ప్రచారంలో ఆర్భాటం.. చెల్లింపుల్లో జాప్యం | Sakshi
Sakshi News home page

ప్రచారంలో ఆర్భాటం.. చెల్లింపుల్లో జాప్యం

Published Sat, Apr 23 2016 12:31 AM

Farmers' Union Leaders to Grain sales

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తే 24 గంటల్లో నగదు జమ చేస్తామంటూ ఊకదంపుడు ప్రచారం తప్ప అమలుకు నోచుకోవడం లేదు. జిల్లాలో 15 రోజులుగా ధాన్యం విక్రయాలకు సంబంధించిన నగదు చెల్లింపులు నిలిచిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 11,500 రైతులకు రూ.433 కోట్లు చెల్లించాల్సి ఉంది.
 
* రూ.433 కోట్ల మేర నిలిచిన ధాన్యం సొమ్ము
* లబోదిబోమంటున్న 11,500 మంది రైతులు
* 15 రోజులుగా రూపాయి చెల్లించని వైనం

భీమవరం: జిల్లాలో పదిహేను రోజులుగా ధాన్యం విక్రయాలకు సంబంధించిన సొమ్ము చెల్లించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దాళ్వాకు పెట్టుబడులు అధికం కావడంతో ఎక్కువమంది రైతులు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టారు. పంట చేతికిరావడంతో 24 గంటల్లో సొమ్ము చేతికి వస్తుందని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లి అప్పగించారు. ధాన్యం అమ్మి 15 రోజులవుతున్నా సొమ్ములు రాకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
పేరుకున్న బకాయిలు
జిల్లాలో సుమారు 4.60 లక్షల ఎకరాల్లో దాళ్వా సాగు చేయగా దాదాపు 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లా అధికారులు ఐకేపీ ఆధ్వర్యంలో 173, సొసైటీల ద్వారా 93 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 17 శాతం కంటే తేమ తక్కువగా ఉంటే 75 కిలోల బస్తాకు రూ.1,087 ధర చెల్లించనున్నట్టు అధికారులు ప్రకటించారు.

దీంతో రైతులు అనేక వ్యయప్రయాసల కోర్చి వరికోత యంత్రాల ద్వారా మాసూళ్లు చేసిన ధాన్యంతో పాటు కూలీలతో ఎండ కోసిన పంటను  సైతం ఎండబెట్టి ఐకేపీ కేంద్రాలు, సొసైటీల వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేర్చారు. జిల్లాలో ఈ నెల 11 నుంచి ఐకేపీ కేంద్రాలు, సొైసైటీలకు ధాన్యం అమ్మకాలు  చేసిన సుమారు 11,500 మంది రైతులకు రూ.433 కోట్లు సొమ్ములు చెల్లించాల్సి ఉంది. ఒక్క భీమవరం మండలంలోనే 288 మంది రైతులకు సుమారు రూ.10 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి.  
 
దళారుల వైపు రైతుల చూపు
ప్రభుత్వం నుంచి సకాలంలో నగదు అందకపోవడంతో రెండు రోజులుగా రైతులు దళారులు, కమీషన్ ఏజెంట్ల వైపు చూస్తున్నారు. కమీషన్‌దారులు నాలుగైదు రోజుల్లోనే నగదు అప్పగిస్తామని చెబుతుండడం, దానికితోడు బస్తా రూ. 1,150 చేసి కొనుగోలు చేస్తుండడంతో వారివైపు మొగ్గుచూపుతున్నారు. త్వరగా సొమ్ము చేతికందితే రుణాలను కొంత మేర తీర్చుకోవచ్చని రైతులు ఆశిస్తున్నారు. అయితే దళారుల మాయమాటలకు రైతులు మోసపోయే ప్రమాదముందని రైతు సంఘం నాయకులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ప్రచారం చేసినట్టుగా 24 గంటల్లో సొమ్ము చెల్లిస్తే రైతులు దళారుల వైపు చూడాల్సిన అవసరం రాదని, ప్రభుత్వం వెంటనే బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
Advertisement