ఎట్టకేలకు ఆన్‌లైన్‌లో మాఫీ జాబితా | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు ఆన్‌లైన్‌లో మాఫీ జాబితా

Published Mon, Dec 8 2014 7:02 AM

Finally waived the list online

ఆధార్ లేదా ఖాతా నంబర్‌తో వివరాలు వెల్లడి
 
హైదరాబాద్/విజయవాడ బ్యూరో : రుణ మాఫీకి అర్హులైన రైతుల జాబి తాను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆదివారం మధ్యాహ్నం ఆన్‌లైన్‌(http://apcbsportal.ap.gov.in/loanstatus)లో పెట్టింది. రూ.50 వేల లోపు రుణాలున్న రైతుల జాబితాను ఇందులో ఉంచినట్లు పేర్కొంది. ఎవరి ఖాతాకు చెందిన వివరాలు వారు చూసుకునే విధంగా జాబితాను ఉంచింది. అయితే, రుణ మాఫీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న రైతులకు ప్రభుత్వం ఇక్కడా మరో పరీక్ష పెట్టింది.

 

రుణం మాఫీ అయిందో లేదో తెలుసుకోవడానికి రేషన్ కార్డు, ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్లను లింకు పెట్టింది. వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి ఈ మూడింటిలో ఏదో ఒక దాని ఆధారంగా రుణ మాఫీ వివరాలు తెలుసుకోవచ్చని ప్రకటించింది. దీంతో ఆదివారం సాయంత్రం వివిధ జిల్లాల్లో  రైతులు ఆ వెబ్‌సైట్‌లో వారి వివరాలు చూసుకునేందుకు ప్రయత్నించారు. అయితే, సగం మంది రైతులకు వెబ్‌సైట్ ఓపెన్ కాలేదు.

రేషన్ కార్డు, ఆధార్ కార్డుల నంబర్లను పూర్తిగా తీసుకోవడంలేదని గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల రైతులు కొందరు తెలిపారు. కొన్ని జిల్లాల్లోని డీసీసీబీ బ్రాంచిల వివరాలే ఇందులో కనిపించలేదని మరికొందరు చెప్పారు. మరోపక్క వెబ్‌సైట్‌లో ఉంచిన జాబితా అంతా గందరగోళంగా ఉంది. ఆధార్ లేదా బ్యాంకు ఖాతా నంబర్ ఎంటర్ చేస్తే కొంత మంది రైతుల వివరాలు ఉంటున్నాయి.

 

మరి కొంత మందివి లేవు. ఒక వ్యక్తి ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే తొలుత ఒక ఖాతాలో రూ.36 వేలు, మరో ఖాతాలో రూ. 13 వేల రుణం ఉన్నట్లు వచ్చింది. పక్కనే కుటుంబ వివరాలు లేవని రాశారు. గంట తరువాత మళ్లీ చూస్తే తొలి జాబితాలో మీ పేరు లేదంటూ ఆన్‌లైన్‌లో సమాధానం వచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైతుల్లో ఆందోళన నెలకొంది.

Advertisement
Advertisement