హత్య కేసుల్లో వీడని మిస్టరీ! | Sakshi
Sakshi News home page

హత్య కేసుల్లో వీడని మిస్టరీ!

Published Tue, May 26 2015 1:13 AM

Enigmatical Mystery  in  murder case

హతుల కుటుంబ సభ్యుల్లో ఆందోళన
     కొనసాగుతూ ఉన్న దర్యాప్తు
     {పజల్లో పెరుగుతున్న భయాందోళనలు
 ఎస్.కోట: నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న హత్యలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుండగా పోలీసులకు కంటి మీద కునుకు ఉండటం లేదు. దారుణ హత్యలకు తెగబడుతున్నవారి తెలివితేటల ముందు పోలీసులు తెల్లముఖం వేస్తున్నారనే విమర్శలు పెరుగుతున్నాయి. రెండు నెలల క్రితం లక్కవరపుకోటలో జరిగిన వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించకముందే ఎస్.కోటలో ఈ నెల 11న జరిగిన రైల్వే ఉద్యోగి స్వాతి హత్య కలకలం సృష్టించింది. మరోవైపు.. అనుమానాస్పద స్థితిలో మరణించిన గుర్తుతెలియని మహిళ మృతదేహం ఆదివారం లభ్యమైంది. ఆమె మరణించి ఐదారు రోజులై ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. మృతురాలు ఎవరో.. ఎలా మరణించిందనే అంశాలు ఇంకా తేలలేదు. ఇప్పటికీ మిస్టరీ వీడని హత్య కేసుల వివరాలిలా ఉన్నాయి.
 
  ఈ నెల 11వ తేదీ రాత్రి ఎస్.కోట పట్టణ శివారులో రైల్వేస్టేషన్ పి.డబ్ల్యూ.డి. కార్యాలయం వెనుక ఉన్న 132/25 కె.వి.ట్రాక్షన్ సబ్‌స్టేషన్‌లో టెక్నీషియన్ చిట్టిమోజు స్వాతి (29), హెల్పర్ పార్వతి విధి నిర్వహణలో ఉండగా రాత్రి 9.30 గంటల సమయంలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు చొరబడ్డారు. పార్వతి ముఖంపై ఒకరు గోనె  కప్పి బయటికి ఈడ్చుకురాగా మిగిలిన ఇద్దరు స్వాతిపై బలైమైన ఆయుధంతో దాడి చేశారు. ఆమె ముఖం గుర్తుపట్టలేనంతగా ఛిద్రం చేసి చంపేశారు. ఈ కేసులో పోలీసులు  పురోగతి సాధించినట్టు సమాచారం లేదు.
 
  లక్కవరపుకోటకు చెందిన జామి సత్యనారాయణపై మార్చి 21న సమీప రైల్వే ట్రాక్ వద్ద దుండగులు దాడిచేశారు. సత్యనారాయణ స్పృహ కోల్పోవటంతో చనిపోయాడని భావించి వెళ్లిపోయారు. మరుసటి రోజు సత్యనారాయణను గుర్తించిన స్థానికులు, పోలీసులు విశాఖపట్నంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. వారంపాటు మృత్యువుతో పోరాడిన సత్యనారాయణ 28న మరణించారు.
 
 ముందుకెళ్లని దర్యాప్తు
 ఈ రెండు హత్య కేసుల్లో పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్‌టీమ్, ఫింగర్ ప్రింట్ ఎక్స్‌పర్ట్‌ల సేవలను వినియోగించుకున్నారు, పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. అయినా ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. దీంతో మృతుల కుటుంబ సభ్యులు కలవరం చెందుతన్నారు. హంతకులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తే వారికి కొంత ఉపశమనం కలుగుతుంది.
 

Advertisement
Advertisement