..ప్చ్‌ ఈసారీ ఇంతే! | Sakshi
Sakshi News home page

..ప్చ్‌ ఈసారీ ఇంతే!

Published Thu, Mar 23 2017 4:58 PM

farmers problems in srikakulam

16...20...16.. ఇవేవో అందాల పోటీల్లో పాల్గొనే వారికి ఉండాల్సిన శరీరదారుఢ్య కొలతలనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఈ ఏడాదితో పాటు గత రెండేళ్ల నుంచి జిల్లా రైతులకు ధాన్యం రవాణాకు ప్రభుత్వం రూ.కోట్లలో చెల్లించాల్సిన డబ్బుల లెక్క ఇది. పక్క జిల్లా విజయనగరంలో ధాన్యం కొనుగోలు నుంచి రవాణా చార్జీల వరకూ  రైతులకు చెల్లింపుల్లో ఎటువంటి సమస్య తలెత్తడం లేదు. శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఈ సమస్య గత మూడేళ్ల నుంచి చిక్కుముడిలా బిగిసుకుపోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రవాణా చార్జీలను ఇప్పించాలని వేడుకుంటున్నారు.
 
► మూడేళ్లగా రైతులకు అందని ధాన్యం రవాణా చార్జీలు 
► కొనుగోలు చేసిన ధాన్యానికి మాత్రమే చెల్లింపులు చేస్తున్న అధికారులు
► రవాణా చార్జీల చెల్లింపులపై స్పందించని అధికార యంత్రాంగం
 
వీరఘట్టం(పాలకొండ):  అన్నదాత ఏటా మోసపోతూనే ఉన్నాడు. విత్తనాల కొనుగోలు నుంచి ఖరీఫ్‌ సీజన్‌ పూర్తయ్యే వరకూ ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ఉన్నాడు. అన్ని సవాళ్లను ఎదుర్కొని పండించిన పంటను అమ్ముకోవడానికి సైతం అవస్థలు పడుతున్నాడు. ధాన్యం కొనుగోలులో వ్యాపారులు, దళారులు, మిల్లర్లతో పాటు ప్రభుత్వం కూడా రైతును దోచుకుంటోంది. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లుకు తీసుకెళ్లే ప్రతి క్వింటాకు రవాణా చార్జీల కింద ప్రభుత్వం చెల్లించాల్సిన నిధులను రైతులకు దక్కనీయకుండా జిల్లాలో ప్రభుత్వ పెద్దలు అడ్డుతగులుతున్నారు. దీంతో మూడేళ్ల నుంచి ధాన్యం రవాణా చార్జీలు రైతుల దరిచేరలేదు. ధాన్యం కొనుగోలులో రైతుకు చెల్లించాల్సిన రవాణా చార్జీలు పక్కదోవ పడుతున్నాయి. రెండేళ్లుగా సాగుతున్న ఈ ప్రక్రియ ఈసారి కూడా కొనసాగుతోంది. జిల్లాలో ఏకంగా దాదాపు రూ.16 కోట్లు పైబడి మొత్తాన్ని ప్రభుత్వ పెద్దలు గద్దల్లా తన్నుకుపోతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా జరుగుతున్న ధాన్యం సేకరణ ప్రక్రియలో లోగుట్టుగా అక్రమ దందా సాగుతోంది.
 
చెల్లించాల్సింది ఇంత..
 ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా వారు సూచించే మిల్లుకు ధాన్యం రవాణా చేసేందుకు నిబంధన ఉంది. రవాణా చేసిన ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో పాటు, రవాణా చార్జీల కింద క్వింటాకు రూ.32 చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాది ఇంత వరకు ఒక్క రైతుకు కూడా చిల్లిగవ్వ రవాణా చార్జీలు చెల్లించలేదు.  2014–15లో రూ.16 కోట్లు, 2015–16లో 20 కోట్లు, ఈ ఏడాది రూ.16 కోట్లు పైబడి చెల్లించాల్సి ఉంది.
 
ఇదీ పరిస్థితి..
  జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 5.65 లక్షల ఎకరాల్లో వరిసాగైంది.సుమారు 13 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకూ ధాన్యం దిగుబడి వచ్చిందని పంటకోత ప్రయోగాల ద్వారా అధికారులు గుర్తించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 147 కోనుగోలు కేంద్రాల ద్వారా 7.08 లక్షల మెట్రిక్‌ «టన్నుల ధాన్యం సేకరణకు లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పటి వరకూ 53 వేల మంది రైతుల నుంచి  5.01 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు.ఈ ధాన్యానికి రూ.750 కోట్లు రైతులకు చెల్లించారు. కాని ధాన్యం రవాణాకు సంబంధించి చిల్లిగవ్వకూడా విదల్చలేదు.
 
ఏటా గందరగోళమే.
ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రతీ ఏటా జిల్లాలో గందరగోళంగానే ఉంటుంది. ఆదరాబాదరాగా ధాన్యం కొనుగోలు చేసేస్తున్నారు. ఈ ఏడాది కొనుగోలు బాధ్యత మిల్లర్లకు అప్పజెప్పాలని, రవాణా చార్జీలు కూడా వారికే చెల్లించాలని మంత్రి అచ్చెంనాయుడు స్పష్టం చేశారు. దీన్ని జిల్లా కలెక్టర్‌ లక్ష్మీనరసింహం విభేదించారు. దీంతో అచ్చెన్నాయుడుకి, కలెక్టర్‌ మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించేందుకే చర్యలు తీసుకున్నారు. అయితే ఇంతవరకు గత రెండేళ్ల నుంచి రైతులకు చెల్లించాల్సిన రవాణా చార్జీలు రూ.16 కోట్లు, రూ.20 కోట్లు  ఏమయ్యాయో, ఎవరి ఖాతాకు మల్లించబడ్డాయో తెలీదు. ఈ ఏడాది ఇప్పటివరకు రైతుల నుంచి సేకరించిన 5.01 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి రవాణా చార్జీలు కింద  రూ.16.03 కోట్ల చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఈ విషయంలో అధికారులెవరూ నోరుమెదపడం లేదు. గతంలో మాదిరిగానే  ఈఏడాది కూడా ప్రభుత్వం రవాణా చార్జీలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
 
తక్షణమే రవాణా చార్జీలు చెల్లించాలి
 మూడేళ్ల నుంచి రైతులకు ఇవ్వకుండా ప్రభుత్వం మిగుల్చుకున్న ధాన్యం రవాణా చార్జీలు తక్షణమే చెల్లించాలి. ఈ డబ్బులు పక్కత్రోవ పట్టించాలని ప్రభుత్వ పెద్దలు చూస్తున్నట్లు స్పష్టమౌతోంది. అందుకే ఈ విషయంపై నోరుమెదపడం లేదు.
విశ్వసరాయి కళావతి,పాలకొండ ఎమ్మెల్యే

Advertisement
Advertisement