మెట్రో కోసం చారిత్రక భవనం కూల్చివేత! | Sakshi
Sakshi News home page

మెట్రో కోసం చారిత్రక భవనం కూల్చివేత!

Published Sun, May 4 2014 2:38 AM

మెట్రో కోసం చారిత్రక భవనం కూల్చివేత!

వైద్య విధాన పరిషత్ భవనంకూల్చివేతకు రంగం సిద్ధం
 
మరిన్ని భవనాలూ తొలగించేందుకు ఏర్పాట్లు
 పార్కింగ్ కోసంఆ స్థలాన్ని వినియోగించనున్న రైల్వే సంస్థ
 కూల్చివేతలను అడ్డుకుంటామన్న ఉద్యోగులు

 
 హెదరాబాద్: హైదరాబాద్‌లోని చారిత్రక భవనాల్లో ఒకటైన.. వైద్య విధాన పరిషత్ భవనాన్ని మెట్రోరైలు ప్రాజెక్టు కోసం కూల్చివేయనున్నారు. పేదరోగులకు వైద్యాన్ని అందించడంలో వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రులదే కీలక పాత్ర. ఆ విభాగం ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లోని కోఠిలో ఉమెన్స్ కళాశాల ఎదురుగా ఉంది. ఈ భవనాన్ని పదిహేను రోజుల్లో కూల్చివేసి, ఆ ఉద్యోగులను మరో చోటికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ భవనాన్ని కూల్చిన స్థలంలో మెట్రో రైల్వే స్టేషన్ పార్కింగ్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీనికి హెరిటేజ్ (చారిత్రక) భవనంగా గుర్తింపు ఉన్నా.. కూల్చివేతకు ప్రభుత్వం ఆమోదించడం గమనార్హం. ప్రస్తుతం తాత్కాలికంగా వైద్య విధాన పరిషత్‌కు బంజారాహిల్స్ రోడ్ నెం. 2లో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తారని... అనంతరం కోఠిలోని అదే క్యాంపస్‌లో ఒక భవనం నిర్మించి ఇచ్చేందుకు మెట్రో రైల్ నిర్మాణ సంస్థ అంగీకరించిందని సమాచారం. అయితే, ఉన్నతాధికారులు మాత్రం ఉద్యోగుల మధ్య కొత్త చిచ్చు పెడుతున్నారు.  కోఠిలో ఆరోగ్యరంగానికి సంబంధించిన వివిధ కార్యాలయ భవనాలున్నాయి.

అందులో వైద్య విధాన పరిషత్, మలేరియా విభాగం భవనం, కుటుంబ సంక్షేమశాఖ శిక్షణ భవనాలను మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం కూల్చివేస్తున్నారు. మిగతా భవనాల్లో ఆంధ్రా ప్రాంత ఉద్యోగులను అలాగే ఉంచి... తెలంగాణ రాష్ట్రం విడిపోతున్నందున తెలంగాణకు సంబంధించిన అన్ని కార్యాలయాలను ఇక్కడినుంచి బంజారాహిల్స్‌లో అద్దెకు తీసుకున్న భవనంలోకి తరలించాలని యోచిస్తున్నారు. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. తాము వైద్య విధాన పరిషత్ భవనం కూల్చివేతను అడ్డుకుంటామని తెలంగాణ ఉద్యోగుల సంఘం కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు జూపల్లి రాజేందర్ స్పష్టం చేశారు. సుమారు 1.7 ఎకరాల స్థలాన్ని తీసుకుని, కేవలం ఐదువందల గజాల్లో భవనాన్ని నిర్మించి ఇవ్వడం తెలంగాణ ఉద్యోగులకు తీవ్రంగా నష్టం చేయడమేనని ఆయన చెప్పారు. మరోవైపు సీమాంధ్ర ఉద్యోగులు కూడా అందరికీ ఆమోద యోగ్యమైన పరిష్కారం దిశగా కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
 

Advertisement
Advertisement