అంతటా.. అప్రమత్తం | Sakshi
Sakshi News home page

అంతటా.. అప్రమత్తం

Published Fri, May 3 2019 8:41 AM

Fani Cyclone Effect in Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఫొని తుపాను తీరం దాటుతున్నందున భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయంటూ వాతావరణశాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తుపాను ప్రభావంతో గురువారం ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి జల్లులు కురిశాయి. సూపర్‌ సైక్లోన్‌గా మారిన ఫొని విశాఖ తీరానికి 154 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ ప్రభావంతో జిల్లాలోని తీరప్రాంత మండలాల్లో ఈదురుగాలులు వీచాయి. విశాఖ నగరంలో అడపా దడపా ఓ మోస్తరు జల్లులు కురిశాయి. జిల్లాలో తేలిక పాటి జల్లులు తప్ప తుపాను ప్రభావం పెద్దగా కనిపించలేదు. కాగా విశాఖ నుంచి వెళ్లే 11 విమాన సర్వీసులను రద్దు చేయగా, 89 రైళ్ల రాకపోకలను నిలిపివేసినట్టుగా అధికారులు ప్రకటించారు. తుపాను బాధితులకు అవసరమైన సహాయ సామగ్రి, వైద్య సహాయ బృందాలతో ఇప్పటికే యుద్ధనౌకలు తీరంలో సిద్ధంగా ఉంచారు. వైద్య బృందాలు, డైవింగ్‌ సిబ్బంది ఇప్పటికే రోడ్డు మార్గంలో ఒడిశాకు పంపారు. సహాయక బృందాల తరలింపు కోసం హెలికాప్టర్లను కూడా నేవీ సిద్ధం చేసింది. మరో వైపు రెండు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను ఉంచారు.

జిల్లా వ్యాప్తంగా బుధవారం 65 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయగా గురువారం మరో 14 కేంద్రాలను అదనంగా పెంచారు. సగానికి పైగా కేంద్రాల్లో గురువారం మధ్యాహ్నం, సాయంత్రం కూడా తుపాను బాధితులకు భోజనాలు పెట్టినట్టుగా అధికారులు ప్రకటించారు. దాదాపు ప్రతి కేంద్రంలోనూ రెండువందల నుంచి ఐదు వందల మంది వరకు బాధితులు ఆశ్రయం పొందినట్టుగా చెబుతున్నారు. రేషన్‌ షాపులు, ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి బియ్యం, కంది పప్పు, ఆయిల్, ఉప్పు తదితర నిత్యావసరాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం కూడా పునరావాస కేంద్రాల్లో తుపాను బాధితుల కోసం భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్టుగా అధికారులు ప్రకటించారు. అవసరమైతే శుక్రవారం రాత్రి కూడా పునరావాస కేంద్రాల్లో భోజనాలు ఏర్పాటు చేస్తామన్నారు.

కలెక్టరేట్‌లో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో జిల్లా యంత్రాంగం 24 గంటలూ సమీక్షిస్తుంది. అదేవిధంగా డివిజన్, మండల స్థాయిల్లో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటుచేసి అధికారులు ఎప్పటికప్పుడు తుపాను పరిస్థితులను సమీక్షిస్తున్నారు. విశాఖకు 154 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న తుపాను అర్ధరాత్రి దాటి సమయానికి విశాఖ సరిహద్దు దాటి ఒడిశా వైపు దూసుకెళుతోందని, శుక్రవారం మధ్యాహ్నానికి పూరి వద్ద తీరం దాటే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో ఈరోజు రాత్రి నుంచి రేపు మధ్యాహ్నం వరకు బలమైన ఈదురు గాలులు వీస్తాయని, రేపు రాత్రి వరకు  జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అందువలన అంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ కాటం నేని భాస్కర్‌ అధికారులను ఆదేశించారు.తుపాను ప్రత్యేకాధికారి గోపాలరావు, నర్సీపట్నం ఆర్డీవో గోవిందరావు, ఏఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌లు తీరప్రాంత గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. పోలీసు, అగ్నిమాపకశాఖ సిబ్బంది కూడా తుపాను ప్రభావిత గ్రామాల్లో ఎప్పటికప్పుడు పర్యటిస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారన్నారు.

సరంజామా  సిద్ధం
500 లైఫ్‌ బాయ్స్, 1500 లైఫ్‌ జాకెట్లను జిల్లా యంత్రాంగం కలెక్టరేట్‌లో సిద్ధం చేసింది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ టీమ్‌ 10 పవర్‌ సాస్, యాక్స్‌లు, 4 ఆస్కా లైట్లు సిద్ధం చేయగా, రెండు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు 60 పవర్‌ యాక్స్‌లు అందుబాటులో ఉంచాయి. అగ్నిమాపక శాఖ సైతం 52 యాక్స్‌లు, 5 ఆస్కా లైట్లు, 76 లైఫ్‌ బాయ్స్, 83 లైఫ్‌ జాకెట్లు, ఒక బోట్‌ సిద్ధం చేసుకున్నాయి. ఆర్‌అండ్‌ బీ శాఖ, పంచాయతీరాజ్‌ శాఖలు 20 యాక్స్‌లు 14 జేసీబీలు అందుబాటులో ఉంచాయి. అటవీ, ఏపీఈపీడీసీఎల్‌ కలిసి 31 పవర్‌ సాలు, నాలుగు సెర్చ్‌లైట్లు సిద్ధం చేసుకున్నాయి.

కట్టుదిట్టమైన ఏర్పాట్లతో కోస్ట్‌గార్డ్‌
విశాఖసిటీ: తీరంలో అలజడి రేపుతున్న ఫొని తుపానును ఎదుర్కొనేందుకు భారత తీరభద్రతా దళం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. తీరం వెంబడి పూర్తిస్థాయిలో సిబ్బందిని సరంజామాతో మోహరించింది. రాష్ట్ర పరిపాలన సిబ్బంది, ఎన్‌డీఆర్‌ఎఫ్, బారత నౌకాదళంతో కలిసి ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు సమాయత్తమైంది. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, ఫిరోజ్‌గంజ్, హల్దియాహవాలో పూర్తి సరంజామాతో 12 బృందాలను అప్రమత్తం చేసింది. విశాఖ తీరం వెంబడి 8 బృందాలతో పాటు ఫ్రంట్‌లైన్‌ షిప్స్‌లో మరో రెండు బృందాలు ఏర్పాటు చేసింది.
 రెండు ఎయిర్‌ క్రాఫ్ట్‌లను సైతం లైఫ్‌బోట్లు, గార్డులు, లైఫ్‌ జాకెట్లతో చెన్నైలో సిద్ధంగా ఉంచినట్లు కోస్ట్‌గార్డు వర్గాలు వెల్లడించాయి. మెరైన్‌ పోలీసులతో కలిసి సంయుక్త కార్యచరణను సిద్ధం చేసుకున్నామనీ, తీరప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరికీ ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తూ.. వారిని అప్రమత్తం చేస్తున్నామని కోస్ట్‌గార్డు వర్గాలు తెలిపాయి.

పునరావాస కేంద్రాలు ఏర్పాటు
ఫొని తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న మండలాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అచ్యుతాపురం మండలంలో 7, రాంబిల్లిలో 5, ఎస్‌.రాయవరంలో 2, నక్కపల్లిలో 8, పాయకరావుపేటలో 6, భీమిలిలో 10, గాజువాకలో 10, పరవాడలో 2, పెదగంట్యాడలో 7, విశాఖ రూరల్‌లో 6, విశాఖ అర్బన్‌లో 16 చొప్పున మొత్తం 79 పునరావాస కేంద్రాలు అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఇవీ చర్యలు
ప్రతి జోన్‌లోనూ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు, 8 గంటల షిఫ్ట్‌ చొప్పున 24 గంటలూ అందుబాటులో సిబ్బంది.
8 జోన్లలో 53 పునరావాస కేంద్రాలు ఏర్పాటు
10 లక్షల మంచినీటి ప్యాకెట్లు సిద్ధం
మంచినీటి సరఫరాకు అందుబాటులో 56 వాటర్‌ ట్యాంకర్లు
సిటీ సెల్‌ టవర్స్‌ పర్యవేక్షణకు 20 మంది సిబ్బంది నియామకం
ప్రతి పంపింగ్‌ స్టేషన్‌లోనూ జనరేటర్‌ ఏర్పాటు. విద్యుత్‌ అంతరాయం ఏర్పడినా... నీటి సరఫరాకు ఇబ్బంది తలెత్తకుండా చర్యలు

జీవీఎంసీ నిరంతర పర్యవేక్షణ
విశాఖసిటీ: కోస్తాను వణికిస్తున్న ఫొని తుపాను పట్ల జీవీఎంసీ ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. ప్రకృతి విపత్తు కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా.. నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అన్ని జోన్లలోనూ పునరావాస కేంద్రాలు, మంచినీటి ట్యాంకర్లను సిద్ధం చేశారు. మరోవైపు సిటీ సెల్‌ టవర్స్‌ పర్యవేక్షించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరి సెలవులు రద్దు చేస్తూ.. 24 గంటలూ తుపాను ప్రభావాన్ని పర్యవేక్షించాలని కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు.ముంచుకొస్తున్న ఫొని తుపానును సమర్థంగా ఎదుర్కొనేందుకు మహా విశాఖ నగర పాలక సంస్థ సమాయత్తమైంది. తుపాను ప్రభావం తీవ్రంగానే ఉంటుందనే హెచ్చరికల నేపథ్యంలో జీవీఎంసీ కమిషనర్‌ హరినారాయణన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫొని సృష్టించే ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కమిషనర్‌ ఆదేశించారు. అన్ని జోన్లలో కంట్రోల్‌ రూమ్‌లు పనిచేసేలా చూడాలని 24 గంటలూ సిబ్బంది అప్రమత్తంగా ఉండి.. ప్రతి ఫిర్యాదును స్వీకరించి దాన్ని త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రయత్నించాలని సూచించారు. తుపాను కారణంగా ప్రజలు ఎలాంటి అవస్థలు పడినా.. తక్షణమే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎప్పటికప్పుడు తుపాను నివేదికల్ని తనకు అందించాలని అధికారులను సూచించారు. అన్ని పంపింగ్‌ స్టేషన్లలోనూ, ఇతర అత్యవసర ప్రాంతాల్లో జనరేటర్లు సిద్ధం చెయ్యాలన్నారు. జోనల్‌ కమిషనర్లు తమ పరిధిలో ఉన్న పునరావాస కేంద్రాల్లో ఎలాంటి లోపం తలెత్తకుండా సహాయ చర్యలు యుద్ధ ప్రాతిపదికన నిర్వర్తించాలని కమిషనర్‌ ఆదేశించారు.

Advertisement
Advertisement