ఇంక సెలవు | Sakshi
Sakshi News home page

ఇంక సెలవు

Published Fri, Jan 24 2014 1:06 AM

final fare well to akkineni nageswara rao

నటసమ్రాట్ అక్కినేనికి తెలుగు జాతి తుది వీడ్కోలు
 
 
 సాక్షి, హైదరాబాద్: తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు గురువారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రభుత్వ అధికార లాంఛనాలతో ముగిశాయి. కుటుంబ సభ్యులు, అశేష అభిమాన జనవాహిని శోకతప్త హృదయాలతో ఆయనకు అంతిమ వీడ్కోలు పలికారు. అక్కినేని తనయులు వెంకట్, నాగార్జున సంప్రదాయ పద్ధతిలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అక్కినేని మనవడు సుమంత్ ముందుగా నాగార్జునతో కలిసి ప్రదక్షిణలు చేశారు. నాగార్జున భుజంపై కుండతో తండ్రి పార్థివ దేహం చుట్టూ ఐదుసార్లు ప్రదక్షిణలు చేశారు.
 
 ఆయనతో పాటు కుమారుడు వెంకట్, కూతురు నాగసుశీల, కోడలు అమల, మనవలు సుమంత్, నాగచైతన్య, సుశాంత్, అఖిల్ తదితరులు కూడా ప్రదక్షిణలు చేశారు. కన్నీళ్ల మధ్య కార్యక్రమాన్ని కొనసాగించారు. పలువురు ప్రముఖులు అక్కినేని చితిపై గంధపు చెక్కలు వేసి నివాళులర్పించారు. పోలీసు లు అధికారిక లాంఛనాలతో అక్కినేనికి గౌరవ వందనం సమర్పించారు. గాల్లోకి తుపాకులు ఎక్కుపెట్టి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. అదే సమయంలో నాగార్జునతో పాటు కుటుంబసభ్యులంతా కలిసి చితికి నిప్పంటించారు. పోలీసులు బ్యాండ్‌మేళాతో గౌరవ వందనం సమర్పించారు. అంతటితో అంత్యక్రియల ఘట్టం ముగిసింది. చితికి నిప్పంటించిన సమయంలో నాగార్జున దుఃఖాన్ని ఆపుకోలేక పోయా రు. ఆయనను సముదాయించడం ఎవరి తరమూ కాలేదు. అంత్యక్రియలు ముగించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో కూడా నాగార్జున గుండెలవిసేలా ఏడుస్తూనే ఉన్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఓదార్చే ప్రయత్నం చేయగా అక్కడే ఉన్న దాసరి, చిరంజీవి, రామానాయుడులను పట్టుకొని నాగార్జున విలపించారు. నాన్న మరిక లేరంటూ బోరున ఏడ్చేశారు. దాంతో చిరంజీవి, దాసరి, రామానాయుడు కూడా కన్నీరు కార్చారు.
 
 ఘన నివాళులు
 
 అక్కినేని అంత్యక్రియలకు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉదయం నుంచి పలువురు ప్రముఖులు అన్నపూర్ణ స్టూడియోకు చేరుకుని అక్కినేని భౌతికకాయాన్ని సందర్శించి ఘన నివాళులర్పించారు. అంత్యక్రియలకు అలనాటి అగ్ర తార శ్రీదేవి ముంబై నుంచి ప్రత్యేకంగా వచ్చారు. వెంకటేశ్, జూనియర్ ఎన్టీఆర్, టబు, అనుష్క, జయసుధ, కైకాల సత్యనారాయణ, నిర్మాత డి.రామానాయుడు, దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, డి.సురేశ్‌బాబు, భానుచందర్, సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఆర్.నారాయణమూర్తి, బ్రహ్మానందం, మురళీమోహన్ సహా ఎందరో సినీ నటులు అక్కినేని అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు కూడా పాల్గొన్నారు.
 
 గురువారం తెల్లవారుజాము నుంచే అభిమానులు అన్నపూర్ణ స్టూడియో ముందు బారులు తీరారు
 గేట్లు తెరవగానే భారీగా లోనికి చొచ్చుకెళ్లారు. అక్కినేని భౌతికకాయాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు
 అక్కినేని స్వగ్రామం రామాపురం నుంచి గ్రామస్తులు బ్యానర్లతో ర్యాలీగా తరలివచ్చారు
 
 విజయనగరం నుంచి కూడా అక్కినేని అభిమానులు బస్సుల్లో తరలివచ్చారు
 అభిమానులు చెట్లెక్కి, కరెంట్ తీగల పక్కనే నిలబడి మరీ అంత్యక్రియలను చూస్తూ విలపించారు
 అక్కినేని ఫొటోతో కూడిన బ్యానర్లు పట్టుకుని, దారి పొడవునా ‘అమరజీవి అక్కినేని అమర్ రహే’ అంటూ నినాదాలు చేశారు
 60 ఏళ్లుగా అక్కినేనిని అభిమానిస్తున్న గుంటూరుకు చెందిన షేక్ అమీన్ తన హీరోను కడసారి చూసుకునేందుకు వచ్చాడు.
 ఓ వికలాంగ అభిమాని అంతిమయాత్ర పొడవునా చేతులపైనే నడిచి అభిమానం చాటుకున్నాడు
 చాలామంది అభిమానులు అక్కినేని పాత ఫొటో డిజైన్ చేసిన నల్ల బ్యాడ్జీలు ధరించారు
 అక్కినేని మృతికి సంతాప సూచకంగా గురువారం రాజధానిలోని అన్ని థియేటర్లలోనూ మార్నింగ్ షోలు రద్దు చేశారు
 సినీ, టీవీ షూటింగులన్నీ రద్దయ్యాయి. సినీ కార్మిక సంఘ కార్యాలయాలు మూతపడ్డాయి
 సినీ కార్మికులు భారీ ర్యాలీగా అంత్యక్రియలకు తరలివచ్చారు
 
 పోటెత్తిన జనసంద్రం
 
 అక్కినేని భౌతిక కాయాన్ని కడసారిచూసేందుకు ఉదయం నుంచే ప్రజలు, అభిమానులు రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా తరలి వచ్చారు. అన్నపూర్ణ స్టూడియో ప్రాంగణంతో పాటు పరిసరాలు ఇసుకేస్తే రాలనంతగా నిండిపోయాయి. అన్నపూర్ణ స్టూడియోకు దారితీసే రోడ్లన్నీ జనంతో పోటెత్తాయి. భారీ ట్రాఫిక్ రద్దీ నెలకొంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో  అన్నపూర్ణ స్టూడియో నుంచి ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో అక్కినేని పార్థివ దేహాన్ని ఫిల్మ్ చాంబర్‌కు తరలించారు.  12.30 గంటలకు అక్కినేని భౌతికకాయాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శన కోసం ఫిల్మ్ చాంబర్‌లో ఉంచారు. మధ్యాహ్నం 1 గంటకు ఫిల్మ్ చాంబర్ నుంచి అక్కినేని అంతిమయాత్ర మొదలైంది. ఫిల్మ్ నగర్, జర్నలిస్ట్ కాలనీ, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు మీదుగా సాగింది. సినీ, రాజకీయ ప్రముఖులు వెంట రాగా, దారి పొడవునా అభిమానులు కన్నీరు కారుస్తూ సాగారు. సాయంత్రం 3.05కి అన్నపూర్ణ స్టూడియోస్‌కు చేరేసరికే రోడ్లన్నీ జనంతో నిండిపోయాయి.  ప్రధాన ద్వారం నుంచి అంత్యక్రియలు జరిగే ప్రాంతానికి అక్కినేని పార్థివ దేహాన్ని చేర్చడానికి అరగంట పట్టింది.
 
 అక్కినేనికి కర్ణాటక అసెంబ్లీ గురువారం ఘన నివాళులు అర్పించింది. ఆయన మరణం పట్ల సంతాప సూచకంగా నిమిషం పాటు మౌనం పాటించింది. అక్కినేని మృతి సినీ ప్రేక్షకులకు తీరని లోటని స్పీకర్ కాగోడు తిమ్మప్ప అన్నారు. పలు రికార్డులు ఆయన సొంతమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు.
 

Advertisement
Advertisement