సింహపురి ఎడారే! | Sakshi
Sakshi News home page

సింహపురి ఎడారే!

Published Sat, Nov 30 2013 3:55 AM

Final Judgment on Krishna Waters by Brijesh Kumar Tribunal

కృష్ణా మిగులు జలాలపై దిగువ రాష్ట్రానికి హక్కు లేదని, మిగులు జలాలు వాడుకునే హక్కు ఎగువ రాష్ట్రాలదేనని శుక్రవారం బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు జిల్లా రైతాంగానికి తీవ్ర వేదనను మిగిల్చింది. పెన్నా, కృష్ణా మిగులు జలాలపై ఆధారపడిన జిల్లాలోని సోమశిల, కండలేరు జలాశయాలు, వాటి పరిధిలోని 10 లక్షల ఎకరాల ఆయకట్టు ఎడారిగా మారనుంది. జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలకు సైతం తిండిగింజలు అందించి అన్నంపెట్టే సింహపురి ఇకపై గుక్కెడు తాగునీటికి సైతం అలమటించే పరిస్థితి తలెత్తనుంది. దీంతో ఇక్కడి రైతాంగంలో తీవ్ర ఆందోళన నెలకొంది.
 
 సాక్షి, నెల్లూరు:  కృష్ణా, గోదావరి తర్వాత అత్యధికంగా వరిసాగు చేసేది నెల్లూరు జిల్లాలోనే. జిల్లా వ్యవసాయం మొత్తం 78 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన సోమశిల, 68 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన  కండలేరు జలాశయాలపైనే ఆధారపడి ఉంది. కృష్ణా జలాల్లో చెన్నై తాగునీటి అవసరాలకు కేటాయించిన  15 టీఎంసీల నీరు మినహా జిల్లాకు నికర జలాలు అంటూ చుక్కనీటి కేటాయింపులు లేవు.
 
 అంతా వర్షపు నీరు, కృష్ణా మిగులు జలాలు తప్ప.
 సోమశిల: సోమశిలకు ప్రధాన నీటివనరు పెన్నానది. అయితే రానురానూ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో  పెన్నాద్వారా నీళ్లొచ్చే పరిస్థితి లేకుండా పోతోంది. దీంతో రెండుమూడేళ్ల కొకసారికూడా సోమశిల కింద పూర్తి ఆయకట్టు సాగులోకి వచ్చే పరిస్థితి లేదు. ఇక ఉన్న ఆధారమంతా కృష్ణా మిగులు జలాలే. వర్షాలు, వరదనీరు అధికంగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు నుంచి పెన్నామీదుగా సోమశిలకూ, అక్కడి  నుంచి కండలేరుకూ నీరు చేరుతోంది. దీంతో పాటు
 కడప జిల్లాలోని కేసీకెనాల్ ఆయకట్టు  రీజనరేషన్ వాటర్ సైతం పెన్నాద్వారా సోమశిలకు చేరుతోంది. ఈ నీటితో  సోమశిల పరిధిలో పెన్నాడెల్టా, మిగిలిన ప్రాంతాల్లో దాదాపు 7 లక్షల ఎకరాలు, కండలేరు పరిధిలో అధికారికంగా 2.75 లక్షల ఎకరాలు అనధికారికంగా 3 లక్షల ఎకరాలు కలిపి మొత్తం 10 లక్షల ఎకరాలు ఒక్క కారులోనే సాగవుతోంది.
 
 ఇది కాక చెరువుల ఆక్రమణలు, శివాయీలు, అనాదీన పొలాలు అన్నీ కలుపుకుంటే 15 నుంచి 20 శాతం ఆయకట్టు అదనంగా ఉంటుంది. నీళ్లు  ఆశించిన మేరకు చేరితే రెండోపంట సైతం మరో 5 లక్షల ఎకరాలకు తగ్గకుండా సాగవుతుంది. మొత్తంగా కాలం కనికరిస్తే జిల్లాలో ఏడాదికి 15 లక్షల ఎకరాలలో వరిసాగవుతుంది. దీంతో జిల్లా ప్రజలేగాక రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలవారికి సింహపురి నుంచే తిండి గింజలు సరఫరా అవుతాయి.
 
 బ్రజేశ్ తీర్పుతో..
 మిగులు జలాలపై దిగువరాష్ట్రానికి హక్కులేదని బ్రజేశ్‌కుమార్ వెలువరించిన  తీర్పుతో ఇక కృష్ణా మిగులు జలాలు దక్కే పరిస్థితి ఉండదు. దీంతో జిల్లాలో వ్యవసాయం పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి నెలకొననుంది. సోమశిల, కండలేరు పరిధిలో  లక్షలాది ఎకరాల ఆయకట్టు బీళ్లుగా మారనుండగా మెట్ట ప్రాంతాల్లో తాగునీరు కూడా సక్రమంగా అందే పరిస్థితి ఉండదు. పర్యవసానంగా లక్షలాది మందికి అన్నంపెట్టిన  సింహపురి రైతులకు తిండి గింజలు దొరికే పరిస్థితి ఉండదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
 జలయజ్ఞం భగ్నమే
 బ్రజేశ్ తీర్పుతో జిల్లాలో జలయజ్ఞం పనులు ఆగిపోనున్నాయి. ఇటీవలే 15 వందల కోట్లతో సోమశిల హైలెవల్ కెనాల్‌కు  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి  శంకుస్థాపన చేశారు. ఈ పథకం వల్ల ఉదయగిరి, కావలి ప్రాంతాల్లో మరో 90 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుండడంతో పాటు  పెద్ద ఎత్తున తాగునీటి అవసరాలకు  ఈ నీటిని వినియోగించేలా అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. బ్రజేశ్ తీర్పుతో ఈ పథకం ప్రశ్నార్థకంగా మారనుంది.
 
 సోమశిలకు అంచనా మేరకు 48 టీఎంసీల నీరు అవసరమైనా  భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ముందు జాగ్రత్తగా వరద నీటిని నిలువ ఉంచుకోవాలన్న ఆలోచనతో కోట్లు వెచ్చించి వైఎస్సార్ హయాంలో  78 టీఎంసీల కెపాసిటీ సామర్థ్యంతో రిజర్వాయర్‌ను విస్తరించారు.
 ఇక కండలేరుదీ అదే పరిస్థితి. 30 టీఎంసీల నీరు  అవసరమైనా వరదనీటిని నిలువ ఉంచుకొనేందుకు వీలుగా  68 టీఎంసీల సామర్థ్యంతో కండలేరును ఆధునికీకరించారు. వీటితో పాటు జిల్లాలో వందలకోట్లతో పెన్నా, సంగం బ్యారేజీలతో పాటు పలు జలయజ్ఞవ పనులు జరుగుతున్నాయి.
 
 అయితే బ్రజేష్ తీర్పుతో ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరు కానున్నాయి. జలయజ్ఞం నిరుపయోగంగా మారనుంది. దీంతో సింహపురి రైతన్నల భవితవ్యం అంధకారం కానుంది. బ్రజేష్ ఏకపక్షంగా ఆంధ్రరాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా, కర్ణాటక ప్రయోజనాలకు అనుగుణంగా తీర్పు వెలువరించారు. ముఖ్యంగా ఆల్‌మట్టి ఎత్తు పెంచుకోవడం సబబే అని పేర్కొనడంపై జిల్లా ప్రజల్లో ముఖ్యంగా రైతాంగంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. ఇప్పటికైనా జిల్లాకు చెందిన  ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు స్పందించి కృష్ణా మిగులు జలాల సాధన కోసం కృషి చేయాలని వారు కోరుతున్నారు.
 

Advertisement
Advertisement