ప్రభుత్వ వైఫల్యంతోనే సంక్షోభంలో రైతాంగం | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ వైఫల్యంతోనే సంక్షోభంలో రైతాంగం

Published Mon, May 7 2018 8:47 AM

Farmers Extreme crisis With tdp govt : YV Subba Reddy - Sakshi

ఒంగోలు: నాలుగేళ్లుగా రాష్ట్రంలో కరువు మేఘాలు కమ్ముకున్నాయి. ప్రకృతి వైపరీత్యాలతోపాటు ప్రభుత్వ వైఫల్యం వల్ల రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉన్నారని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. స్థానిక తన నివాసంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగేళ్లుగా ఒక వైపు ప్రకృతి కన్నెర్ర చేస్తే మరో వైపు అధికార పార్టీ నాయకుల ఆగడాలతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. పాతికేళ్లలో లేని సంక్షోభాన్ని పొగాకు రైతులు 2015–16లో చవిచూశారన్నారు. పండించిన పంటకు సైతం గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ప్రకాశం జిల్లాలో అధికంగా చోటుచేసుకున్నాయన్నారు.

 చివరకు వైఎస్సార్‌ సీపీ జోక్యంతో కేంద్రం సైతం దిగి వచ్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ముందుకు రావడంతో కొంతమేర రైతులు నిలదొక్కుకోగలిగారన్నారు. మూడు నెలల క్రితం కర్నాటకలో కిలో పొగాకుకు రూ.175 సరాసరి ధర లభిస్తే నేడు మన రాష్ట్రంలో రూ.130 నుంచి రూ.140లు మాత్రమే పలుకుతోందన్నారు. రెండు రోజుల క్రితమే టంగుటూరు మండలంలో కూడా ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడం కలచివేస్తోందన్నారు. పొగాకు బోర్డు ఈ ఏడాది 63 మిలియన్‌ టన్నుల పొగాకు కొనుగోళ్లు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకోగా ఇప్పటి వరకు కేవలం 30 మిలియన్‌ టన్నుల పొగాకును మాత్రమే కొనుగోలు చేసిందన్నారు. 

ఈ నేపథ్యంలో గిట్టుబాటు ధర రాకపోతుండడంతో టంగుటూరులో రైతులు వేలం కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారని, ఇది రైతుల్లో చోటు చేసుకుంటున్న అభద్రతా భావానికి చిహ్నంగా భావిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పొగాకుతో బాటు అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని వైఎస్సార్‌ సీపీ తరఫున డిమాండ్‌ చేస్తున్నామన్నారు. పొగాకు బోర్డుపై కూడా ఒత్తిడి తెచ్చి వ్యాపారులు ధర పెంచి కొనుగోలు చేయించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. మరో వైపు అధికార పార్టీ ఆగడాలు, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు కూడా రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు.  

నీటి ఎద్దడి నివారణకు చర్యలేవీ..
జిల్లాలో తాగునీటి ఎద్దడికి సంబంధించి 1800 ట్యాంకర్లను ఏర్పాటు చేసి నీటి ఎద్దడిని అధిగమించాలంటూ ముందస్తు ప్రతిపాదనలు చేసినా నేటి వరకు వాటి అమలులో నిర్లక్ష్యం కనిపిస్తోందని ఎంపీ అన్నారు. మార్కాపురం ప్రాంతంలో రోజుకు 1.8 మిలియన్‌ లీటర్ల తాగునీరు అవసరం కాగా ప్రస్తుతం సరఫరా చేస్తుంది కేవలం ఒక మిలియన్‌ లీటర్ల నీరు మాత్రమే అన్నారు. ఈ నేపథ్యంలో 80 వేల లీటర్ల నీటి ఎద్దడిని ప్రజానీకం ఏ విధంగా అధిగమించాలో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బోర్లు 800 అడుగుల లోతుకు వేసినా నీరు లభ్యంకాని పరిస్థితులు పశ్చిమ ప్రకాశంలో నెలకొన్నాయన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు బేస్తవారిపేట, కంభం మండలాల్లో అరటి, బత్తాయి, బొప్పాయితోపాటు పలు మండలాల్లో మామిడి తదితర పంటల రైతులు తీవ్రంగా నష్టపోయారని, నష్టపోయిన రైతుకు పూర్తిస్థాయి పరిహారం అందించేలా పంట నష్టం అంచనాలను సకాలంలో తయారు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. 

కలియుగ దైవమైన వెంకటేశ్వరస్వామిని కేంద్రం పరిధిలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తే పార్టీలకు అతీతంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. బీజేపీతో వైఎస్సార్‌ సీపీ కుమ్మక్కు అంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుని భార్యకు టీటీడీ బోర్డు మెంబర్‌గా పదవి కట్టబెట్టడం, కేంద్ర మహిళా మంత్రి భర్త చంద్రబాబుకు గౌరవ సలహాదారుగా వ్యవహరిస్తున్న విషయం ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. తమకు ప్రజల మద్దతు ఉందని, 2019 ఎన్నికల్లో గెలుపు ఖాయం అని, చంద్రబాబుకు ఆ నమ్మకం లేకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు వేమూరి సూర్యనారాయణ, కెవి రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, గొర్రెపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

అధికార పార్టీకి ఓటేస్తేనే పంట కొంటారా..?
జిల్లాలో కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు కేవలం 33 వేల క్వింటాళ్లను మాత్రమే కొనుగోలు చేశారని, ఇంకా జిల్లాలో 30 వేల క్వింటాళ్ల కందులు మిగిలి ఉన్నాయని ఎంపీ వైవీ అన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో రైతులు ప్రత్యామ్నాయంగా కంది పంట వేస్తే కేవలం ఒక్కో రైతుకు రెండు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పడం పచ్చ కండువా కప్పుకున్న దళారీ వ్యవస్థను ప్రోత్సహించడమే అన్నారు. రైతు తాను పండించిన 5 క్వింటాళ్లలో రెండు మాత్రమే మద్దతు ధరకు అమ్ముకుంటే మిగిలిన మూడు క్వింటాళ్లు దళారీలకు అతి తక్కువకు అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నాడన్నారు.

 శనగలకు సంబంధించి కొనుగోలు కేంద్రాల్లో అయితే తెలుగుదేశం పార్టీకి ఓటేశాడా లేదా అని పరిశీలించి మరీ కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారని ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశం అన్నారు. మరో నెలరోజుల్లో ఖరీఫ్‌ ప్రారంభం కాబోతున్న దృష్ట్యా పదివేల ఎకరాలకు సబ్సిడీ విత్తనాలు కాకుండా కనీసంగా 20 వేల ఎకరాల్లో పంటలకు రాయితీ విత్తనాలు పంపిణీ చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement