అన్నీ మాకే! | Sakshi
Sakshi News home page

అన్నీ మాకే!

Published Fri, Jul 24 2015 2:06 AM

Field Assistant hanumantanayak Remove

 శింగనమల మండలం వెస్ట్ నరసాపురం పంచాయతీ నాగలగుడ్డం తాండా ఫీల్డ్ అసిస్టెంట్ హనుమంతనాయక్‌ను తొలగించాలని కొంతకాలంగా టీడీపీ నాయకుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వ విప్ యామనీబాల కూడా నేరుగా రంగంలోకి దిగినట్లు సమాచారం. అయితే సంబందిత ఫీల్డ్ అసిస్టెంట్‌పై ఎలాంటి అభియోగాలు లేవు. దీంతో తొలగించడం ఎలా అనే అంశంపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
 
 కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కుందిర్పి మండలం తూముకుంట ఫీల్డ్ అసిస్టెంట్ గంగప్ప 60 వేలు దుర్వినియోగానికి పాల్పడినట్లు సోషల్ ఆడిట్‌లో తేలింది. అయితే ఆయనను కొనసాగించాలని టీడీపీ నాయకులు పట్టుబడుతున్నారు.  ఈ మేరకు ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి నుంచి సిఫార్సు లేఖ కూడా తీసుకొచ్చారు. అయితే ప్రభుత్వం విడుదల చేసిన 797 జీవో మేరకు ఇలాంటి వారిని కొనసాగించడానికి వీలు లేదు.
 
 అనంతపురం సెంట్రల్ :
 జిల్లా నీటియాజమాన్య సంస్థ (డ్వామా)లో అధికార పార్టీ నేతల పెత్తనం ఎక్కువయింది. సిబ్బంది తొలగింపు నుంచి నియామకం వరకూ వారు చెప్పిందే జరగాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఎమ్మెల్యే సిఫార్సు లేఖలతో నిత్యం పదుల సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు కార్యాలయంలో తిష్ట వేస్తున్నారు. నేరుగా పరిపాలనా విషయాల్లోకే జోక్యం చేసుకుంటుండంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వారంలోగా ఫీల్డ్ అసిస్టెంట్ భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ వెలువడుతుండడంతో జిల్లా వ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులన్నీ క్లీన్‌స్వీప్ చేయాలనే ఉద్దేశంతో తెలుగుతమ్ముళ్లు ఉన్నారు. జిల్లాలో 1003 పంచాయతీలు ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 243 మంది ఫీల్డ్ అసిస్టెంట్‌లను తొలగించారు.
 
  మరికొంత మందిని తొలగించాలని పట్టుబడుతున్నారు.   ‘ఎమ్మెల్యే చెప్పారు. ఆ ఫీల్డ్ అసెస్టింట్ తొలగించండి. ఇదిగో ఈయన మా పార్టీకి చెందిన వ్యక్తి.. ఆ స్థానంలో ఈయనను నియమించండి’ అంటూ తొలగించడం.. నియమించడం రెండు పనులు వారే చేస్తున్నారు. ముఖ్యంగా ధర్మవరం, కళ్యాణదుర్గం, శింగనమల నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేల సిఫార్సుల లేఖలతో తెలుగుతమ్ముళ్లు వాలిపోతున్నారు. రోజూ రాత్రి పదిగంటల వరకూ కార్యాలయంలోనే గడుపుతున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత పేరు చెప్పి ఆయా మండలాల నాయకులు ఒత్తిళ్లు తెస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు నేరుగా అధికారులకు ఫోన్ల ద్వారా లైన్‌లోకి వస్తున్నారు.
 
  టీడీపీ ప్రజాప్రతినిధుల్లో ఓ పెద్దాయన.. ఆయన కుమారుడు వారంలో రెండు, మూడుసార్లు  డ్వామాకు వస్తున్నారు. ఏదైనా ప్రజాసమస్యపై వచ్చారేమో అని ఆరా తీస్తే ఫీల్డ్ అసిస్టెంట్‌ను తొలగించడం.. నియమించడంపై చర్చించారని తెలుస్తోంది. క్లస్టర్ ఏపీడీల పరిస్థితి మరీ దారుణంగా తయారువుతోంది. నిబంధనల ప్రకారం ఒక ఫీల్డ్ అసిస్టెంట్‌లను తొలగించాలంటే ఉపాధి నిధులు దుర్వినియోగం చేశాడని సోషల్ ఆడిట్‌లో గుర్తించాలి, కూలీలకు పని పెట్టకుండా ఉండాలి, కూలీలకు అందుబాటులోనైనా లేకుండా ఉండాలి. నియమించాలంటే గ్రామాల్లో జన్మభూమి కమిటీ ముగ్గురుని గుర్తించాలి. అందులో అర్హులైన ఒకరిని మండల పరిషత్ అభివృద్ది అధికారి(ఎంపీడీఓ) సిఫార్సు చేయాలి. ఈ రెండు లేకుండానే ఫీల్డ్ అసిస్టెంట్ తొలగించడం.. నియమించడం జరిగిపోతోంది. తెలుగుతమ్ముళ్ల వ్యవహార శైలిని చూసి డ్వామా అధికారులు విస్తుపోతున్నారు.
 

Advertisement
Advertisement