ఎక్త్సెజ్ స్టేషన్ ముట్టడి | Sakshi
Sakshi News home page

ఎక్త్సెజ్ స్టేషన్ ముట్టడి

Published Sun, Feb 23 2014 2:15 AM

ఎక్త్సెజ్ స్టేషన్ ముట్టడి - Sakshi

మండవల్లి, న్యూస్‌లైన్ : మండలంలోని కానుకొల్లు గ్రామ మహిళలు స్థానిక ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్‌ను శనివారం ముట్టడించారు. తమ గ్రామంలో బెల్ట్‌షాపులు తొలగించాలని వారు డిమాండ్ చేశారు. బెల్ట్ షాపులు కూడా తొలగించలేని ఎక్సైజ్ స్టేషన్ వల్ల ఉపయోగమేమిటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన 50 మంది మహిళలు తొలుత ఆ గ్రామ సర్పంచ్ గూడవల్లి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎక్సైజ్ స్టేషన్ ముందు గంట సేపు ధర్నా నిర్వహించారు. స్ధానిక ఎస్‌ఐ ఎ.మణికుమార్ సిబ్బందితో వచ్చి పరిస్థితిని సమీక్షించారు.  ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఎక్సైజ్ అధికారుల అసమర్థత కారణంగా గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్‌షాపులు పెట్టి మద్యం విక్రయిస్తున్నారని ఆరోపించారు.
 
మా జీవితాలే ప్రశ్నార్థకమవుతున్నాయ్...


తామంతా పేద కుటుంబాలకు చెందినవారమని, కొంతకాలం నుంచి కానుకొల్లులో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్‌షాపులతో నానా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. తమ భర్తలకు మద్యం సేవించే అలవాటు ఉన్న కారణంగా వారి కూలి, తమ కూలి డబ్బులు సైతం మద్యం సీసాలకు బెల్ట్ షాపులలో ధారపోస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రి 11 గంటల వరకు నిర్వహిస్తున్న బెల్ట్‌షాపులు తమ జీవితాలను నాశనం చేస్తున్నాయని ఆవేదన చెందారు.

కనీసం పిల్లలు చదివించటానికి కూడా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నామని వివరించారు. చివరికి తమ జీవితాలే ప్రశ్నార్థకమవుతున్నాయని వాపోయారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్‌షాపులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ విషయంపై స్పందించిన ఎస్‌ఐ వంశీకృష్ణ మాట్లాడుతూ బెల్ట్‌షాపుల తొలగింపునకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
 
సీఐ అందుబాటులో లేకపోవటంతో ఎస్‌ఐకి మహిళలు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో శొంఠి చింతలమ్మ, గంధసిరి పెద్దింట్లమ్మ, శొంఠి నాగమణి, కాగిత నాగలక్ష్మి, గూడవల్లి సంపూర్ణ, పరసా దుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement