ఉరుముతున్న వెంక టపాలెం | Sakshi
Sakshi News home page

ఉరుముతున్న వెంక టపాలెం

Published Fri, Nov 7 2014 2:03 AM

ఉరుముతున్న వెంక టపాలెం - Sakshi

 సాక్షి, విజయవాడ బ్యూరో: డొక్కన చిన్నబ్బాయికి 68 ఏళ్ల వయసు. కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. కూలి నాలి చేసుకుని సంపాదించిన డబ్బుతో ఎకరం పొలం కొనుక్కుని ఆరుగురు సభ్యులున్న కుటుంబాన్ని లాగుతున్నాడు. కూతురు పెళ్లీడుకొచ్చింది. సంబంధాలు చూస్తున్నాడు. ఇప్పుడీ కుటుంబం మొత్తానికి నిద్ర పట్టడం లేదు. శరీరం అలసిపోయి రాత్రి పూట పడుకున్నా అర్ధరాత్రో, అపరాత్రో చిన్నబ్బాయికి మెలకువ వచ్చేస్తోంది. రాజధాని పేరుతో ఉన్న పొలం ప్రభుత్వం లాగేసుకుంటే బతికేదెట్టా? ఇదే ఆలోచన.. ఆందోళన. ఇది చిన్నబ్బాయి ఒక్కడి పరిస్థితే కాదు. వెంకటపాలెంలోని ప్రతి కుటుంబం, ఈ గ్రామంపై ఆధారపడిన కూలీలందరిదీ దాదాపుగా ఇదే పరిస్థితి. రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ జరిపే గ్రామాల జాబితాలో  తుళ్లూరు మండలం వెంకటపాలెం కూడా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించడమే ఇందుకు కారణం. దీంతో శుక్రవారం జరగనున్న జన్మభూమి సభకు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరైతే వారితో తాడోపేడో తేల్చుకోవాలని గ్రామస్తులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నారు. మేం భూములివ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి పుల్లారావు ఎవరు? అని ప్రశ్నిస్తున్నారు.

 కృష్ణా నదిని ఆనుకుని పచ్చటి పొలాలతో, ప్రశాంత వాతావరణంలో వున్న వెంకటపాలెంలో సుమారు 4వేల జనాభా ఉంది. వీరందరికీ కలిపి దాదాపు 1,200 ఎకరాల వ్యవసాయ భూమి వుంది. 30 అడుగుల లోతులోనే సమృద్ధిగా నీరుపడుతుంది. దొండ, అరటి, పత్తి, మొక్కజొన్న, బెండ పంటలు ఏడాదిలో మూడుసార్లు పండించే బంగరు భూములు అవి. ఇతర ప్రాంతాల్లో కరువు  పరిస్థితులు ఏర్పడితే.. సంవత్సరం పొడువునా పొలం పనులు ఉండే ఈ గ్రామానికి కూలీలు వలస వచ్చి కడుపు నింపుకుంటుంటారు.

ఆంధ్రప్రదేశ్‌లో 1994 నుంచి వరసగా తొమ్మిదేళ్లు కరువు కాటకాలు ఏర్పడిన సమయంలో కూడా ఈ గ్రామంలో కరువన్నది కనిపించలేదు. విశేషమేమిటంటే.. వెంకటపాలెంలో ఏ ఇంట్లో కూడా కొళాయి కనిపించదు. ప్రజలకు తాగునీరు సరఫరా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 30 అడుగుల లోతులోనే నీళ్లు పడుతున్నందువల్ల ప్రతి ఒక్కరూ బోరు వేసుకుని ఆ నీటినే అన్ని అవసరాలకు వాడుకుంటున్నారు. ఇలాంటి విలువైన భూములు కావడం వల్లే గ్రామంలోని చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు మొత్తం ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘మేం భూములివ్వం. రాజధాని కడితే మా బతుకులేం కావాలి. ఉన్నోళ్లంతా కలసి మా పొట్టకొడతారా? కాదూ కూడదు కడతామంటే మమ్మల్ని చంపి మా శవాలపై కట్టుకోవాల్సిందే..’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 మేం టీడీపీయే.. అయితే..?
 నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే. నాకు సభ్యత్వం కూడా వుంది. అంత మాత్రాన మా భూములను ప్రభుత్వానికిచ్చి మా బతుకులు రోడ్డున పడేసుకోవాలా? 80 శాతం మంది రైతులు భూములు ఇవ్వడానికి ఒప్పుకున్నారని మంత్రి పుల్లారావు ఎట్లా చెబుతారు. అంత అవసరమైతే వాళ్ల భూములు ఇచ్చుకోమని చెప్పండి.
 - దొడ్డక చిన్నబ్బాయి - వెంకటపాలెం
 
 అర ఎకరం పోతే మేం ఎట్లా బతకాల
 నాకు అరెకరం భూమి వుంది. ఏడాదిలో మూడు పంటలు పండిస్తున్నా. నాలాంటి వాళ్లే చాలామంది ఉన్నారు. మంత్రులు మేం భూములు ఇచ్చేందుకు రెడీగా ఉన్నామని ఎట్లా చెబుతారు. రేపు (శుక్రవారం) అటో ఇటో తేల్చుకుంటాం.
 - కన్నె బోయిన దోనయ్య - వెంకటపాలెం
 
 అన్ని భూములు వ్యాపారానికా..?
 రాజధానికి 30 వేల ఎకరాల భూమి ఎందుకు? మా భూములు తీసుకోని వాళ్లు వ్యాపారం చేసుకోవడానికా? భూములు ఇచ్చే ప్రసక్తే లేదు.
 - రొద్ద వెంకటేశ్వర్లు -  వెంకటపాలెం
 
 మా పిల్లల భవిష్యత్తేంటి?
 మా పొలాలను ప్రభుత్వం లాక్కుంటే  మా బతుకులు పోతాయి. పిల్లల చదువులేమిటి? పెళ్లిళ్ల సంగతి ఏమిటి? రాజధాని కోసం మా భూములు ఇచ్చే ప్రసక్తే లేదు. మంత్రి ఎప్పుడన్నా మా ఊరొచ్చాడా? మాతో మాట్లాడాడా?
 - దొడ్డక అప్పారావు - వెంకటపాలెం
 

Advertisement
Advertisement