగాలు వచ్చి ఆందోళన విరమించాలని కోరినా ససేమిరా అన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓబులు మాట్లాడుతూ 15 ఏళ్లుగా ఐకేపీలో వీఓఏలుగా  చాలచాలనీ వేతనాలతో పనిచేస్తున్నారన్నారు. 14నెలలుగా వీఓఏలకు వేతనాలు అందక వారు అవస్థలు పడుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. 75 శాతం ఉపాధి హామీ పనులు కల్పించలేకపోయారన్న సాకుతో ఫీల్డ్‌అసిస్టెంట్లను తొలగించాలని చూడడం దారుణమన్నారు.  
 
 గిట్టుబాటు కాకపోయినా అష్టకష్టాలు పడి విద్యార్థులకు భోజనాలు వండిపెడుతున్న తమను తొలగించి అధికార పార్టీ నాయకులు వారికి అనుకూలమైన వారిని నియమించుకోవాలని చూస్తున్నారని మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు ఆరోపించారు. అనంతరం సమీక్ష ముగించుకు ని బయటకు వచ్చిన మంత్రి పల్లె, చీఫ్ విప్ కాలవను ఆందోళనకారులు ఘెరావ్ చేశారు. వీఓఏల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
 
 ఉపాధి పనుల కల్పనను 75 నుంచి 60 శాతానికి తగ్గించి న్యాయం చేసేలా చూడాలని కమిషనర్‌తో సెల్‌లో మాట్లాడారు. ఆయన పరిశీలిస్తామని చెప్పినట్లు తెలిపారు. త్వరలోనే అధికార, ప్రతిపక్ష పార్టీ ల నాయకులు, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులతో ప్రత్యేకసమావేశం ఏర్పాటు చేసి ఏజెన్సీదారులకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.ఇంతియాజ్, నాయకులు వెంకటేశులు, ఓ.నల్లప్ప తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement