కోడిపందేల బరులకు... రేట్లు ఫిక్స్ | Sakshi
Sakshi News home page

కోడిపందేల బరులకు... రేట్లు ఫిక్స్

Published Mon, Jan 11 2016 12:58 AM

Fixing the rates of chicken races

విజయవాడ : న్యాయస్థానం ఆంక్షలు విధించినా, పోలీసులు అడ్డుకుంటామని హెచ్చరికలు చేస్తున్నా.. కోడిపందేల నిర్వాహకులు ఏమాత్రం తగ్గటం లేదు. పందేల నిర్వహణకు బరుల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. మరోపక్క వారికి భరోసా ఇస్తూ పందేల నిర్వహణకు ప్రోత్సహిస్తున్న అధికార పార్టీ నేతలు బరుల ఏర్పాటుకు రేట్లు ఫిక్స్ చేస్తున్నారు. రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఈ మొత్తాలు ఫిక్స్ చేసినట్లు సమాచారం. ముందుగా ఒప్పందాలు చేసుకుని అడ్వాన్స్‌లు ఇచ్చినవారికే ఈ రేట్లు ఉంటాయని, పండుగ దగ్గరకు వచ్చిన తరువాత రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని ఆయా నేతల అనుచరులు ప్రచారం చేస్తున్నారు. స్పెషల్ రేట్లు ఇస్తే నాలుగైదు ఊళ్లలో బరి లేకుండా ఒకేచోట జరిగేటట్లు చేస్తామని నేతలు హామీ ఇస్తున్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు నేరుగా రంగంలోకి దిగకుండా తమ అనుచరులకు ఈ వసూళ్ల బాధ్యత అప్పగించినట్లు తెలిసింది.

ముఖ్యంగా జిల్లాలో ఓ కీలక మంత్రి ఈ విషయంలో తన పేరు బయటకు రాకుండా వ్యవహారం నడపమని ఆదేశించినట్లు పార్టీ వర్గాల భోగట్టా. పోలీసు శాఖపై పట్టున్న అధికార పార్టీకి చెందిన ఓ నియోజకవర్గ నేత ఈ రేట్లు ఫిక్స్ చేసి వసూలు చేయటంలో ముందంజలో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముందే బరులు ఏర్పాటు చేయిస్తానని నిర్వాహకులకు హామీ ఇచ్చిన ఆ నేత రెండు రోజుల క్రితం సిద్ధం చేయించారు. కోడిపందేలు వేసే సమయానికి పోలీసులు తెలిసి అడ్డుకోవటంతో ఒకట్రెండు రోజుల్లో పూర్తి అనుమతులు తీసుకొస్తానని ఆయన సర్దిచెప్పినట్లు తెలుస్తోంది. మరోపక్క పోలీసుల కోసం కూడా బరి నిర్వాహకులు ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

కాల్‌మనీ కేసుల భయంతో...
కాల్‌మనీ కేసులో అభాసుపాలైన ఓ ఎమ్మెల్యే ఈసారి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గతేడాది తన నియోజకవర్గ పరిధిలో పందేలు దగ్గరుండి మరీ నిర్వహించిన ఆ నేత ఈసారి ఒకటి రెండు రోజులు వేచిచూడమని అనుచరులకు చెబుతున్నట్లు సమాచారం. అంతర్గతంగా రేట్లు మాట్లాడి డబ్బులు చేతులు మార్చుతున్నట్లు తెలుస్తోంది. ఎక్కడా తన పేరు వాడవద్దని సూచించినట్లు సమాచారం.
 
అంపాపుర ంలో పేకాటకు ఏసీ గదులు

మచిలీపట్నం : పందేల నిర్వహణ ఈసారి కొత్త పుంతలు తొక్కనుంది. గన్నవరం, హనుమాన్‌జంక్షన్‌ల మధ్య ఉన్న అంపాపురంలోని ఓ వెంచర్‌లో పేకాట ఆడేందుకు ఏసీ గదులను ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల నేతృత్వంలో ఈ శిబిరాన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. సినిమా సెట్టింగ్ పరికరాలు తీసుకొచ్చి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. కోడిపందేల కోసం ప్రత్యేక గ్యాలరీ ఇక్కడ ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. కైకలూరుకు చెందిన అధికార పార్టీ నాయకులు ఆదివారం కొల్లేటికోటలో సమావేశం నిర్వహించి భారీ ఎత్తున బరులు నిర్వహించాలని నిర్ణయించారు. టీడీపీ నాయకులు కోడిపందేలను ప్రారంభించేందుకు గుర్తుగా కోడిపందేలను ప్రారంభించి పందెం రాయుళ్లకు ఆహ్వానం పలికారు. గుడివాడ, గుడ్లవల్లేరు, పెదపారుపూడి, నందివాడ మండలాల్లో మండలానికి ఒకటి, రెండు చొప్పున కోడిపందేల బరులు ఉంటాయని, పేరుకే కోడిపందేలైనా కోత ముక్క తదితరాలు ఉంటాయని, ఆడేందుకు అనుమతులుంటాయని సమాచారాన్ని పంపుతున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement