రాములోరి భూములపై కన్ను.. | Sakshi
Sakshi News home page

రాములోరి భూములపై కన్ను..

Published Wed, Dec 24 2014 4:19 AM

Eyes on land

చిలకలూరిపేటరూరల్ : రాములోరి భూములపై అక్రమార్కుల కన్ను పడింది.  స్వామివారి ధూప దీప నైవేద్యాల నిమిత్తం అందించిన  భూమిని విక్రయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజధాని నేపథ్యంలో జిల్లాలో  భూములకు పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని దీనిపై అక్రమార్కులు కన్నేసినట్టు సమాచారం. దీనిలో భాగంగానే రాములోరి భూములను అమ్మి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. ఈ వ్యవహారం అంతా దేవాదాయ శాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని భక్తజనం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎప్పటి నుంచో ఈ భూమి సాగులో ఉన్నా 25 ఏళ్ల నుంచి దేవాదాయ శాఖకు కౌలు సొమ్ము జమ కావడం లేదని సమాచారం. వివరాల్లోకి వెళితే...
 
 చిలకలూరిపేటలోని బంగారపు కొట్ల బజారు వద్ద ఉన్న కోదండ రామాలయానికి పసుమర్రులో 1.62 ఎకరాల భూమి (సర్వే నంబర్ 762) ఉంది. ఈ భూమి దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్నట్లు సబ్ రిజిస్టార్ కార్యాలయ రికార్డులు తెలుపుతున్నాయి. వీటికి భిన్నంగా రెవెన్యూ రికార్డులు, అడంగల్‌లో మరో పేరు ఉన్నట్టు తెలిసింది.
 
 స్వామివారి కల్యాణం...ఊరేగింపు..
  పూర్వపు రోజుల్లో ఈ పంట భూమిలోనే శ్రీరామనవమి, స్వామివారి కల్యాణం నిర్వహించేవారు.  దీని కోసం ఇక్కడ రాతితో కల్యాణ మండపం నిర్మించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు నిర్వహించేందుకు ఈ పొలంలో నేలబావి తవ్వించారు. దశాబ్దాల కిందట మూడు రోజుల పాటు స్వామివారి కల్యాణాన్ని నిర్వహించిన అనంతరం రాత్రి వేళ కాగడాలతో ఉత్సవ విగ్రహాలను ఊరేగించేవారని పలువురు పెద్దలు, రామభక్తులు తెలిపారు.
  ఈ భూమిని 25 ఏళ్ల కిందటి వరకు ట్రస్టీల వారసులు సాగు చేసుకున్నారు. అనంతరం కౌలుకు ఇవ్వసాగారు. అయితే కౌలుదారుడు కౌలు సొమ్ము చెల్లించకపోవడమే కాకుండా, పక్కకు వైదొలగమన్నా తప్పుకోకపోవడం వివాదంగా మారింది. తాను పక్కకు తప్పుకోలంటే భూమి అమ్మితే తనకూ కొంత మొత్తం ఇవ్వాలని షరతు పెడుతున్నట్టు తెలిసింది.
 
 స్పందించని దేవాదాయ శాఖ ...
 దేవాదాయ శాఖకు చెందిన భూములను ప్రతి మూడేళ్లకు ఒకసారి బహిరంగ వేలం నిర్వహించి ముందుకు వచ్చిన రైతులకు కౌలుకు ఇవ్వాలి. అయితే ఇక్కడ ఏకంగా 25 ఏళ్ల నుంచి ఒకే వ్యక్తి భూమి సాగు చేస్తున్నా మిన్నకుండిపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది.
 
 ఎకరా కౌలు రూ.12వేల చొప్పున స్వామివారి భూమి 1.62 ఎకరాలకు ఏడాదికి సుమారు రూ.19,440 రావాలి. ఇలా  25 ఏళ్లకు దాదాపు రూ. 4.86 లక్షల ఆదాయం రావాలి. వాటిని వసూలు చేసి ఆలయ అభివృద్ధికి వినియోగించాల్సిన అధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారని భక్తజనం ఆరోపిస్తోంది.
 
 ఇక ఆలయ భూములను రికార్డుల పరంగా చూస్తే ఆర్.ఎస్.ఆర్ ఫీల్డ్‌మ్యాప్‌లో ధర్మతోపు అని నమోదు చేశారు. ఇందుకు భిన్నంగా అడంగల్‌లో సర్వే నంబర్ 762లో 1.22 ఎకరాలు ఒకరి పేరు, 40 సెంట్ల భూమి మరొకరి పేరుతో ఉంది. దీని ఆధారంగా కొందరు వ్యక్తులు ఈ భూమిని అమ్మి సొమ్ము చేసుకునేందుకు మంతనాలు సాగిస్తున్నట్టు భక్తజనం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరో వైపు కోదండ రామస్వామి భూమిని గోవుల మేతకు కేటాయించాలని రామభక్తులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
 
 అది రాములోరి భూమే..
  సంబంధిత సర్వే నంబరులోని భూమి దేవాదాయ శాఖకు చెందిన రామాలయ భూమే.ఇప్పటివరకు కౌలు చెల్లించకపోవడంపై నోటీసులు జారీ చేస్తాం. అంతేగాక ఇక్కడ జరుగుతున్న అన్ని విషయాలను ఉన్నతాధికారులకు నివేదించి స్వామి వారి భూమి పరిరక్షణకు చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తా.
 - నాగిశెట్టి శ్రీనివాసరావు,
 ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి
 

Advertisement
Advertisement