గుంటూరులో ఈఎస్‌ఐ మోడల్ ఆస్పత్రి | Sakshi
Sakshi News home page

గుంటూరులో ఈఎస్‌ఐ మోడల్ ఆస్పత్రి

Published Tue, Jul 14 2015 8:03 PM

ESI Model Hospital in Guntur

గుంటూరు : కార్మికుల ప్రభుత్వ బీమా (ఈఎస్‌ఐ) రాష్ట్ర మోడల్ హాస్పిటల్‌ను గుంటూరులో నిర్మించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ నాచారంలో స్టేట్ రిఫరల్ హాస్పిటల్‌ ఉంది. రాష్ట్ర విభజన అనంతరం తొలుత విజయవాడలో ఏపీకి స్టేట్ మోడల్ ఈఎస్‌ఐ హాస్పటల్‌ను నిర్మించాలని అధికారులు నిర్ణయించారు.

కానీ తర్వాత ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుని గుంటూరులోనే మోడల్ హాస్పిటల్‌ నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు గుంటూరు కృష్ణానగర్‌లోని కార్మిక ప్రభుత్వ బీమా డిస్పెన్సరీ ఉన్న స్థలాన్ని పరిశీలించారు. డిస్పెన్సరీ ఉన్న ప్రదేశంలో విశాలమైన స్థలం ఉండటంతో 200 పడకలతో హాస్పటల్ నిర్మించనున్నట్లు ఉన్నతాధికారులు ప్రకటన చేశారు.

మంగళవారం గుంటూరు ఈఎస్‌ఐ డిస్పెన్సరీని తనిఖీ చేసేందుకు వచ్చిన ఆ శాఖ జాయింట్ డైరక్టర్ డాక్టర్ జి.రవికుమార్ గుంటూరులో స్టేట్ మోడల్ హాస్పిటల్‌ నిర్మాణం జరుగుతుందనే విషయాన్ని ధ్రువీకరించారు. కేంద్ర ప్రభుత్వమే హాస్పిటల్‌ నిర్మాణం కోసం నిధులు ఇస్తుందని, వైద్యులు, వైద్య సిబ్బంది నియామకాలు కూడా కేంద్రమే చేపట్టి కార్మికులకు సూపర్‌ స్పెషాలిటి వైద్యసేవలను ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించారు.

జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, పీడియాట్రిక్ సర్జరీ, గైనకాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ , రేడియాలజీ, రేడియోథెరపి, ఆర్థోపెడిక్స్, ఆప్తామాలజీ తదితర స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలన్నీ కూడా మోడల్ ఈఎస్‌ఐ హాస్పిటల్‌లో అందుబాటులో ఉంటాయన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు గుంటూరులో నిర్మించే హాస్పిటల్‌ రిఫరల్ హాస్పటల్‌గా ఉంటుందని డాక్టర్ రవికుమార్ తెలిపారు.

Advertisement
Advertisement