Sakshi News home page

రూ.5వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎక్సైజ్ సీఐ

Published Tue, Nov 26 2013 12:39 AM

excise ci caught while taking bride in acb ride

 బెల్లంపల్లి, న్యూస్‌లైన్ :
 బెల్లంపల్లి ప్రొహిబిషన్ ఎక్సైజ్ సీఐ గుడిపాటి గురువయ్య సోమవారం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు చిక్కారు. ఎక్సైజ్ కార్యాలయంలో తాటి కో-ఆపరేటీవ్ సొసైటీ(టీసీఎస్) అధ్యక్షుడు కొయ్యడ నారాగౌడ్ నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ టి.సుదర్శన్‌గౌడ్ కథనం ప్రకారం.. పట్టణంలోని తాటి కో ఆపరేటీవ్ సొసైటీ నుంచి ఏడాదికి ఒకసారి ముడుపులు చేరుతున్నాయి. ఎక్సైజ్ సీఐగా వచ్చిన గురువయ్య ఏడాదికి ఒకసారి కాకుండా ప్రతి నెల రూ.15 వేలు చొప్పున మామూళ్లు అందజేయాలని టీసీఎస్ నిర్వాహకులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చాడు.
 
  సీఐ వేధింపులకు తాళలేక వారం రోజుల క్రితమే నారాగౌడ్ రూ.10 వేలు మామూళ్లు అందజేశాడు. మిగిలిన రూ.5 వేలు ఇవ్వాల్సిందేనని మూడు రోజుల నుంచి సీఐ వేధింపులను తీవ్రతరం చేశాడు. కల్లు సొసైటీ సరిగా నడవడం లేదని, ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని చెప్పినప్పటికీ సీఐ అవేమి పట్టించుకోకుండా మామూళ్లు ఇవ్వాల్సిందేనని ఆదేశించాడు. దీంతో సీఐ వేధింపులకు వేసారిన టీసీఎస్ అధ్యక్షుడు నారాగౌడ్, సభ్యుడు నాగరాజు కలిసి కాల్‌టెక్స్‌లో ఉన్న ఎక్సైజ్ కార్యాలయానికి సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో వెళ్లారు. తమ వెంట తీసుకొచ్చిన రూ.5 వేలను నారాగౌడ్ ఎక్సైజ్ సీఐ గురువయ్య చేతిలో ఇవ్వగా అక్కడే మాటువేసి ఉన్న ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ తన బృందంతో వచ్చి రెడ్‌హ్యాండెడ్‌గా గురువయ్యను పట్టుకున్నారు. లంచంగా తీసుకున్న రూ.5 వేలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు గురువయ్యపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపర్చుతామని డీఎస్పీ తెలిపారు. ఈ దాడిలో  ఖమ్మం ఏసీబీ సీఐ ఎం.వెంకటేశ్వర్‌రావు, కరీంనగర్ సీఐ వి.వి.రమణమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.
 
 ధైర్యంగా ఫిర్యాదు చేయండి..
 అవినీతి అధికారులపై బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ టి.సుదర్శన్‌గౌడ్ కోరారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలో అన్ని శాఖల ప్రభుత్వ అధికారులపై అవినీతి ఆరోపణలు తమ దృష్టికి వచ్చిందన్నారు. అనేక మంది ఫిర్యాదు చేస్తున్నారన్నారు. అవినీతి అధికారులు నేరుగా కాకుండా మధ్య దళారుల ద్వారా పరోక్షంగా ముడుపులు తీసుకుంటున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. ఆ రకంగా లంచం తీసుకున్న కేసు నమోదు చేస్తామన్నారు. మధ్య దళారులను కేసులో ఇరికిస్తామని స్పష్టం చేశారు. కొందరు బ్యాంకు ఖాతాల్లో లంచం డబ్బులు జమ చేయించుకున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం అడిగినట్లయితే సెల్‌ఫోన్ ద్వారా ఎస్‌ఎంఎస్ చేసిన స్పందిస్తామన్నారు. లంచం తీసుకున్న అధికారుల వివరాలను తెలియజేసే వ్యక్తుల పేర్లను అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. ఫిర్యాదు చేయదలిచిన వ్యక్తులు 9440446150, 9440446139 కు ఫోన్ ద్వారా తెలియజేయవచ్చన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement