ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం | Sakshi
Sakshi News home page

ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం

Published Fri, Mar 17 2017 2:46 AM

ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం - Sakshi

కేంద్ర మంత్రి వెంకయ్య పునరుద్ఘాటన
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పునరుద్ఘాటించారు. ప్యాకేజీ రూపంలో రాష్ట్రానికి కేంద్రం నిధులందిస్తుందన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లా డుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే ఎంత మేరకు నిధులు వచ్చేవో చెప్పడం కష్టమేనన్నారు. మిగిలిన రాష్ట్రాలకు వెళ్తున్న నిధుల ఆధారంగా ఏపీకి నిధులు అందించేందుకు కేంద్రం ప్రణాళిక వేసిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ వ్యయం కేంద్రమే భరిస్తుందన్నారు. విద్యుత్‌ కేంద్రాల నిర్మాణ వ్యయాన్ని రాష్ట్రం భరించాలని, లేకుంటే ఉత్పత్తయ్యే విద్యుత్‌లో జాతీయ గ్రిడ్‌కు వాటా ఇవ్వాల్సుంటుందని వెంకయ్య అన్నారు. ఏపీకి రైల్వే జోన్‌ వ్యవహారం త్వరలోనే కొలిక్కి వస్తుందన్నారు.

జైట్లీ, వెంకయ్యలకు ధన్యవాదాలు: టీడీపీ ఎంపీలు
ఏపీకి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక సాయాన్ని ఆమోదించడంలో కృషి చేసినందుకు కేంద్ర మంత్రులు అరుణ్‌ జైట్లీ, వెంకయ్య నాయుడులకు టీడీపీ నేతలు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఆధ్వర్యంలో గురువారం పార్లమెంటులో ఎంపీలు కొనకళ్ల నారాయణ, అవంతి శ్రీనివాస్, మురళీమోహన్, నిమ్మల కిష్టప్ప, కేశినేని నాని కేంద్ర మంత్రులను కలసి అభినందనలు తెలిపారు.

Advertisement
Advertisement