పొత్తు పేరుతో పెత్తనమా! | Sakshi
Sakshi News home page

పొత్తు పేరుతో పెత్తనమా!

Published Sun, Jan 11 2015 3:20 AM

పొత్తు పేరుతో  పెత్తనమా! - Sakshi

టీడీపీ తీరుపై కమలనాథుల ఆగ్రహం    
మంత్రులనూ అవమానిస్తున్నారు..
ఇక కలిసి పనిచేయలేం.. బీజేపీ చీఫ్ అమిత్ షాకు నేతల ఫిర్యాదు..  ఓపికపట్టాలని షా హితవు

 
విజయవాడ : తెలుగుదేశం పార్టీ నేతలు పైకి పొత్తు అంటూనే తమపై పెత్తనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని జిల్లాలోని కమలనాథులు రగిలిపోతున్నారు. నియోజకవర్గాల్లో తమ మాట చెల్లకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు. తమ ఆవేదనను శుక్రవారం నగరానికి వచ్చిన బీజేపీ జాతీయ    అధ్యక్షుడు అమిత్‌షాకు నివేదించారు. మంత్రులను కూడా పలు రకాలుగా అవమానిస్తున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీతో కలిసి పనిచేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. నియోజకవర్గ స్థాయి నాయకులతోపాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి కూడా టీడీపీపై పలు ఫిర్యాదులు చేశారు. దీనిపై స్పందించిన అమిత్ షా... ముందుగా పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టాలని, టార్గెట్ పూర్తయితే 2019 ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుదామని చెప్పినట్లు సమాచారం.

 మంత్రి కామినేని శ్రీనివాస్‌ను ఇబ్బంది పెడుతున్నారంటూ..

జిల్లాలో బీజేపీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్. పొత్తులో భాగంగా ఆయనకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పదవి ఇచ్చారు. అయితే, ఆయన తాము చెప్పినట్లు వినాల్సిందేననే ధోరణిలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు అమిత్‌షాకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మంత్రి పదవి చేపట్టిన వారం రోజులకే ఇరిగేషన్ మంత్రి అయిన ఉమ.. ఆయనకు సంబంధం లేకపోయినా కామినేని పరిధిలోని జిల్లా ఆస్పత్రికి వెళ్లి అధికారులను మందలించే ప్రయత్నం చేశారని చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత కామినేని ఈ విషయంపై తీవ్రంగా స్పందించారని పేర్కొన్నారు. ‘నేను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండగా.. నా శాఖలో నీ పెత్తనం ఏమిటీ..’ అంటూ నేరుగా దేవినేని ఉమాను కామినేని ప్రశ్నించారని వివరించినట్లు తెలిసింది. ఇటీవల తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఒక డాక్టర్ బదిలీని ఆపాలని మంత్రి కామినేనికి చెప్పడం.. ఆయన తీవ్రంగా ప్రతిస్పందించడం వంటి అంశాలను అమిత్‌షాకు చెప్పినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల తీరుతో కామినేని విసిగిపోయారని, ఇటీవల నగరంలోని ఓ హోటల్‌లో జరిగిన డీఎం అండ్ హెచ్‌వోల సమావేశంలో టీడీపీ నాయకుల మాటలు వినవద్దని చెప్పేంత వరకు పరిస్థితి దిగజారిందని చెప్పినట్లు తెలిసింది.

 దేవాదాయ శాఖ మంత్రి విషయంలోనూ అదే వైఖరి..

 రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావును సైతం మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అవమానించారని బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. ఆనవాయితీ ప్రకారం దసరా ఉత్సవాల సమయంలో ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి పట్టువస్త్రాలు సమర్పించాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా గత ఉత్సవాల సమయంలో దేవినేని ఉమా పట్టువస్త్రాలు సమర్పించి మాణిక్యాలరావును అవమానించారని అధినేతకు ఫిర్యాదు చేశారు.
 
అగ్రస్థాయి నేతలు సైతం ఫిర్యాదు..

 రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంశాల్లో టీడీపీ నేతల జోక్యం ఎక్కువైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు కూడా అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. కొన్ని విషయాలను ఆయన వద్ద ప్రస్తావించి టీడీపీ నేతల జోక్యాన్ని తగ్గించేలా చూడాలని కోరినట్లు సమాచారం. కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి కూడా పలు విషయాల్లో టీడీపీ వైఖరిపై అమిత్‌షాకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అందరి ఆవేదనను తెలుసుకున్న అధినాయకుడు ‘కాస్త ఓపిక పట్టండి.. మనం రాష్ట్రంలో కూడా అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నాయి. తొలుత భారీగా సభ్యత్వాలు చేర్పించండి. అనుకున్న మేర సభ్యత్వాలు చేర్పిస్తే 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేద్దాం. అప్పుడు ఎవరితోనూ ఇబ్బందులు ఉండవు..’ అని చెప్పినట్లు బీజేపీ నాయకులు తెలిపారు.          
 

Advertisement
Advertisement