పెళ్లికూతురి ఇల్లు దగ్ధం | Sakshi
Sakshi News home page

పెళ్లికూతురి ఇల్లు దగ్ధం

Published Thu, Aug 29 2013 2:15 AM

fire accident spoil marriage arrangements

తెనాలిరూరల్, న్యూస్‌లైన్ : మరికొన్ని గంటల్లో వివాహం జరుగనుందన్న ఆనందాన్ని అగ్నిదేవుడు ఆవిరి చేశాడు. వధువుతోపాటు ఆమె కుటుంబాన్ని కన్నీటి సంద్రంలో ముంచేశాడు. గ్యాస్ లీకై ఇల్లు దగ్ధంకావడంతోపాటు పెళ్లి కోసం దాచిన నగదు, ఆభరణాలు, కొత్త దుస్తులు సైతం బుగ్గిపాలవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఈ ఘటన తెనాలి మండలం ఐతానగర్ శివారు యడ్లపాటి వెంకట్రావునగర్‌లో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు ఇవీ... 
 
 యడ్లపాటి వెంకట్రావునగర్‌లో నివసించే రిక్షా కార్మికుడు గుంజే ప్రసాద్, పోలేరమ్మ దంపతులకు  ముగ్గురు కుమార్తెలు. ఇరువురికి గతంలోనే వివాహం చేశారు. మూడో కుమార్తె పద్మావతికి అదే ప్రాంతానికి చెందిన తన్నీరు గోపితో బుధవారం రాత్రి వైకుంఠపురంలో వివాహం జరిపేందుకు నిశ్చయించారు. బుధవారం మధ్యాహ్నం  పెళ్లికూతురికి నలుగుపెడుతున్న సమయంలో వీరి ఇంట్లోని గ్యాస్ సిలిండర్ లీకై మంటలు వ్యాపించాయి. గ్యాస్ సిలిండర్ పేలుతుందనే భయంతో అందరూ ఆర్తనాదాలు చేయటం మినహా ఇంట్లోకి వెళ్లేందుకు సాహసించలేదు. ఇల్లు, ఇంట్లోని సామగ్రితోపాటు పెళ్లికోసం దాచి ఉంచిన నగదు రూ.70వేలు, పెళ్ళికొడుకు కోసం చేయించిన బంగారు గొలుసు, పెళ్లికూతురికి చేయించిన బంగారు బుట్టలు, పెళ్లి దుస్తులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇదే ఇంటికి అనుకుని ఉన్న మరో పూరిల్లు కూడా బూడిదైంది.  క్షణాల్లో జరిగిన పరిణామంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానికులతో కలిసి  మంటలను అదుపుచేశారు. మొత్తమ్మీద ప్రాణాపాయం లేకపోవటంతో స్థానికులు కొంత మేరకు ఊపిరిపీల్చుకున్నారు.
 
 చింతాయపాలెంలో మరో పూరిల్లు..
 చింతాయపాలెం(కర్లపాలెం): పూరిల్లు దగ్ధమై రూ.లక్ష ఆస్తినష్టం జరిగిన సంఘటన బుధవారం చింతాయపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం చింతాయపాలెం పంచాయతీ తూర్పుపాలెం గ్రామానికి చెందిన ఏనుగు శేషయ్య, శివకుమారి దంపతులు బుధవారం పొలం పనికి వెళ్లారు. ఉదయం 10గంటల సమయంలో ఇంటిపైకప్పునకు మంటలంటుకున్నాయి. గృహంలోని వస్తువులు, రెండు శవర్ల బంగారం దగ్ధమయ్యాయి.  అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు.   ప్రమాదానికి కారణం తెలియలేదు. 
 

Advertisement
Advertisement