ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు

Published Wed, Aug 3 2016 7:10 PM

ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు - Sakshi

ఏలూరు : విద్యార్థుల విద్యాప్రామాణాలు సంతృప్తిగా లేకపోవడంతో ఎనిమిది మంది ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు, ఒక ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి డీఈవో డి.మధుసూదనరావు తెలిపారు. లింగపాలెం మండలంలోని ధర్మాజీగూడెం, కాటమరెడ్డిపల్లిలో ఎంపీపీ పాఠశాలలను, ధర్మాజీగూడెంలో బాలికోన్నత, జెడ్పీ జనరల్‌ హైస్కూళ్లను బుధవారం డీఈవో ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు పట్టికలు, రికార్డులు, విద్యా ప్రమాణాలు, మధ్యాహ్న భోజన నాణ్యత, మౌలిక సదుపాయాలు, పాఠశాల ఆవరణలను పరిశీలించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలు అసంతప్తిగా ఉండటంతో పలువురు ఉపాధ్యాయులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం విద్యార్థులు పుస్తకం చూసికూడా చదివే పరిస్థితుల్లో లేకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. 

నాణ్యమైన విద్య అందించాలి
అనంతరం డీఈవో మధుసూదనరావు విలేకరులతో మాట్లాడుతూ ధర్మాజీగూడెం, కాటమరెడ్డిపల్లి ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జై నరసింహ, ఏసుపాదంతో పాటు ఉపాధ్యాయులు బేనజీర్, రమేష్, ధర్మాజీగూడెం బాలికోన్నత హైస్కూల్‌లో ఇంగ్లిష్‌ టీచర్‌ సీహెచ్‌ ఆదిలక్ష్మి, సైన్స్‌ టీచర్‌ వీయుఎన్‌ మహలక్ష్మి, జెడ్పీ జనరల్‌ హైస్కూల్‌లో బడిగంటలు ఫ్లెక్సీని ఏర్పాటు చేయకపోవడంతో హెచ్‌ఎం ఆశాలతను, లెక్కలు టీచర్‌ నాగరాజుకు షోకాజ్‌ నోటీసులు అందించామని చెప్పారు. విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన కాటమరెడ్డిపల్లి ఎంపీపీ స్కూల్‌ ఉపాధ్యాయుడు ఆనంద్‌కుమార్‌ను సస్పెండ్‌ చేశామని డీఈవో తెలిపారు. ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించకపోతే సహించేదిలేదని హెచ్చరించారు. ఎంఈవో బి.వెంకటేశ్వరరావు, సీఆర్పీ గుడిపూడి కుమార్‌ మంగళం ఆయన వెంట ఉన్నారు.
  
 
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement