కస్సుబుస్సు | Sakshi
Sakshi News home page

కస్సుబుస్సు

Published Sat, Oct 24 2015 12:55 AM

కస్సుబుస్సు - Sakshi

పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు
బాదుడు నెలకు రూ.కోటి!
ఇక పల్లె వెలుగూ భారమే
{పయాణికుల్లో తీవ్ర ఆగ్రహం
 

విశాఖపట్నం: ఒకపక్క నింగిలో నిత్యావసర సరకులు విహరిస్తున్నాయి. పప్పులు, ఉప్పులూ, కూరగాయలు అందనంత ఎత్తుకు పెరిగిపోయాయి. వాటితోనే కుటుంబాన్ని ఈదలేకపోతున్న జనానికి తాజాగా ఆర్టీసీ చార్జీలు వచ్చిపడ్డాయి. ప్రయాణికుడి నడ్డి విరచడానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఆర్టీసీ చార్జీలు భారంగా మారాయి. ప్రభుత్వం శుక్రవారం అర్థరాత్రి నుంచి 5 నుంచి 10 శాతం వరకు చార్జీలను పెంచేసింది. ఇందులో ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్‌లగ్జరీ, ఇంద్ర, గరుడ వంటి బస్సులతో పాటు సామాన్యుడికి అందుబాటులో ఉన్న పల్లె వెలుగు బస్సులనూ వదల్లేదు. పెంచిన చార్జీలతో విశాఖ ఆర్టీసీ రీజియన్‌కు నెలకు ఎంత ఆదాయం    సమకూరుతుందో తెలుసా? రోజుకు రూ.3 నుంచి 4 లక్షలు! సగటున నెలకు రూ.కోటికి పైమాటేనన్న మాట!! అంటే నెలకు రూ.కోటి రూపాయల భారం ప్రయాణికులపై పడుతున్నట్టు లెక్క. విశాఖ రీజియన్ పరిధిలో తొమ్మిది డిపోల్లో సుమారు 1060 బస్సులున్నాయి. వీటి ద్వారా రోజుకు సగటున రూ.80 లక్షల వరకు ఆదాయం సమకూరుతుంది. పండగలు తదితర సీజన్లలో మరో రూ. ఐదు లక్షలు అదనంగా రాబడి వస్తుంది. ఇప్పటికే విశాఖ రీజియన్ ఆదాయంలో సంతృప్తికరంగా ఉంది. తాజాగా పెరిగిన చార్జీలతో ప్రయాణికులకు బాదుడే అయినా ఈ రీజియన్‌కు మాత్రం మరింతగా ఊరట కలగనుంది. అయితే దసరా పండగ వెళ్లి 24 గంటలైనా గడవక ముందే సర్కారు దొంగ దెబ్బతీసినట్టుగా ఆర్టీసీ చార్జీలు మోతమోగించిందంటూ ప్రయాణీకుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
 
 ప్యాకేజీ రాలేదని ప్రజలపై పడ్డారు..!
 ప్రత్యేక ప్యాకేజీ కోసం ఇన్నాళ్లు ఎదురు చూసిన సీఎం చంద్రబాబు ఆఖరికి అది వచ్చే దారి కనిపించకపోవడంతో ప్రజలపై భారం వేసేందుకు సిద్ధపడ్డాడు. అందుకే ప్రధాని మోడీ ఆంధ్ర నుంచి వెళ్లిన వెంటనే ప్రజలపై తన అక్కసు వెళ్లగక్కేలా రూ. 10 శాతం భారం మోపాడు. ప్రజలపై ఇప్పుడు వేస్తున్న వడ్డనకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.
 -గుడివాడ అమరనాథ్,
 జిల్లా అధ్యక్షుడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ
 
ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వమిచ్చిన కానుక
 రాష్ట్ర రాజధాని శంకుస్థాపన తరువాత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకిచ్చిన కానుక. ఆర్టీసీ నష్టాలలో ఉందనటం వాస్తవం. దానిని బయటపడటానికి ప్రభుత్వం ఆర్టీసీకి సబ్సిడీ ఇవ్వాలి. ఆర్టీసీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు. ప్రజల ఆదాయ వనరులు పెరిగేటటువంటి మార్గం లేకుండా అన్నింటికి ధరలు పెంచుకుంటూ పోవటం అన్నది ప్రజలమీద భారం మోపటమే.
 -జేవీ సత్యనారాయణ,
 సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి
 
ధరలు పెంచాల్సిన అవసరం లేదు

 ఆర్టీసీ ఛార్జీలు పెంచాల్సిన అవసరంలేదు. ప్రజలమీద భారం వేయడానికి ప్రభుత్వం ధరలు పెంచుతుంది. ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాల్సిన సహకారం ఇవ్వటంలేదు. రాష్ట్ర విభజనలో ప్రభుత్వం నష్టాన్ని భరిస్తామని హామినిచ్చింది. తాజాగా ప్రజలపై పన్నులు, ఛార్జీల రూపంలో భారం మోపటం సరికాదు. దీనిని సీపీఎం పూర్తిగా వ్యతిరేకిస్తుంది.
 -సి.హెచ్.నరసింగరావు,
 సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు
 
 భారం మోపనన్నారు.. అదే చేస్తున్నారు..!
 ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలప్పుడు ప్రజలపై భారం వేయనన్నాడు. కానీ ఇప్పుడు తినడానికే తిండి లేకుండా బాధ పడుతుంటే ఆర్టీసీ ఛార్జీలు పెంచి తన పైశాచికత్వాన్ని చాటుకుంటున్నాడు. రూ. వందల కోట్లు రాజధాని శంకుస్థాపన కోసం ఖర్చు చేయడం కన్నా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే బాగుండేది. ఎన్నికలప్పటికీ ఇప్పటికీ చంద్రబాబులో చాలా మార్పు కనిపిస్తోంది. ప్రజలను వంచించడానికే ఇప్పుడు ఉన్నాడనిపిస్తోంది.  
 -ద్రోణంరాజు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి
 
 ఒకే సారి భారీగా పెంచడం సరికాదు..!

 ఒకే సారి భారీగా ఛార్జీల భారం పడేలా పెంచడం సరికాదు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని రీ ఆర్గనైజ్ చేయడానికి అవసరమైన చర్యలు ప్రభుత్వం చేపట్టకుండా నేరుగా ప్రజలనే లక్ష్యంగా చేసుకోవడాన్ని నిరసిస్తున్నాం. సామాన్య ప్రజానీకానికి ఆర్టీసీ బస్సు ఒక్కటే రవాణా అవసరాలను తీర్చుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఛార్జీలు వడ్డన బాధాకరం. ప్రభుత్వం పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలి.
 -పి.వి.నారాయణ రావు,
 నగర అధ్యక్షుడు బీజేపీ

ఎక్కడ నుంచి ఎక్కడకు:     పాత     కొత్త
విశాఖపట్నం-విజయవాడ (సూపర్‌లగ్జరీ)    420    460
విశాఖపట్నం-తిరుపతి (ఇంద్ర ఏసీ)    1109    1202
విశాఖపట్నం-చెన్నై (గరుడ)    1367    1482
విశాఖపట్నం- హైదరాబాద్ (సూపర్‌లగ్జరీ0    726    797
విశాఖపట్నం-హైదరాబాద్ (గరుడ)    1061    1182
విశాఖపట్నం-రాజమండ్రి (డీలక్స్)సింగిల్‌స్టాప్    218    255
విశాఖపట్నం-కాకినాడ (సూపర్‌లగ్జరీ)    195    215
విశాఖపట్నం-విజయనగరం (డీలక్స్)    47    51
విశాఖపట్నం-శ్రీకాకుళం (నాన్‌స్టాప్ డీలక్స్)    107    116
విశాఖపట్నం-పాడేరు (ఎక్స్‌ప్రెస్)    92    100
విశాఖపట్నం-పాడేరు (డీలక్స్)    101    112
 

Advertisement
Advertisement