కేంద్ర సహకార బ్యాంకు దోపిడీ! | Sakshi
Sakshi News home page

కేంద్ర సహకార బ్యాంకు దోపిడీ!

Published Sun, Sep 8 2013 2:03 AM

Farmers face troubles with central co-operative bank

సాక్షి ప్రతినిధి, గుంటూరు: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రైతుల్ని నిలువు దోపిడీ చేస్తోంది. ఇచ్చిన రుణాలకు ఆరు నెలలకు ఒకసారి వడ్డీని తిరగరాస్తోంది. రిజర్వుబ్యాంకు నిబంధనల ప్రకారం తీసుకున్న రుణాలను రైతులు సంవత్సరంలోపు తీర్చవచ్చు. అయితే ఆరు నెలలు పూర్తికాకుండానే రుణాలు చెల్లించాలని రైతులపై ఒత్తిడి తీసుకువస్తోంది. ఆ విధంగా వసూలు చేయాలని సహకార సంఘాల సీఈవోలపై బ్యాంకు అధికారులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. బ్రాంచ్‌ల వారీ సమావేశాలు నిర్వహించి టార్గెట్లు పెడుతున్నారు. అనుకూలంగా వ్యవహరించకపోతే సంఘాలకు కొత్త రుణాలు ఉండవని హెచ్చరిస్తున్నారు.
 
జిల్లాలో 167 సహకార సంఘాలు రైతులకు సేవలు అందిస్తున్నాయి. సంఘాల్లోని సభ్యులు, సాగు విస్తీర్ణం, పంటల సాగు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రతీ ఖరీఫ్, రబీకి రూ.2 నుంచి రూ. 4 కోట్ల వరకు రుణాలను ఒకో సంఘానికి మంజూరుచేస్తున్నాయి. మొన్నటి రబీ నాటికి ఈ సంఘాలకు రూ.514.87 కోట్లను రుణాలుగా ఇచ్చాయి. రబీలో రుణాలు సాధారణంగా అక్టోబరు నుంచి మార్చి నెల వరకు ఇస్తారు. రుణం తీసుకున్న తేదీ నుంచి సంవత్సరంలోపు రైతులు రుణాలు చెల్లించవచ్చు. అయితే రుణాలు తీసుకుని సంవత్సరం కాకపోయినా, వాటిని వసూలు చేయాలని బ్యాంకు అధికారులు సహకార సంఘాల సీఈవోలపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. 
 
రుణాలు తీసుకుని సంవత్సరం కూడా కాలేదని, ఇప్పుడు రుణాలు చెల్లించలేమని రైతులు చెబుతున్నారు. సంఘాల సీఈవోలు కూడా రైతుల బాధలకు అనుగుణంగా ఇప్పుడు రుణాల వసూలు సాధ్యం కాదని చెబుతున్నారు. బ్యాంకు అధికారులు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఎలాగైనా రుణాలు వసూలు చేయాల్సిందేనని బ్రాంచ్ ల వారీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ సమావేశాలకు సంఘాల సీఈవోలు, సిబ్బంది, రైతులను పిలిచి రుణాలు వసూలుకానిదే కొత్త రుణాలు ఉండవంటున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం నరసరావుపేట జిల్లా కేంద్ర సహకార బ్యాంకు బ్రాంచ్‌లో సంఘాల సీఈవోల సమావేశాన్ని బ్యాంకు సీఈవో విశ్వనాథం, చైర్మన్ మమ్మునేని వెంకటసుబ్బయ్య నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో రుణాలు వసూలు చేయాలని ఆదేశించారు. టార్గెట్లు నిర్ణయించారు. 
 
రైతుల నుంచి వ్యతి
వడ్డీ వ్యాపారుల వలే బ్యాంకు సిబ్బంది అనుసరిస్తున్న వైఖరికి రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు సహకార సంఘాల్లో తీసుకున్న రుణాలు రద్దయ్యాయని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా కొత్త ప్రభుత్వం రుణాలను రద్దు చేసే అవకాశం ఉందని, అప్పటివరకు చెల్లించేది లేదని రైతులు చెబుతున్నారు. 
 
బుక్ ఎడ్జెస్ట్‌మెంట్..
రైతులు రుణాలు చెల్లించలేకపోతే వారు చెల్లించినట్టుగా రికార్డుల్లో నమోదు చేసి బుక్ ఎడ్జెస్ట్‌మెంట్ చేయాలని సంఘాల సీఈవోలపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. రుణాల వసూలు కంటే బుక్ ఎడ్జెస్ట్‌మెంట్‌లే ఎక్కువగా జరుగుతున్న క్రమంలో రైతులు బ్యాంకు ఓచర్లపై సంతకాలు చేయడానికి విముఖత చూపుతున్నారు. బుక్ ఎడ్జెస్‌మెంట్ చేయకపోతే మీకు జీతాలు కూడా రావని అధికారులు సంఘాల సీఈవోలను హెచ్చరిస్తున్నారు. ఇదికేవలం బ్యాంకు మనుగడ కోసం సంఘాలను బలితీసుకోవడమేనని సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు.
 

Advertisement
Advertisement