Sakshi News home page

ఆదేశాల అమలుకు ఐదేళ్లా?

Published Tue, Jul 22 2014 12:49 AM

ఆదేశాల అమలుకు ఐదేళ్లా? - Sakshi

పోలీసు పదోన్నతుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఏపీ, తెలంగాణ ఉన్నతాధికారులను నిలదీసిన అత్యున్నత న్యాయస్థానం
జాప్యానికి ఎనిమిది వారాల్లోగా కారణాలు చెప్పాలని ఆదేశం
 

న్యూఢిల్లీ: పోలీసు అధికారుల పదోన్నతుల అమలు విషయంలో ఉన్నతాధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలుచేయడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారంటూ మండిపడింది. తాము గతంలో ఇచ్చిన ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదో వివరించాలని నిలదీసింది. కేసు పూర్వాపరాలు ఇవీ.. స్వతంత్ర జోన్ అయిన హైదరాబాద్‌లో పనిచేస్తున్న తమను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడాన్ని సవాల్ చేస్తూ కొందరు ఇన్‌స్పెక్టర్లు ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (ఏపీఏటీ)ని ఆశ్రయించారు. అయితే హైదరాబాద్ ఆరో జోన్ పరిధిలోకి వస్తుందని పేర్కొంటూ ట్రిబ్యునల్ వారి వాదనలను తోసిపుచ్చింది. హైకోర్టు ఫుల్ బెంచి కూడా హైదరాబాద్ ఫ్రీజోన్ కాదని పేర్కొంది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. 2009 అక్టోబర్ 9న జస్టిస్ బి.ఎన్.అగర్వాల్, జస్టిస్ సింఘ్వీలతో కూడిన ధర్మాసనం హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా పేర్కొంటూ తీర్పు ఇచ్చింది. ఇదే సమయంలో ఇన్‌స్పెక్టర్లు, డీఎస్‌పీలు, ఏఎస్‌పీలు, ఎస్‌పీలకు పదోన్నతులు ఇవ్వాలని స్పష్టంచేసింది. అయితే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు దీన్ని అమలుచేయలేదు. దీంతో పిటిషనర్ 2013లో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. 2014 జనవరిలో ఇది విచారణకు రాగా అవిభాజ్య రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్ దాఖలు చేస్తూ.. కోర్టు ఆదేశాలను మార్చి 31లోగా అమలుచేస్తామని పేర్కొన్నారు. కానీ, అమలు చేయలేదు. న్యాయస్థానం  తీర్పును అమలుచేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పిటిషనర్ జి.అనంతరెడ్డి మరోసారి పిటిషన్ వేశారు. దీన్ని జూలై 7న జస్టిస్ జగదీశ్‌సింగ్ కెహర్, జస్టిస్ ఆర్.కె.అగర్వాల్‌లతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఆ విచారణ సందర్భంగా అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. జనవరి నుంచి జూన్ వరకు ఈ ఆదేశాల అమలులో నిర్లక్ష్యం వహించిన వారి పేర్ల జాబితాను ఇవ్వాలని, ఉన్నతాధికారులంతా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అయితే రెండు వారాల్లో పదోన్నతులను అమలుచేస్తామని, అందుకు అవకాశమివ్వాలని అధికారులు కోరగా అనుమతి ఇచ్చింది.

ఈ జాప్యానికి కారణాలేమిటో చెప్పండి...

ఈ నేపథ్యంలో సోమవారం ఈ కేసు తిరిగి విచారణకు వచ్చింది. ఈ విచారణకు ఆంధ్రప్రదేశ్ డీజీపీ జె.వి.రాముడు, తెలంగాణ డీజీపీ అనురాగ్‌శర్మ, రెండు రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. పదోన్నతులకు సంబంధించి మెరిట్ జాబితా రూపొందించి కోర్టు ఆదేశాలను అమలుచేశామని రెండు రాష్ట్ర ప్రభుత్వాల తరఫు న్యాయవాదులు ధర్మాసనానికి విన్నవించారు. ఈ సందర్భంగా జస్టిస్ జగదీశ్‌సింగ్ కెహర్.. ఈ ఆదేశాల అమలులో జాప్యానికి కారణాలేమిటో చెప్పాలని నిలదీశారు. ‘మీకు ఇది మామూలైపోయింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రతి ఆదేశం చెత్తబుట్టలోకి పోతోంది. ఒక కేసు తరువాత ఇంకొక కేసు.. అన్నీ ఇలాగే అవుతున్నాయి. మీరు ఏ కారణాలు చెప్పాలనుకుంటున్నారో ఫైల్ చేయండి. మేం పరిశీలిస్తాం. కానీ ఎందుకు అమలుచేయలేదో చెప్పాలి. ఏసీ గదుల్లో కూర్చునే మీకు బాధితుల కష్టాలు ఎలా తెలుస్తాయి? 2009 నుంచి అమలు చే యలేనంత నిర్లక్ష్యమా? సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు ఐదేళ్లు పడుతుందా? ఇదేనా మీరు ప్రజలకు అందించే సేవ? ’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ సందర్భంలో న్యాయవాది ‘కోర్టు ఆదేశాలను ఆలస్యంగానైనా అమలు చేశాం...’ అని మరోసారి చెప్పబోతుండగా.. ‘ఇది ఆలస్యంగా అమలుచేయడం కాదు.. నిర్బంధంగా అమలుచేయడం...’ అని న్యాయమూర్తి అభివర్ణించారు. ‘ఎందుకు ఆలస్యమైందో.. ఎందుకు ఇప్పటివరకు అమలుచేయలేదో కారణాలను 8 వారాల్లో మా ముందుంచండి.. అప్పుడు తుది విచారణ చేపడతాం...’ అని స్పష్టం చేశారు.
 
 

Advertisement
Advertisement