పరిహారం.. పరిహాసం | Sakshi
Sakshi News home page

పరిహారం.. పరిహాసం

Published Thu, Oct 26 2017 8:20 AM

farmer legal fight on Compensation

భూమి కోల్పోయిన రైతు పరిహారం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. ముడుపులు ఇవ్వని కారణంగా ఫైలు ముందుకు కదలలేదు. కలెక్టరేట్‌ అధికారులు పరిహాసం ఆడుతున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

అనంతపురం సిటీ: పెనుకొండలో నివాసముంటున్న బాబయ్యకు సంబంధించి సర్వేనంబరు 279లో ఉన్న 3.52 ఎకరాల భూమిని 2007లో జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ప్రభుత్వం తీసుకుంది. ఇందుకు గాను రూ. 2,93,473 ప్రభుత్వం పరిహారం కింద చెల్లించాల్సి ఉంది. బాబయ్య భూమిలో తనకు వాటా ఉందని సమీప బంధువు కోర్టును ఆశ్రయించాడు. ఈ ఫిర్యాదుతో పరిహారం చెల్లింపు ఆగిపోయింది. బాధిత కుటుంబ సభ్యులు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జాతీయ రహదారికి ఇచ్చిన భూమి బాబయ్యదేనని పెనుకొండ న్యాయస్థానం తీర్పు నిచ్చింది. కోర్టు తీర్పు ప్రతితో పాటు పలు ఆధారాలతో కుటుంబ సభ్యులు నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారుల చుట్టూ తిరిగారు. పరిహారం మంజూరైందని, కలెక్టర్‌ కార్యాలయంలోని ఓ సెక్షన్‌లో ఆగిందని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తెలిపారు.

లంచమిస్తే క్షణాల్లో ఇచ్చేస్తారట!
దీంతో ఆ ఫైలును తీసుకుని బాధితుడు సెక్షన్‌ అధికారులను కలిశాడు. అక్కడ అధికారులు ఏడాదిన్నర కాలంగా డబ్బు చెల్లించకుండా.. ఏమైందో కారణాలు చెప్పకుండా నాన్చుతూ వచ్చారు. సహనం కోల్పోయిన బాధిత కుటుంబ సభ్యులు నేరుగా అధికారిని కలిసి ఏదో ఒక ‘మార్గం’ చెప్పండని అడిగారు. ‘పరిహారం మొత్తంలో సగం ఇస్తే క్షణాల్లో పని పూర్తీచేస్తాన’ని చెప్పడంతో కంగుతిన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని, లంచం ఇచ్చుకోలేమని, దయ చూపి పరిహారం ఇప్పించండి అని వేడుకున్నారు. కాదు.. కూడదూ అంటే ఉన్నతాధికారులను కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటామని చెప్పారు. అయినా ఆ అధికారి కనికరించలేదు.

ఈ కష్టం ఏ రైతుకూ రాకూడదు..
ప్రస్తుతం రైతు బాబయ్య ఆరోగ్యం నిలకడగా లేకపోవడంతో కుమారుడు వెంకటేష్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. పరిహారం డబ్బయినా చెల్లించండి.. లేదంటే తమ పొలమైనా తిరిగిస్తే పంట సాగు చేసుకుంటామని వారు కన్నీటి పర్యంతమయ్యారు. అన్నం పెట్టే పొలాన్ని వదులుకుని ఆ పొలం డబ్బు కోసం కోర్టుల చుట్టూ తిరిగే దుస్థితి ఏ రైతుకూ రాకూడదని వాపోతున్నారు. అధికారులు ఇకనైనా మా దీనస్థితిని అర్థం చేసుకుని న్యాయం చేయాలని కోరుతున్నారు.  

పరిహారమడిగితే పరిహాసమాడారు..
భూమి కోల్పోయిన తమకు పరిహారం ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని బాబయ్య కుటుంబ సభ్యులు కలెక్టరేట్‌లో జరిగే ‘మీ కోసం’లో 12 సార్లు ఫిర్యాదు చేశారు. ‘ఏ ఒక్క ఫిర్యాదుపైనైనా ఎవరైనా స్పందించారా? ఎందుకు వృథా ప్రయాస చెప్పండం’టూ సదరు సెక్షన్‌ అధికారి పరిహాసం చేశాడు. మీరు ఎవరి వద్దకు వెళ్లినా పని చేయాల్సింది నేనే అన్న విషయాన్ని గుర్తెరగాలని పరోక్షంగా హెచ్చరించి పంపించేశాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement