ఆ.. ఐదు కోట్లు ఏమయ్యాయ్? | Sakshi
Sakshi News home page

ఆ.. ఐదు కోట్లు ఏమయ్యాయ్?

Published Mon, Oct 27 2014 12:40 AM

ఆ.. ఐదు కోట్లు ఏమయ్యాయ్?

నెల్లూరు (సెంట్రల్) :
 కార్పొరేషన్ పరిధిలో రిలయన్స్ సంస్థ తమ కేబుల్ పనుల నిమిత్తం తీసిన గుంతలు పూడ్చేందుకు కార్పొరేషన్‌కు ఇచ్చిన రూ.5 కోట్లు ఏమయ్యాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రశ్నించారు. స్థానిక రూరల్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్‌లోని పలువురు అధికారుల పనితీరుపై విమర్శలు గుప్పించారు.

కొందరు అధికారుల అలసత్వం, అవినీతి వల్ల నగర ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి దాపురించిందని చెప్పారు. చిన్న పాటి వర్షం వచ్చినా ఈ గుంతలలో నీరు చేరి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రిలయన్స్ సంస్థ తీసిన గోతులు పూర్తిస్థాయిలో మూసివేసి యథాస్థితికి తెచ్చేందుకు కార్పొరేషన్‌కి రూ.4.96 కోట్లు ఇచ్చిందన్నారు. ఆ కోట్లు ఏమయ్యాయో తెలియదని, గుంతలు మాత్రం అలాగే ఉన్నాయని చెప్పారు.

రిలయన్స్ సంస్థ ఇచ్చిన నగదును ఏ పనులకు వాడారు.. ఎందుకు వాడారు.. ఒక పని కోసం ఇచ్చిన నగదును మరో పనికి వినియోగించి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం తగునా.. అనే విషయాలపై సమాధానం చెప్పాల్సిన అవసరముందన్నారు. కార్పొరేషన్‌కు ఐఏఎస్ అధికారి వచ్చారని, ఇక్కడి వ్యవహారాలపై దృష్టి సారించాలని కమిషనర్‌ను ఎమ్మెల్యే కోరారు. ఆయన వెంటనే స్పందించాలని, గుంతలు పూడ్చేందుకు ఇచ్చిన నగదు ఏమయ్యాయో తెలుసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, వెంటనే రిలయన్స్ తీసిన గుంతల పూడిక పనులు ప్రారంభించాలని కోరారు. లేకుంటే రిలయన్స్ సంస్థ చేస్తున్న కేబుల్ పనులను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాసులు, నాయకుడు కొల్లి పవన్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement