సమైక్య రణం | Sakshi
Sakshi News home page

సమైక్య రణం

Published Thu, Dec 12 2013 2:26 AM

సమైక్య రణం - Sakshi

సాక్షి, ఏలూరు: ఓ వైపు సార్వా మాసూళ్లు, మరోవైపు దాళ్వా దమ్ము పనుల్లో నిమగ్నమైన అన్నదాతలు బుధవారం వాటికి విరామం ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలసి సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమబాట పట్టారు. వందలాది ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు చేలను వదిలి రోడ్లపైకి వచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  నాయకులు రైతులు, సమైక్యవాదులతో కలిసి జిల్లాలో వినూత్న నిరసనలు చేపట్టారు. తణుకు నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య ఆధ్వర్యంలో తణుకులో ట్రాక్టర్లతో ర్యాలీ
 నిర్వహించారు. పైడిపర్రు జంక్షన్ నుంచి మునిసిపల్ కార్యాలయం వరకూ ర్యాలీ సాగింది.

తాడేపల్లిగూడెంలో  నియోజకవర్గ సమన్వయకర్త తోట గోపీ ఆధ్వర్యంలో రైతులు ట్రాక్టర్ల ర్యాలీ చేశారు. నల్లజర్ల రోడ్డులోని కనకదుర్గ ఆలయం నుంచి జయలక్ష్మి ఫంక్షన్ హాల్ వరకు జై సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ రైతులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ముందుకు కదిలారు. గోపాలపురంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు తలారి వెంకట్రావు, డి.సువర్ణరాజు ఆధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. కొవ్వూరు మండలం దొమ్మేరులో మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత  ఆధ్వర్యంలో రైతులు, పార్టీ నాయకులు ఎడ్లబళ్లపై ర్యాలీ చేపట్టారు. వాహనాల రాకపోకలను అడ్డుకుని రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, పార్టీ నాయకులు ముదునూరి నాగరాజు, ముళ్లపూడి కాశీవిశ్వనాథ్, కృష్ణారావు, బర్రే శ్రీనివాస్, సుధాకర్ పాల్గొన్నారు.

ఉండి నియోజకవర్గ సమన్వయకర్త పాతపాటి సర్రాజు ఆధ్వర్యంలో ఉండిలో ట్రాక్టర్ల ర్యాలీ జరిగింది. భీమడోలులో పార్టీ మండల కన్వీనర్ సీహెచ్ రామారాయుడు, పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు వగ్వాల అచ్యుతరామారావు, ముళ్లగిరి జాన్సన్, సమన్వయకమిటీ సభ్యుడు నాయకులు తలారి భీమరాజుల ఆధ్వర్యంలో  మోటారు సైకిళ్లు, ట్రాక్టర్స్ ర్యాలీ నిర్వహించారు. పోలవరంలో వైసీపీ మండల కన్వీనర్ సుంకర వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ట్రాక్టర్లపై వీధివీధినా ర్యాలీ చేశారు.

Advertisement
Advertisement