Sakshi News home page

మృత్యుపోరాటం

Published Wed, Aug 19 2015 1:19 AM

Fight to the death

రేగిడి : నిరుపేద.. అనారోగ్యం బారినపడింది.. ఏదో డాక్టర్ వద్దకు వెళ్లి మందులు వాడితే జబ్బు తగ్గిపోతుందని భావించారు.. ఎంత మంది వైద్యుల వద్దకు వెళ్లినా వ్యాధి తగ్గలేదు. చివరికి పొరుగు రాష్ట్రంలో చికిత్స చేయించుకోవాలని వైద్యులు చెప్పారు. అందుకోసం రూ.30 లక్షలు పైగా ఖర్చవుతుందని చెప్పడంతో హుతాశురాలయ్యారు. మరణశయ్యపై ఉన్న ఆమెను బతికించి  పిల్లలను అనాథలు కాకుండా చేయాలని దాతలను కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మండలంలోని వండానపేట గ్రామానికి చెందిన ముంజేటి సుధారాణి, బానోజీ భార్యాభర్తలు. బానోజీ ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారికి దుర్గాప్రసాద్ (5), హేమ (4) పిల్లలు ఉన్నారు.
 
 ఆనందంగా సాగుతున్న వారి జీవితంలో కుదుపు వచ్చింది. గత నెల 25న ఆమెకు నీరసంగా ఉండడంతో రాజాం కేర్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అప్పుడప్పుడు గుండె నొప్పి వస్తోందని చెప్పారు. దీంతో రక్తపరీక్ష నిర్వహించిన వైద్యులు ఆమె ‘బోన్ నేరో విత్ లుకేమియా’ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌లో చికిత్స చేయించుకోవాలని, ఇక్కడ తామేం చేయలేమని చెప్పారు. విశాఖపట్నం వెళ్లి ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలు చేయించారు. వ్యాధి నయం కావాలంటే సుమారు 30 నుంచి రూ. 35 లక్షలు వరకు ఖర్చు అవుతుందని, హైదరాబాద్‌లో మాత్రమే నయం అవుతుందని అక్కడ కూడా చెప్పారు. అసలే అంతంత మాత్రం ఆదాయంతో ఉన్న వారికి ఏం చేయాలో తోచలేదు.పదిహేను రోజుల నుంచి సుధారాణి నీరసించిపోతోంది.
 
  పనులు చేయలేక మంచానికే పరిమితమైంది.  భర్త బానోజీ తన పిల్లలను దగ్గర పెట్టుకొని బాధపడడమే తప్ప ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు.  భార్య కోసం బానోజీ ఇంట్లోనే ఉండడంతో వీరికి పూటగడవడం కూడా కష్టంగా మారింది. లక్షలు వెచ్చించి వైద్యం చేయించలేని పరిస్థితిఉండడంతో తనకు ప్రాణబిక్ష పెట్టాలని సుధారాణి దాతలను వేడుకుంటుంది. సాయం చేయాలనుకున్న దాతలు 9000 049352 నంబరును సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
 
 ప్రాణబిక్ష పెట్టండి.......
 తన భార్యకు దాతలు ప్రాణబిక్ష పెట్టాలి.  ట్రాక్టర్ డ్రైవర్‌గా వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నా భార్య చికిత్సకు  ఇప్పటికే రూ. 50 వేలు అప్పుచేశాను. రూ.లక్షల్లో ఖర్చు చేయలేను. దాతలు ఎవరైనా ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలి
 
 లేవలేకపోతున్నాను......
 వంట్లో పూర్తిగా శక్తి తగ్గిపోతుంది. పైకి లేవలేకపోతున్నాను. పిల్లలు ఏడుస్తుంటే గుండె తరుక్కుపోతోంది.   రోజు రోజుకూ నీరసం ఎక్కువ అయిపోతుంది. పిల్లలు, భర్త ఏమైపోతారోనని దిగులుగాఉంది. ఇటువంటి కష్టం ఎవరికీ రాకూడదు.
 ముంజేటి సుధారాణి, బాధితురాలు, వండానపేట.
 

Advertisement
Advertisement