Sakshi News home page

మొదటి మెట్టు.. అదిరేట్టు!

Published Fri, Apr 24 2015 2:59 AM

first rate

కర్నూలు(జిల్లా పరిషత్): రోజు కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వెంకట్రాముడు కుమారుడు జి.శ్రీకాంత్ కర్నూలులోని టౌన్ మోడల్ జూనియర్ కాలేజీలో చదువుతూ ఎంపీసీలో 438 మార్కులు సాధించాడు.  కోవెలకుంట్ల ఆర్టీసీ బస్టాండులో కూల్ డ్రింక్ షాపు నడుపుకుంటున్న స త్యనారాయణ, అనసూయ ల కూతురు సుప్రియ ఎంపీసీలో 422మార్కులు సాధించింది.
 
 కర్నూలు పండ్ల మార్కెట్‌లో గుమాస్తాగా పనిచేస్తున్న ఖలీల్ కుమారుడు షేక్ జుల్ఫీకర్.. కర్నూలులోని టౌన్ మోడల్ జూనియర్ కాలేజీలో చదువుతూ ఎంఈసీలో 458 మార్కులు దక్కించుకున్నాడు.
 
 దోర్నిపాడు మండలం డబ్ల్యు.గోవిందిన్నెకు చెందిన రోజు కూలీలు ఉస్సేన్‌సా, జివీదా బేగంల కుమారుడు మస్తాన్ వలి సీఈసీలో 419 మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు.  ఆదోనిలోని ప్రైవేట్ ఐటీఐ కాలేజిలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న కె. విజయకుమార్ కుమార్తె కె.సాయివర్షిణి స్థానిక అక్షరశ్రీ జూనియర్ కాలేజిలో చదువుతూ ఎంపీసీలో 438 మార్కులు సాధించింది.
 
 వీరే కాదు... జిల్లావ్యాప్తంగా అనేక మంది పేదింటి ఆణిముత్యాలు మెరిశాయి. అష్టకష్టాలకోర్చి చదువుకుని తమ సత్తా చాటారు. చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం కూడా పెరిగింది. మొత్తం మీద జిల్లా రేటింగు ఈ ఏడాది కూడా మెరుగుపడింది.
 
 గత ఏడాది మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లాలో 51 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా... ఈ ఏడాది 58.03 శాతానికి పెరిగింది. ఫలితంగా జిల్లా రేటింగు 11 నుంచి 9వ స్థానానికి చేరుకుంది. మరోవైపు సాంఘిక గురుకులాల విద్యార్థులు కూడా మెరుగైన ఫలితాలు సాధించారు. యథావిధిగా ఫలితాల్లో బాలురకంటే బాలికలే పైచేయి సాధించారు. ఎప్పటిలాగే కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల విద్యార్థులు జిల్లా స్థాయి టాపర్లుగా నిలిచారు. బైపీసీ, ఎంపీసీ, ఎంఈసీ సబ్జెక్టుల్లో టాప్‌మార్కులతో ఉత్తీర్ణులయ్యారు.
 
 పెరిగిన ఉత్తీర్ణత శాతం
 జిల్లావ్యాప్తంగా మొత్తం 35,602 మంది విద్యార్థులు మొదటి ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 20,661 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే 58.03 శాతం ఉత్తీర్ణత నమోదయిందన్నమాట. గత ఏడాది జిల్లాలో నమోదైన ఉత్తీర్ణత శాతం కేవలం 51 శాతమే. గత ఏడాది కంటే ఏకంగా 7.03 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగానూ జిల్లా రికార్డు మెరుగుపడింది. గత ఏడాది ఫలితాల్లో జిల్లాకు 11వ స్థానం దక్కగా... ఈ సారి 9వ స్థానం దక్కింది.
 
 ప్రభుత్వ కళాశాలల్లో పెరిగిన ఉత్తీర్ణత
 జిల్లాలోని 42 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ యేడాది ఉత్తీర్ణత శాతం పెరిగింది. గత యేడాది జిల్లాలో ప్రథమ సంవత్సరం ఇంటర్‌లో 38 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ యేడాది 48 శాతం ఉత్తీర్ణత నమోదైంది. జిల్లాలో మొత్తం 7,209 మందికి గాను 43,495 మంది(48శాతం) ఉత్తీర్ణత సాధించారు. అందులో బాలురు 4,206 మందికి గాను 1,916 మంది(47 శాతం), బాలికలు 3,103 మందికి గాను 1,579(51శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.
 
 ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యం
 కర్నూలు కొత్తబస్టాండ్ ఎదురుగా ఉండే కాలనీలో నివాసం ఉంటున్న ఎన్‌డి జగన్.. ఎంపీసీలో 466 మార్కులు సాధించి సత్తా చాటాడు. ఇతని తండ్రి ఎన్‌డి రాజశేఖర్ స్థానికంగా ఫైనాన్స్ వ్యాపారం చేస్తారు. తల్లి రాధ గృహిణి. వీరికి  ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడైన జగన్ పదో తరగతి వరకు ఎ.క్యాంపులోని మాంటిస్సోరి హైస్కూల్‌లో చదివాడు. ఇంటర్ మీడియట్‌కు గాను భాగ్యనగర్‌లోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో చేరి ప్రథమ సంవత్సరంలో 466 మార్కులు సాధించడం పట్ల తన కుటుంబం ఎంతో ఆనందంగా ఉందని తెలిపాడు. దేశంలోని  టాప్ 7 ఐఐటీ యూనివర్శిటిల్లో సీటు సాధించాలన్నది తన లక్ష్యమని జగన్ చెప్పాడు.
 
 డాక్టర్ కావాలన్నదే నా కల
 కర్నూలు నగరం ఎన్‌ఆర్‌పేటకు చెందిన ముబీనాయాస్మిన్ బైపీసీలో 436 మార్కులు సాధించింది. ఆమె తండ్రి అబుల్ హసన్ ప్లాట్ల విక్రేత. తల్లి గోమర్ మల్లిక గృహిణి. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. యాస్మిన్ పదోతరగతి వరకు స్థానిక ఎన్‌ఆర్ పేటలోని శ్రీ లక్ష్మి హైస్కూల్‌లో చదివింది. ఇంటర్‌లో నారాయణ జూనియర్ కళాశాలలో చేరి ప్రథమ సంవత్సరంలోనే 436 మార్కులు సాధించడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవదుల లేకుండా పోయాయి. మెడిసిన్‌లో సీటు సాధించి డాక్టర్ కావాలన్నదే తన కలని యాస్మిన్ తెలిపింది.
 

Advertisement
Advertisement