రైల్వే బడ్జెట్‌పై కసరత్తు | Sakshi
Sakshi News home page

రైల్వే బడ్జెట్‌పై కసరత్తు

Published Mon, Dec 9 2013 5:31 AM

Exercise on Railway Budget

 సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మమతా బెనర్జీ.. దినేష్ త్రివేది.. పవన్‌కుమార్ బన్సాల్.. కేంద్ర రైల్వేశాఖ మంత్రులు ఎవరైనా వారి బడ్జెట్‌లో జిల్లాకు ఒరిగింది శూన్యం. మన ఎంపీలు కసరత్తు చేసి పంపిన ప్రతిపాదనలు రెండేళ్లుగా బుట్టదాఖలు అవుతున్నాయి. 2013-14 రైల్వే బడ్జెట్‌లో ఆదిలాబాద్ ఎంపీ రమేశ్ రాథోడ్, పెద్దపెల్లి ఎంపీ వివేక్ 80కి పైగా ప్రతిపాదనలు పంపించారు. ఇందులో ఒక్క రైలు, ఓ రైలు మార్గం మినహాయిస్తే ఆ రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు ఒరిగిందేమి లేదు. మంచిర్యాల-ఆదిలాబాద్ కొత్త రైలు మార్గానికి గ్రీన్‌సిగ్నల్ లభించగా, సికింద్రాబాద్ నుంచి వయా ముత్కేడు, ఆదిలాబాద్‌కు డబ్లింగ్ పనులకు ఓకే చెప్పారు. హైదరాబాద్ నుంచి బెల్లంపల్లి ఎక్స్‌ప్రెస్‌ను సిర్పూర్ కాగజ్‌నగర్ వరకు పొడిగించారు. ఇవి మినహాయిస్తే జిల్లాకు 2013-14 బడ్జెట్‌లో ఒరిగిందేమీ లేదు. మంచిర్యాల-ఆదిలాబాద్ కొత్త రైలు మార్గం కోసం రూపాయి కేటాయించలేదు. పెండింగ్ ప్రతిపాదనలకు మోక్షం కలుగుతుందనుకుంటే ఆశలు నిరాశలే అయ్యాయి.
 
 కొత్త రైళ్ల ప్రతిపాదనలు గట్టెక్కని వైనం
 2011లో మమతా బెనర్జీ, 2012లో దినేష్ త్రివేది, 2013లో పవన్‌కుమార్ బన్సాల్ మూడేళ్ల రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు అడుగడుగునా అన్యాయమే జరిగింది. పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు వివేక్, రమేశ్ రాథోడ్ సమస్యలు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్తున్నా ప్రయోజనం కలగడం లేదు. ఆదిలాబాద్-గఢీచందూర్, పటాన్‌చెరు-ఆదిలాబాద్‌లతోపాటు నాలుగు కొత్త రైల్వేలైన్ల నిర్మాణం కోసం గతంలో చేసిన ప్రకటన అమలు కాలేదు. కొత్తగా మంచిర్యాల-ఆదిలాబాద్‌కు రైలుమార్గంను మంజూరు చేయడం హాస్యాస్పదంగా ఉంది. హైదరాబాద్‌కు వెళ్లేందుకు ఆదిలాబాద్-పటాన్‌చెరు వయా నిర్మల్, ఆర్మూరు, కామారెడ్డిల మీదుగా రైల్వేలైను 2010-11 బడ్జెట్‌లో మంజూరు కాగా కేవలం సర్వేలకే పరిమితమైంది. మైసూర్-హౌరా వయా గొండియా, ఆదిలాబాద్ మీదుగా రైలును బడ్జెట్‌లో మంజూరు చేసి చివరకు మరో మార్గానికి మళ్లించారు.
 
 హైదరాబాద్-బెల్లంపల్లి ఎక్స్‌ప్రెస్‌ను సిర్పూరు కాగజ్‌నగర్ వరకు ఈసారి పొడిగించినా, నాందేడ్-దౌడ్ ప్యాసింజర్, ఆదిలాబాద్-పర్లి, నాందేడ్-పూణే-నాందేడ్ తదితర రైళ్ల పొడిగింపు ప్రస్తావనకు రాలేదు. ప్రతి ఎక్స్‌ప్రెస్ రైలు బాసర పుణ్యక్షేత్రంలో ఆపాలని, తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను రెబ్బన, ఆసిఫాబాద్‌లలో ఆపాలన్న ప్రతిపాదనలకు మోక్షం కలగలేదు. నాందేడ్-జైపూర్ రైలును ఆదిలాబాద్ మీదుగా నడపాలన్న డిమాండ్ నెరవేర లేదు. ఇలా అనేక కొత్త లైన్లు, రైళ్ల ప్రతిపాదనలు పెండింగ్‌లోనే ఉండగా. రైల్వేస్టేషన్ల ఆధునీకరణ, వసతులు కరువయ్యాయి.
 
 2014-15 బడ్జెట్‌కు ప్రతిపాదనల     కోరిన ప్రభుత్వం
 రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు ప్రాతినిధ్యం కలిగేలా ప్రతీసారి ఎంపీలు ప్రతిపాదనలు చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. కొత్త రైలు మార్గాలు, ప్రధాన రైలు మార్గాల ఆధునికీకరణ, నాలుగు లైన్ల విస్తరణ, రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ తదితర అంశాలు ప్రతిపాదనలకే పరిమితం అవుతున్నాయి. పెద్దపల్లి, ఆదిలాబాద్ ఎంపీలు ప్రతీసారి రైల్వే బడ్జెట్ సమయంలో కేంద్రానికి ప్రతిపాదనలు చేస్తున్నామని చెప్తున్నా కేంద్ర ప్రభుత్వస్థాయిలో ఒత్తిడి లేని కారణంగా జిల్లా సమస్యలు బుట్టదాఖలు అవుతున్నాయన్న చర్చ ఉంది. ఫలితంగానే జిల్లా నుంచి వెళ్లిన ప్రతిపాదనలకు మోక్షం కలగడం లేదని అంటున్నారు. అయితే 2014-15 రైల్వే బడ్జెట్ కోసం ఇప్పటినుంచే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఇటీవలే ఎంపీలను కోరింది.
 
 ఈ ప్రభుత్వ హయాంలో ఇదే ఆఖరి బడ్జెట్ కానుండటం, ఆ తర్వాత సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసారి జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కీలకంగా మారాయి. రెండు నెలల ముందుగానే పార్లమెంట్ సభ్యులు తమ ప్రతిపాదనలు రాష్ర్ట ప్రభుత్వానికి సమర్పించాలని తాజాగా సమాచారం అందడంతో జిల్లాకు చెందిన ఎంపీలు వివేక్, రమేశ్‌లు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. నాలుగేళ్లలో చేసిన ప్రతిపాదనలు, అందులో పరిష్కారానికి నోచుకున్న అంశాలు వదిలేసి కీలకమైన సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లే పనిలో నిమగ్నం అయినట్లు వారి అనుచరులు చెప్తున్నారు. తాజా ప్రతిపాదనల తయారీ నేపథ్యంలో ఎంపీలు తమ తమ అనుచరులను కూడా రైల్వేసమస్యల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. మరో ఐదారు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మన ఎంపీలు సమర్పించే ప్రతిపాదనలు కీలకం కాగా, ఈసారైనా ఆ ప్రతిపాదనలు గట్టెక్కుతాయా? అన్న సందేహాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement