పుష్కరాల్లో పూజ సామగ్రి స్టాల్స్ | Sakshi
Sakshi News home page

పుష్కరాల్లో పూజ సామగ్రి స్టాల్స్

Published Fri, May 29 2015 2:11 AM

Equipment Puja stalls in puskaraghat

కొవ్వూరు : గోదావరి పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు అవసరమైన అన్నిరకాల పూజ సామగ్రిని స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా విక్రయిస్తామని డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డెరైక్టర్ ఎ.శ్యాంప్రసాద్ చెప్పారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో కొవ్వూరు డివిజన్ పరిధిలోని మహిళా సంఘాల ప్రతినిధులతో గురువారం సమావేశం నిర్వహిం చారు. స్వయంపాకం, గోదావరి పూజ, మూసి వాయనం (చనిపోయిన ముత్తైవుల పేరిట ఇచ్చే వాయనం) పేరుతో మూడు రకాల పూజ సామగ్రిని విక్రయిస్తామన్నారు.
 
 దేవాదాయ శాఖ నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఆయా పూజలకు అవసరమైన అన్ని సరుకులను కిట్స్ రూపంలో విక్రయించేలా చర్యలు చేపట్టినట్టు చెప్పారు. తద్వారా వచ్చే లాభాలు మహిళా సంఘాలకు అందుతాయన్నారు. ప్రధానంగా ఏ, బీ గ్రేడు స్నాన ఘట్టాలతోపాటు యాత్రికులు అధికంగా స్నానాలు ఆచరించే ప్రాంతాల్లో స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఆర్డీవో బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలకు ఆదాయ వనరులను పెంపొందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పూజ సామగ్రి విక్రయించేందుకు స్టాల్స్ ఏర్పాటు చేయిస్తోందన్నారు. మహిళా సంఘాలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
 
 నాణ్యత  పాటించడంతో  పాటు సేవాపరంగా మహిళా సంఘాలు బాధ్యతగా పనిచేస్తాయన్న నమ్మకంతో ఈ బాధ్యతను స్వయం సహాయక మహిళా సంఘాలకు అప్పగించారన్నారు. ఈ స్టాల్స్‌లో మహిళలు షిఫ్టుల వారీగా పనిచేయాల్సి ఉంటుందని, ఎక్కడెక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయాలన్న విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు. డీఆర్‌డీఏ నిడదవోలు ఏరియా కో-ఆర్డినేటర్ ఎం.మధు, డీపీఎం ఎల్.సుబ్బారావు, ఏపీఎంలు మంగతాయారు, అచ్చాయమ్మ, మహాలక్ష్మి, స్వయం సహాయక సంఘాల మహిళలు సమావేశానికి హాజరయ్యారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement