పండగ పూటా పస్తులే! | Sakshi
Sakshi News home page

పండగ పూటా పస్తులే!

Published Mon, Oct 14 2013 3:55 AM

Festival of starvation DAY!

విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: గ్రామీణ  నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే సాక్షర భారత్ కో-ఆర్డినేటర్లకు ఈ దసరా ఉత్సాహాన్ని నింపలేకపోయింది. ఏడాది కాలంగా వీరికి వేతనాలు అందడం లేదు. పండగ సందర్భంగానైనా అందుతాయోమోనని ఇన్నాళ్లూ ఆశగా ఎదురుచూశారు. అయితే, ఇప్పుడూ వారికి నిరాశే ఎదురైంది. పండగ పూట కూడా సరదా లేకుండాపోయిందని, పస్తులుండాల్సిన పరిస్థితే వచ్చిందని పలువురు కోఆర్డినేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  కేంద్రప్రభుత్వం 2009లో సాక్షరభారత్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. 2010 సెప్టెంబర్ నుంచి ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలవుతోంది.
 
 జిల్లాలోని 938 గ్రామ పంచాయతీల్లో ఒక్కో సాక్షరభారత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఒక్కో గ్రామంలో ఇద్దరేసి కో-ఆర్డినేటర్లు పనిచేస్తున్నారు. వీరికి నెలకు రూ.2 వేలు వేతనంగా చెల్లిస్తున్నారు. గ్రామకేంద్రాలను పర్యవేక్షించేందుకు ఒక్కో మండల  కో-ఆర్డినేటర్‌ను నియమించారు. వీరికి నెలకు రూ.6 వేలు వేతనంగా చెల్లిస్తున్నారు. గత ఏడాది ఆరు నెలలకు ఒకసారి చొప్పున వేతనాలు చెల్లించారు. చివరగా గత ఏడాది సెప్టెంబర్ వరకు వేతనాలు మంజూరు చేసిన ప్రభుత్వం మళ్లీ ఇప్పటివరకు వేతనాలు ఇవ్వలేదని సాక్షరభారత్ కో-ఆర్టినేటర్లు వాపోతున్నారు.
 
 టీఏ, డీఏలు లేవు 
 గ్రామాల్లోని కేంద్రాలను సందర్శించేందుకు మండల కో-ఆర్డినేటర్లకు టీఏ, డీఏలు చెల్లిస్తారు. అయితే ఏడాది కాలంగా ప్రభుత్వం మంజూరు చేయడం లేదు. దీంతో సుమారు రూ.రెండు లక్షల మేర టీఏ, డీఏల బకాయిలు రావాల్సి ఉన్నట్లు అంచనా. దీనికి తోడు సాక్షర భారత్ అభ్యాసకులకు ఎన్‌ఐఓఎస్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన పరీక్షలకు కూడా నిధులు ఇవ్వలేదని మండల కో-ఆర్డినేటర్లు పేర్కొంటున్నారు. సాక్షర భారత్ గ్రామ కో-ఆర్డినేటర్లకు రెండు విడతలుగా నిర్వహించిన శిక్షణ తరగతులకు సైతం బిల్లులు ఇవ్వలేదని వాపోతున్నారు. 
 
 పత్రికల బిల్లులూ లేవు...
 ప్రతి సాక్షరభారత్ కేంద్రానికి తప్పనిసరిగా రెండు దినపత్రికలు వేయాలని నిబంధన ఉంది. పత్రికలకు సంబంధించి ఏడాదికి రూ.రెండు వేలు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఏడాది కాలం నుంచి ఇప్పటిదాకా ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడంతో కో-ఆర్డినేటర్లే అప్పో సప్పో చేసి బిల్లులు చెల్లిస్తున్నారు. 
 
 కుంటుపడుతున్న బోధన....
 వేతనాలు సక్రమంగా అందకపోవడంతో కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. వేతనాలు రాక కో-ఆర్డినేటర్లు కేంద్రా ల నిర్వహణ పట్ల తగిన శ్రద్ధ చూపడం లే దు. దీంతో బోధన కుంటుపడింది. ప్రతిరోజూ రాత్రి 7 గంటల నుంచి 9 వరకు నిరక్షరాస్య మహిళలకు కేంద్రాల్లో పాఠాలు బోధించాలి. పత్రికలు చదివించాలి. అయితే 80 శాతం కేంద్రాల్లో అసలు సక్రమంగా బోధన జరగడంలేదని విమర్శలు వస్తున్నాయి. సకాలంలో వేతనాలు మంజూరు కాకపోవడంతో కో-ఆర్డినేటర్లు కేంద్రాల నిర్వహణపై ఆసక్తి కనబరచడం లేదని సమాచారం.
 
 వచ్చే నెలలో నిధులు వస్తాయి...: జిల్లా సాక్షరభారత్ డీడీ అమ్మాజీరావు
 సాక్షరభారత్ నిర్వాహక కేంద్రాలకు సంబంధించిన కొన్ని రకాల నిధులు వచ్చాయని, కో-ఆర్డినేటర్ల గౌరవవేతనం మాత్రం ఏడాదిగా రావాల్సి ఉందని జిల్లా సాక్షరభారత్ డీడీ అమ్మాజీరావు న్యూస్‌లైన్‌కు తెలిపారు. గౌరవ వేతనానికి సంబంధించిన డేటా వివరాలన్నీ జిల్లా నుంచి పంపామని  వచ్చేనెలలో నిధులు వస్తాయని చెప్పారు. శిక్షణా కేంద్రాల నిర్వహణ ఎక్కడైనా బాగోలేదని స్థానికుల నుంచి ఫిర్యాదు వస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement