Sakshi News home page

పల్లెపల్లెనా వైఎస్సార్‌సీపీ పోరు

Published Wed, Oct 16 2013 4:12 AM

Fighting rural villages to YSR CP

సాక్షి, గుంటూరు : సమైక్య పోరును ఇక పల్లెపల్లెలో విస్తృతపరిచేందుకు వైఎస్సార్‌సీపీ నడుం బిగించిందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ తెలిపారు. తమ పార్టీ అధినేత ఈ నెల 17వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఆటోలు, రిక్షాలతో ర్యాలీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ ర్యాలీలో నియోజకవర్గ సమన్వయకర్తలు, మండల, పట్టణస్థాయి నాయకులు, కార్యకర్తలతోపాటు సమైక్యాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.  మంగళవారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజశేఖర్ మాట్లాడుతూ  అన్నం పెట్టిన చేతినే కాటేసినట్లు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం తెచ్చిపెట్టిన ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లోనే గునపాలు గుచ్చారని దుయ్యబట్టారు.
 
 2009 ఎన్నికల మేనిఫెస్టోలోనే ప్రత్యేక తెలంగాణా అంశాన్ని ప్రస్తావించిన టీడీపీ అధికారంలో కొచ్చిన వెంటనే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు అవసరమైన రాజకీయ, చట్ట పరమైన చర్యలు తీసుకుంటుందని లేఖ రాసిన చంద్రబాబు సీమాంధ్ర ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని చెప్పారు. సీమాంధ్ర గల్లీల్లో తిరగలేని టీడీపీ నేతలు ఢిల్లీలో గొప్పలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు జగన్ దీక్షతో దిమ్మతిరిగిన చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కై ఢిల్లీలో దీక్ష చేశారన్నారు. కాంగ్రెస్‌తో ఇంతలా అంటకాగుతున్న చంద్రబాబు ప్రతి విషయంలోనూ తన కుమ్మక్కు రాజకీయాలు బయటపడుతున్నా, మీడియాలో వెల్లడవుతున్నా,  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లాలనుకోవడం ఎల్లో గ్యాంగ్ మానసిక పరిస్థితికి అద్దం పడుతోందని ధ్వజమెత్తారు. అక్టోబరు 2 గాంధీ జయంతి నుంచి నవంబరు 1న ఆంధ్ర రాష్ట్ర అవతరణ వరకు వైఎస్సార్ సీపీ ప్రకటించిన ఉద్యమ కార్యాచరణను పార్టీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్ళాలన్నారు. పార్టీ సీజీసీ సభ్యుడు, గురజాల నియోజకవర్గ సమన్వయకర్త జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ తనది ఏ విధానమో ప్రకటించని చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడిలా మారిందన్నారు. 
 
 టీడీపీ ఎంపీలు సమైక్యాంధ్ర కోసం చేసిన రాజీనామాలు డ్రామాలేనని స్పీకర్ కార్యాలయం విడుదల చేసిన లేఖతో తేటతెల్లమైందన్నారు. టీడీపీ ఎంపీలు పార్లమెంటు ముందు రోజుకో వేషం వేసి సీమాంధ్ర ప్రజల్ని మభ్య పెట్టి రాజీనామాల విషయంలోనూ నాటకాలాడారని అర్ధమైందన్నారు. పెదకూరపాడు సమన్వయకర్త నూతలపాటి హనుమయ్య మాట్లాడుతూ విభజనవాదుల్ని ఆనాడే నిలదీసినఘనత ఒక్క వైఎస్సార్‌కు తప్ప వేరెవ్వరికీ లేదన్నారు. కేసీఆర్ ఎన్ని రెచ్చగొట్టే వాఖ్యలు చేసినా చంద్రబాబు నోరు మాత్రం ఏనాడూ పెగల్లేదని, సీమాంధ్ర వాసులపై చంద్రబాబుకున్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధమవుతుందన్నారు. జిల్లా యువజన విభాగం కన్వీనరు కావటి మనోహర్ నాయుడు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సీమాంధ్ర ప్రాంతంలోని టీడీపీ నేతల్ని తరిమి తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని జోస్యం చెప్పారు. సమావేశంలో పార్టీ నేత శివారెడ్డి పాల్గొన్నారు. 
 

Advertisement

What’s your opinion

Advertisement