విద్యా సేవా?.. వ్యాపారమా? | Sakshi
Sakshi News home page

విద్యా సేవా?.. వ్యాపారమా?

Published Sat, Dec 20 2014 1:54 AM

విద్యా సేవా?.. వ్యాపారమా?

* ఇంజనీరింగ్ కళాశాలల తీరుపై గవర్నర్ అసంతృప్తి
* కోర్సులు పూర్తి చేసినా.. విద్యార్థుల్లో నైపుణ్యం శూన్యం
* ఈ పరిస్థితిని వెంటనే చక్కదిద్దాలి

సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్య వ్యాపారంగా మారిపోయిందని, ఈ పరిస్థితిని వెంటనే నిర్మూలించాలని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ వ్యాఖ్యానించారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ కళాశాలల పనితీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సాంకేతిక విద్యా ప్రమాణాలు నానాటికీ క్షీణిస్తున్నాయని, ఇంజనీరింగ్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేయాల్సిన అవసరముందని సూచించారు. భారత ఇంజనీర్ల అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ విభాగం శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘29వ ఇంజనీరింగ్ కాంగ్రెస్’ సదస్సు కు ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ నరసింహన్... తన ప్రసంగంలో ఇంజనీరింగ్ విద్యా ప్రమాణాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

‘‘ఇంజనీరింగ్ కళాశాలలు విద్యా సేవ చేస్తున్నా యా? వ్యాపారం చేస్తున్నాయా? ఫీజు రీయిం బర్స్‌మెంట్ కోసమే కళాశాలలు తెరిచారా? ఇంజనీరింగ్ కోర్సు పూర్తిచేసిన వారికి స్కిల్ డెవలప్‌మెంట్ (నైపుణ్యాల అభివృద్ధి) అంటున్నారు. మరి నాలుగేళ్ల ఇంజనీరింగ్‌లో విద్యార్థులకు మీ రేం నేర్పిస్తున్నారు?’’ అని నరసింహన్ ప్రశ్నిం చారు. జాతీయ ప్రయోజనాల కంటే వ్యాపార ప్రయోజనాలే ఎక్కువయ్యాయని, ఇంజనీరింగ్ విద్యలో మార్పులకు ఇదే సరైన సమయమని ఆయన అభిప్రాయపడ్డారు.

విద్య వ్యాపారీకరణను తుద ముట్టించాలని వ్యాఖ్యానించారు. ఎంత మంది ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకుంటున్నారనేదాని కంటే ఎంత నైపుణ్యం సాధిస్తున్నారనేదే ముఖ్యమని గవర్నర్ పేర్కొన్నారు. దేశంలో మేధస్సుకు కొరత లేదని, దానిని వినియోగించుకోలేక పోతుండడమే ప్రధాన సమస్య అని చెప్పారు. ప్రపంచం గ్లోబల్ విలేజ్‌గా మారుతున్న ప్రస్తుత తరుణంలో నిస్సారంగా ఉండక, దేశ ఆర్థికోన్నతికి ఇంజనీర్లు దోహదపడాలని సూచించారు. నాణ్యమైన రహదారులు, సులువైన అనుసంధానం రూపాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారిం చాలని, విద్యుచ్ఛక్తి భద్రత కల్పనకు ఇంజనీరింగ్ సంస్థలన్నీ కలిసి కృషి చేయాలని పేర్కొన్నారు.

జల, థర్మల్ విద్యుత్ వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటే.. భారీ వ్యయంతో సోలార్ ప్రాజెక్టులు నిర్మించాల్సిన అవసరం ఉండబోదన్నారు. అదే సమయంలో గృహావసరాలకు సోలార్ విద్యుత్ వినియోగాన్ని నొక్కిచెప్పాలని సూచించారు. రాజ్‌భవన్‌లో 85% విద్యుత్ అవసరాలను సౌర విద్యుత్ ద్వారానే తీర్చుకుంటున్నామని, త్వరలోనే దీన్ని వంద శాతానికి తీసుకెళతామని గవర్నర్ తెలిపారు. సదస్సులో ఇంజనీర్ల అసోసియేషన్ ఆర్గనైజింగ్ చైర్మన్ జి. సుధాకర్, కార్యదర్శి బి. బ్రహ్మారెడ్డితోపాటు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఇంజనీర్లు హాజరయ్యారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement