అమ్మవారి సన్నిధిలో ఆధిపత్య పోరు | Sakshi
Sakshi News home page

అమ్మవారి సన్నిధిలో ఆధిపత్య పోరు

Published Sat, May 10 2014 1:31 AM

అమ్మవారి సన్నిధిలో ఆధిపత్య పోరు

అందరూ కలసికట్టుగా ఉంటేనే ఇంటి నిర్వహణ అయినా, ఆలయ బాధ్యతలయినా   సక్రమంగా ఉంటాయి. ఎవరికి వారు ఆధిపత్యానికి ప్రయత్నిస్తే నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతుంది. నలుగురిలో నవ్వులపాలవుతారు. తిరుచానూరు అమ్మవారి ఆలయంలో ఇదే జరుగుతోంది. అర్చకులు, సిబ్బంది, అధికారులు సమన్వయంతో పనిచేయాల్సింది పోయి ఆధిపత్యం కోసం పాకులాడుతున్నారు. దీంతో ఆలయ పాలన గాడి తప్పింది. ఫలితంగా అమ్మవారి లక్ష్మీకాసుల హారం మూడు రోజులపాటు మాయమై టీటీడీ ప్రతిష్టను అప్రతిష్టపాలు చేసింది. ఇప్పటికైనా వీరంతా  ఆధిపత్యం కోసం ప్రయత్నాలు వదిలి, అమ్మవారి సేవకు తమ సమయాన్ని వెచ్చిస్తే ఏ హారాలూ పోవు.. భక్తుల మనోభావాలూ దెబ్బతినవు!
 
తిరుచానూరు, న్యూస్‌లైన్ : పద్మావతి అమ్మవారి ఆలయంలో అధికారులు, అర్చకులు, విజిలెన్స్ సిబ్బంది  మధ్య కొంతకాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. టీటీడీలో తిరుమల శ్రీవారి ఆలయం తరువాత అంత ప్రాశస్త్యం ఉన్నది తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికే. ఈ ఆలయంలో తమదే పైచేయిగా ఉండాలన్నదే వీరి ఆధిపత్య పోరుకు కారణం.

కొంతకాలంగా ఈ మూడు వర్గాల మధ్య సఖ్యత కొరవడింది. సమన్వయం లేకపోవడంతో అమ్మవారి కైంకర్యాల్లోనూ, ఇతర వ్యవహారాల్లోనూ పొరపాట్లు దొర్లుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. అమ్మవారి లక్ష్మీహారం మాయమవడం.. మూడురోజుల తర్వాత మళ్లీ ప్రత్యక్షమవడం అంతా అమోమయంగా ఉంది. సాధారణంగా రెండు మూడు గ్రాముల బంగారు నగ కనిపిం చకుండా పోతేనే ఇల్లంతా వెతుకుతాం.

ఊర్లోని వారందరికీ చెబుతాం. అదే 217 గ్రాముల బరువున్న లక్ష్మీకాసుల హారం పోతే! ఎంత కంగారు.. ఎంత భయం! ఎంతగా వెతుకుతాం.. ఎంతమందికి చెబుతాం!  తిరుచానూరు ఆలయంలో మాత్రం అర్చకులు, అధికారులు ఈ వ్యవహారాన్ని మూడు రోజులు రహస్యంగా ఉంచారు. మంగళవారం హారం మాయమైతే గురువారం ఈ విషయం బయటకు పొక్కింది. పలు టీవీ చానళ్లలో ప్రసారం అయింది. దీంతో హారం శుక్రవారం ఆల యంలో ప్రత్యక్షమయింది. నీటి తూములో ఉందని, ఎక్కడికీ పోలేదని అర్చకులు తెలి పారు.

పవిత్రమైన లక్ష్మీకాసుల హారం గర్భగుడిలోని నీటి తూములో పడి ఉండడం సందేహానికి తావిస్తోంది. ఇంత పెద్ద హారం కిందపడి ఉండడాన్ని అర్చకపరిచారకులు ఎందుకు గుర్తించలేకపోయారు. విలువైన లక్ష్మీకాసుల హారం కనిపించకపోవడానికి కారణాలు ఏమిటి, దీని వెనుక ఎవరి పాత్ర అయినా ఉందా,  ఈ ఘటనకు బాధ్యులెవరు అనే కోణంలో టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ చేపడుతున్నారు.
 
ఎంత నిర్లక్ష్యమో..

కొన్నేళ్ల క్రితం తిరుచానూరు ఆలయంలో కీలక హోదాలో విధులు నిర్వహించిన ఓ అధికారి ఏకంగా అమ్మవారి నగలను ఎటువంటి భద్రత లేకుండా ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లారు. ఇది అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఆయన పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ పనితీరు సరిగా లేకపోవడంతోనే ఆ అధికారి విలువైన బంగారు ఆభరణాలను ఎటువంటి భద్రత లేకుండా టీటీడీ జ్యుయెలరీ విభాగానికి తీసుకెళ్లారని విచారణలో తేలింది. ఈ వ్యవహారంతో విజిలెన్స్ అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ చర్యతో అధికారులు, అర్చకులు, విజిలెన్స్ అధికారుల మధ్య విభేదాలు చోటుచేసున్నాయి.
 
గతంలో తాళం చెవి మాయం..
 
సుమారు ఏడాది క్రితం అమ్మవారి ఆలయంలోని పరకామణికి సంబంధించిన తాళం చెవులు కనిపించకుండా పోయాయి. సిబ్బంది పొరపాటు, నిర్లక్ష్యం కారణంగా తాళంచెవి అమ్మవారి హుండీలో పడిపోయింది. హుండీలోని డ బ్బులు లెక్కించే సమయంలో తాళాలు బయటపడ్డాయి. ఈ వ్యవహారంలో ఓ ఉద్యోగిపై వేటుపడింది. ఇప్పటికైనా ఆలయ అధికారులు, అర్చకులు, విజిలెన్స్ సిబ్బంది ఆధిపత్య పోరుకు స్వస్తి పలికి అమ్మవారి ఆలయం, టీటీడీ ప్రతిష్టకు భంగం కలగకుండా వ్యవహరించాలని అటు స్థానికులు, ఇటు భక్తులు కోరుతున్నారు.

Advertisement
Advertisement