కుమారుడికి పునర్జన్మనిచ్చి అంతలోనే.. | Sakshi
Sakshi News home page

కుమారుడికి పునర్జన్మనిచ్చి మృతిచెందిన తండ్రి

Published Mon, Aug 19 2019 9:48 AM

Father Died After He Gave Kidney To His Son In Tanuku West Godavari - Sakshi

సాక్షి, తణుకు టౌన్‌: కిడ్నీ పాడై ప్రాణాపాయ స్థితిలో ఉన్న కుమారుడిని రక్షించుకునేందుకు ఒక తండ్రి చేసిన త్యాగం విషాదాంతంగా మారిన సంఘటన తణుకు పట్టణంలో శనివారం జరిగింది. తన కుమారుడిని రక్షించుకునే ప్రయత్నంలో కిడ్నీ దానం చేసిన తండ్రి ఆపరేషన్‌ అనంతరం తలెత్తిన అనారోగ్యం కారణంగా తనువు చాలించాల్సి వచ్చింది. తణుకు పాతూరుకు చెందిన కాకర్ల సంజీవరావు (సాల్మన్‌రాజు) (58) స్థానిక చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు కాగా వారిలో చిన్న కుమారుడు భరత్‌కుమార్‌కు రెండు కిడ్నీలు పాడైపోవడంతో కిడ్నీ మార్చాలని వైద్యులు సూచించారు. దీంతో బంధువులను, ఇతర దాతలను ప్రయత్నించినా ప్రయోజనం లేకపోవడంతో చివరికి తన కుమారుడికి తానే కిడ్నీ దానం చేసి బతికించుకుందామని సిద్ధపడ్డారు.

ఈనెల 11న కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ను ఏలూరులోని ఆశ్రం ఆసుపత్రిలో నిర్వహించారు. సంజీవరావు కిడ్నీని అతని కుమారునికి మార్పిడి చేసి ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తి చేశారు. కిడ్నీ దానం పొందిన కుమారుడు భరత్‌కుమార్‌ ప్రస్తుతం కోలుకుంటుండగా దానం చేసిన తండ్రి సంజీవరావు మాత్రం మూడు రోజులకు ఆపరేషన్‌ అనంతరం ఊపిరితిత్తులకు న్యూమోనియా కారణంగా శ్వాస తీసుకోవడం కష్టంగా మారి శనివారం ఉదయం మృతి చెందారు. ఆదాయం అంతంత మాత్రంగానే ఉన్న సంజీవరావు కుటుంబానికి తన కుమారుడి కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ భారంగా మారడంతో కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావును సంప్రదించి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సహాయం అందించాలని కోరారు.

వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి గత నెలలోనే కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.4 లక్షలు మంజూరు చేయించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరు ఉత్తర్వులు అందగానే కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ ప్రారంభించారు. ఆపరేషన్‌ అనంతరం మూడు రోజుల తర్వాత న్యూమోనియా కారణంగా ఆసుపత్రిలోనే సంజీవరావు మృతి చెందాడు. ఆయన మృతి పట్ల తణుకులోని పాస్టర్లు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు సంజీవరావు కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సంతాపాన్ని తెలిపారు.

Advertisement
Advertisement