నగర సుందరీకరణ, పునర్నిర్మాణంపై దృష్టి | Sakshi
Sakshi News home page

నగర సుందరీకరణ, పునర్నిర్మాణంపై దృష్టి

Published Tue, Nov 18 2014 2:07 AM

నగర సుందరీకరణ, పునర్నిర్మాణంపై దృష్టి - Sakshi

విశాఖ రూరల్: నగర సుందరీకరణ, పునర్నిర్మాణ పనులపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తుపాను సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులపై ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సోమవారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ నగరంలో కనీసం 2 వేల గృహాలతో అన్ని రకాల మౌలిక సదుపాయాలతో ఒక కాలనీని అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపించాలని చెప్పారు. ఐఏవై, రాష్ట్ర ప్రభుత్వ నిధులు, ఎంపీ ల్యాడ్స్ నిధులతో ఒక్కో జిల్లాలో రెండు, మూడు మోడల్ కాలనీలు నిర్మిస్తామని వెల్లడించారు.

4జీ కనెక్టవిటీ అన్ని గ్రామాలకు 10 నుంచి 15 ఎంబీపీఎస్ సామర్థ్యంతో అందించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వ్యవసాయ కనెక్షన్లు మినహా పారిశ్రామిక, గృహ, వాణిజ్య కనెక్షన్లన్నింటికీ విద్యుత్‌ను పునరుద్ధరించామని ఇందన శాఖ కార్యదర్శి అజేయ్‌జైన్ సీఎంకు వివరించారు. విశాఖలో భూగర్భంలో విద్యుత్ లైన్లు వేసేందుకు రూ.1465 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామని తెలిపారు. విశాఖ జిల్లాలో 34,180 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, ఈ పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.49.18 కోట్లు 1.55 లక్షల మంది రైతులకు చెల్లించాల్సి ఉందని జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ వివరించారు.

విశాఖలో మత్స్యకారులకు తగిన పరిహారం చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. స్వల్ప వ్యవధిలో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించేందుకు తోడ్పడిన మూడు జిల్లాల అధికారులను అభినందించారు. సమావేశంలో మంత్రులు సి.హెచ్.అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, కిమిడి మృణాళిని, పి.నారాయణ, పల్లె రఘునాథరెడ్డి, రావెళ్ల కిషోర్‌బాబు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఎంపీలు కె.హరిబాబు, కింజరపు రామ్‌మోహన్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement