పట్టువదలం..పోరు విడవం | Sakshi
Sakshi News home page

పట్టువదలం..పోరు విడవం

Published Sat, Oct 12 2013 3:03 AM

female students out on the streets in vijyawada

=  ఉద్యమ విస్తరణ
=  రంగంలోకి కొత్త జేఏసీలు
=  తాజాగా ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీ ఏర్పాటు
=  ఎక్సైజ్ లో మొదలైన సహాయ నిరాకరణ
=  విజయవాడ వీధుల్లో నినదించిన విద్యార్థినులు

 
సాక్షి, విజయవాడ : సమైక్య ఉద్యమం రోజురోజుకూ విస్తరిస్తోంది. కొత్త పుంతలు తొక్కుతూ ప్రజల్లో సమైక్య స్ఫూర్తి నింపుతోంది. మొన్నటికిమొన్న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు తమ ఉద్యోగులతో కలుపుకొని జేఏసీ ఏర్పాటుచేశారు. అదేరోజు నీటిపారుదల శాఖ ఇంజినీర్లు కూడా జేఏసీగా ఏర్పడ్డారు. వారు కార్యాచరణ ప్రణాళిక కూడా సిద్ధం చేసి రంగంలోకి దిగారు. తాజాగా శుక్రవారం మరో జేఏసీ రంగంలోకి వచ్చింది. ప్రైవేటు విద్యాసంస్థల    
యాజమాన్యాలు, అధ్యాపకులు, విద్యార్థులతో ఆ జేఏసీ విజయవాడలో పురుడుపోసుకుంది.

సుమారు కోటిమంది వరకు విద్యార్థులు వారి నాయకత్వంలో ఉన్నారు. ఈ నెల 19 నుంచి విద్యార్థులు, అధ్యాపకులతో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఉద్యమం శుక్రవారం కూడా ఉధృతంగా సాగింది. ప్రొహిబిషన్ ఎక్సైజ్‌శాఖ అధికారులు, ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సహాయ నిరాకర ణ ఉద్యమం ప్రారంభమైంది. ఎక్కడికక్కడ సహాయ నిరాకరణ కార్యక్రమాలు చేపట్టారు. అనేకచోట్ల అధికారులు, ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించారు. కొన్నిచోట్ల ధర్నాలు చేశారు.

విజయవాడలో విద్యార్థి జేఏసీ నాయకుడు దేవినేని అవినాష్ నాయకత్వంలో విద్యార్థినులు ప్రదర్శన నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా జగ్గయ్యపేటలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షలకు వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను మద్దతు తెలిపారు. జేఏసీ నాయకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. సమ్మెలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులకు జేఏసీ నాయకులు నిత్యావసర సరకులు అందజేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కొండపల్లిలో ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.

ఇక్కడ రిక్షా కార్మికులు నిరసన వ్యక్తం చేస్తూ రిక్షాలతో వలయం ఏర్పాటుచేశారు. కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు 66వ రోజుకు చేరుకున్నాయి. కైకలూరు తాలూకా సెంటర్‌లో ఎన్జీవో దీక్షలు 59వ రోజుకు చేరాయి. వారికి మద్దతుగా కైకలూరు పట్టణ ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ రిలే దీక్షలు చే పట్టారు. కలిదిండిలో భాస్కరరావుపేట గ్రామస్తులు రిలే దీక్షలు చేశారు. మండవల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో 11 మంది మాజీ సర్పంచ్‌లు రిలే దీక్షలు చేశారు. ముదినేపల్లిలో మండల సమైక్యాంధ్ర పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు 26వ రోజుకు చేరుకున్నాయి.

గుడివాడలో ఎన్జీవోల జేఏసీ, మున్సిపల్ ఉద్యోగుల దీక్షలు కొనసాగుతున్నాయి. పామర్రులో విద్యార్థులు మానవహారం నిర్వహించి ర్యాలీ చేశారు. ఎమ్మెల్యే డీవైదాస్ కార్యాలయం వద్దకు వెళ్లి విభజనకు వ్యతిరేకంగా ప్రసంగించాలని ఆయన్ని కోరారు. పెనుగంచిప్రోలులో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 50వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలో విశ్రాంత ఉద్యోగులు కూర్చున్నారు. వత్సవాయిలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 45వ రోజుకు చేరాయి. జేఏసీ ఆధ్వర్యంలో దివిసీమలో చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. చల్లపల్లిలో చేపట్టిన దీక్షలు 63వ రోజుకు చేరాయి.
 
న్యాయవాదుల ఆధ్వర్యంలో చైతన్యయాత్ర...


అవనిగడ్డ కోర్టుకు చెందిన న్యాయవాదులు సమైక్యాంధ్ర చైతన్యయాత్రను చల్లపల్లి మండలంలో నిర్వహించారు. అవనిగడ్డలో చేపట్టిన దీక్షలు 51వ రోజుకు చేరాయి. చేనేత కార్మికులు దీక్షా శిబిరం వద్ద నూలు వడుకుతూ నిరసన దీక్షలు చేశారు. మోపిదేవిలో బొబ్బర్లంక దళితవాడకు చెందిన రైతులు దీక్ష చేపట్టారు. ఘంటసాల, నాగాయలంక, కోడూరులో దీక్షలు కొనసాగుతున్నాయి. తిరువూరులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో  నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షలు 10వ రోజుకు చేరాయి.

నియోజకవర్గ సమన్వయకర్త బండ్రపల్లి వల్లభాయ్ ఆధ్వర్యంలో బోసుసెంటర్లో ఏర్పాటుచేసిన శిబిరంలో పలువురు నాయకులు రిలేదీక్షలు చేపట్టారు. వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యురాలు పిడపర్తి లక్ష్మీకుమారి ఆధ్వర్యంలో రిలేదీక్షలు నిర్వహించారు. తిరువూరులో జేఏసీ నాయకులు  స్థానిక శాసనసభ్యురాలు దిరిశం పద్మజ్యోతి నివాసం వద్ద ధర్నా చేశారు.

నూజివీడులో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 65వ రోజుకు చేరాయి. చిన్నగాంధీబొమ్మ సెంటరులోని రిలేదీక్ష శిబిరంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జంక్షన్ రోడ్డులో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 46వ రోజుకు చేరాయి. ఈ దీక్షలను వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మేకా ప్రతాప్ ప్రారంభించారు.
 

Advertisement
Advertisement