పార్టీ ఫిరాయింపులను పత్రికలే ప్రోత్సహిస్తే | Sakshi
Sakshi News home page

పార్టీ ఫిరాయింపులను పత్రికలే ప్రోత్సహిస్తే

Published Mon, Jun 30 2014 2:36 AM

పార్టీ ఫిరాయింపులను పత్రికలే ప్రోత్సహిస్తే - Sakshi

సాక్షి, నెల్లూరు ప్రతినిధి:  ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసే వారి చర్యలను ఎండగట్టాల్సిన పత్రికలు ఆ చర్యలను ప్రొత్సహించడం చూసి రాజకీయ పార్టీల నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పదవికి జరగనున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన కార్పొరేటర్లు టీడీపీకి మద్దతు ఇవ్వబోతున్నారంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఆదివారం ప్రచురితమైన కథనాలు ప్రజాస్వామ్యాన్ని తక్కువ చేసి చూపేందుకు దోహదపడుతాయని ప్రజాస్వామికవాదులు మండిపడుతున్నారు. ఇలాంటి చర్యలతో పత్రికల పాత్రపై ప్రజలకు విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు.
 
 పార్టీ ప్రతిపాదికన జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ వస్తే ఆ పార్టీ అభ్యర్థికి మేయర్ పదవి దక్కుతుంది. అలా కాకుండా ఒక పార్టీ తరపున ఎన్నికైన కార్పొరేటర్ మరో పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తే అతని సభ్యత్వం కూడా రద్దవుతుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. గుర్తింపు పొందిన వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు విప్ జారీ చేయవచ్చని, దానిని ఉల్లంఘించిన స్థానిక ప్రజా ప్రతినిధులు పదవీచ్యుతులవుతారన్నది ఆ నోటిఫికేషన్ సారాంశం.
 
 వీటినేవీ పరిగణనలోకి తీసుకోని ఈనాడు, ఆంధ్రజ్యోతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతోందని, ఆ పార్టీ కార్పొరేటర్లు టీడీపీకి మద్దతు ఇవ్వబోతున్నారని ప్రచారం చేయడాన్ని దిగజారుడు చర్యగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దుయ్యబట్టింది. నెల్లూరు కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో మొత్తం 54 డివిజన్లకు గాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 32 స్థానాలను గెలుచుకుంది. అంటే ఈ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఆ పార్టీకే వస్తాయి. అయితే అడ్డదారిన ఈ కార్పొరేషన్ గెలుచుకునేందుకు తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా ఆ రెండు పత్రికలు మరీ పోటీ పడి మద్దతిస్తున్న వైనం జుగుస్సా కలిగించేదిగా ఉన్నదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పత్రికల పాత్ర ప్రజాస్వామ్యాన్ని కాపాడేదిగా ఉండాలని ఆయన అన్నారు. మెజారిటీ స్థానాలు గెలుచుకున్న నెల్లూరు కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు తమ పార్టీకే దక్కుతాయని, టీడీపీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎంతగా ప్రలోభాలకు లోను చేసినా విజయం తమదేనని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ అన్నారు. ఇప్పటికే తమ పార్టీ విప్ జారీ చేసిందని, తమ పార్టీ సభ్యులందరూ విప్‌ను గౌరవిస్తారని ఆయన అన్నారు.
 

Advertisement
Advertisement