నిజమైనవే..! | Sakshi
Sakshi News home page

నిజమైనవే..!

Published Sun, Jun 14 2015 1:14 AM

నిజమైనవే..! - Sakshi

కట్ అండ్ పేస్ట్ కాదు..
ఓటుకు నోటు కేసులో రికార్డులను నిర్ధారించిన ఫోరెన్సిక్ నిపుణులు

 
ఆడియో, వీడియోలు అతికించి పేర్చినవి కావు
ఏసీబీకి ప్రాథమిక నివేదిక అందించిన ఎఫ్‌ఎస్‌ఎల్?
ఇక వాటిలోని వాయిస్ రేవంత్, చంద్రబాబులదేనా
అనే దానిపై పరిశీలన... ‘కట్ అండ్ పేస్ట్’ చేశారన్న
చంద్రబాబు ఆరోపణలన్నీ అవాస్తవాలే!
రేపు మేజిస్ట్రేట్ ఎదుట స్టీఫెన్‌సన్ వాంగ్మూలం నమోదు
ఈ వాంగ్మూలం అత్యంత కీలకం.. దాని ఆధారంగా వచ్చేవారం మధ్యలో బాబుకు నోటీసులు జారీ చేసే అవకాశం
మరిన్ని కీలక ఆధారాలు లభ్యం.. కాల్‌డేటా పరిశీలన
టవర్ సిగ్నల్స్ ద్వారా మొబైల్‌ఫోన్ల లొకేషన్ల నిర్ధారణ


 హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయాలంటూ ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ప్రయత్నించి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన కేసుకు సంబంధించిన అన్ని ఆడియో, వీడియో టేపులు పూర్తిగా నిజమైనవేనని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) నిర్ధారించినట్లు సమాచారం. అవి ఎక్కడా ఉద్దేశపూర్వకంగా కత్తిరించి అతికినవి (కట్ అండ్ పేస్ట్) కావని తేల్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఎఫ్‌ఎస్‌ఎల్ ఈ మేరకు ఏసీబీ అధికారులకు ప్రాథమిక నివేదికను అందించిందని, వీటికి సంబంధించి అధికారిక నివేదికలను సోమవారం నేరుగా కోర్టుకు అందించనుందని సమాచారం. తాను అక్కడక్కడ మాట్లాడిన మాటలను అతికించి పేర్చారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఆరోపణలన్నీ దీనితో అబద్ధాలని తేలిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ కోర్టులో ఇవ్వనున్న వాంగ్మూలం అత్యంత కీలకంగా మారనుంది. మేజిస్ట్రేట్ ఎదుట ఆయన వాంగ్మూలం నమోదు చేసేందుకు ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో ఇప్పటికే మెమో దాఖలు చేశారు. సోమవారం ఈ వాంగ్మూలం నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా స్టీఫెన్‌సన్ ఎవరెవరి పేర్లు వెల్లడించనున్నారనేది ఉత్కంఠ రేపుతోంది. స్టీఫెన్‌సన్ కోర్టులో చెప్పే వివరాలను ఆధారంగా చేసుకొని ఎవరెవరి పేర్లను ఈ కేసులో పొందుపరచాలి, ఎవరెవరికి నోటీసులు జారీ చేయాలనేదానిపై పూర్తి స్పష్టత వస్తుందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. స్టీఫెన్‌సన్ వాంగ్మూలం ఆధారంగా ఏపీ సీఎం చంద్రబాబుకు, కుట్రలో భాగస్వాములైన ఇతరులకు వచ్చే వారం మధ్యలో ఏసీబీ నోటీసులు

 
 జారీ చేయనున్నట్లు సమాచారం. మరింత ఉత్కంఠ..
 టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేయాలంటూ స్టీఫెన్‌సన్‌తో రూ.5 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని రూ.50 లక్షలు అడ్వాన్స్‌గా ఇస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ కుట్రకు సంబంధించి ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్వయంగా నామినేటెడ్ ఎమ్మెల్యేతో మాట్లాడిన ఆడియో రికార్డులు కూడా బహిర్గతమయ్యాయి. జాతీయ స్థాయిలో సంచలనం రేపిన ఈ ముడుపుల కేసులో తదుపరి పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఏసీబీ ఈ కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్)కు పంపించిన 14 ఆడియో, వీడియో రికార్డుల్లో కొన్నింటి విశ్లేషణ ఇప్పటికే పూర్తయింది. ఈ ఆడియోలు, వీడియోలు పూర్తిగా నిజమైనవేనని.. ఎక్కడా ఉద్దేశపూర్వకంగా కట్ అండ్ పేస్ట్ చేసినవి కావని ఎఫ్‌ఎస్‌ఎల్ నిర్ధారించినట్లు తెలిసింది. ఈ మేరకు ఏసీబీ అధికారులకు ప్రాథమిక నివేదిక అందించింది. అధికారిక నివేదికలను సోమవారం నేరుగా కోర్టుకు అందించనుంది. ఇక రెండో దశలో ఈ రికార్డుల్లోని సంభాషణల్లో ఉన్న మాటలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, స్టీఫెన్‌సన్‌వేనా, కాదా.. అనేదానిని ఎఫ్‌ఎస్‌ఎల్ నిపుణులు విశ్లేషించనున్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు వాయిస్‌ను పరిక్షించే అవకాశాలున్నాయి. వాస్తవానికి వాయిస్ రికార్డింగ్ పరీక్ష కోర్టులో జరగాలి. కానీ చంద్రబాబు సీఎం హోదాలో ఉండటంతో ఆయన గొంతును ఆయన సూచించే ప్రదేశంలో, అవసరమైతే న్యాయవాదుల సమక్షంలో రికార్డు చేసే అవకాశాలు ఉన్నాయని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 
బాబు ఆరోపణలన్నీ అవాస్తవాలే..
 ఈ రికార్డులన్నీ నిజమైనవేనని ఎఫ్‌ఎస్‌ఎల్ నిర్ధారించిన నేపథ్యంలో.. ఇప్పటివరకు తాను మాట్లాడిన వాక్యాలను కూర్చి తయారు చేశారంటూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణన్నీ అవాస్తవాలని శాస్త్రీయంగా రూఢీ అయినట్లే. తన మాటలను అక్కడక్కడ అతికించి, పేర్చారంటూ చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగటంతో పాటు తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ ఢిల్లీకి వెళ్లి కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశారు. అందుకే తమ దగ్గరున్న సాక్ష్యాధారాలన్నింటినీ శాస్త్రీయంగా రుజువు చేసేందుకు ఏసీబీ అధికారులు ఆచితూచి అడుగులేస్తున్నారు. చిన్న పొరపాటు జరిగినా ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే ప్రమాదముందని... అందుకే అరెస్టులు, నోటీసుల కంటే ముందు తిరుగులేని సాక్ష్యాధారాలను సమీకరించే పనిపెట్టుకున్నట్లు ఒక ఉన్నతాధికారి పేర్కొన్నారు.
 
మరిన్ని కీలక ఆధారాలు..
 ఓటుకు నోటు కేసులో ఏసీబీ దర్యాప్తు బృందాలు మరిన్ని కీలకమైన ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను కొనుగోలు చేసేందుకు రూ.5 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుని రూ.50 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చిన అంశంలో ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్‌ల ఫోన్ల కాల్‌డాటా ద్వారా మరింత స్పష్టత వచ్చినట్లు తెలిసింది. రేవంత్‌రెడ్డి తన ‘బాస్’తో పదే పదే మాట్లాడిన ఫోన్ లోకేషన్ (అది ఉన్న ప్రాంతం), స్టీఫెన్‌సన్‌తో ‘బాస్’ మాట్లాడిన ఫోన్ లొకేషన్‌లను ఏసీబీ గుర్తించింది. ఈ ఫోన్ సంభాషణలన్నీ ఏఅడ్రస్ నుంచి, ఏ ప్రాంతం నుంచి సాగాయనే దానిని లాన్‌ల్యాగ్‌తో పాటు టవర్ సిగ్నల్స్ ద్వారా ఛేదించినట్లు తెలిసింది. దీంతోపాటు ఫోన్ ఐఎంఈఐ నంబర్, జీపీఎస్ లోకేషన్‌ల ఆధారంగా సంభాషించిన మొబైల్ ఫోన్లు ఎవరివనేది విశ్లేషిస్తున్నారు. ఒక ఫోన్‌కాల్ ఆధారంగా జీపీఎస్‌తో పాటు లాన్‌ల్యాగ్ గుర్తించిన గ్రాఫ్, మరో ఫోన్‌కాల్ గ్రాఫ్‌కు ఏమాత్రం సరిపోలదు. కానీ ఇక్కడ సరిపోలాయని, దీనిని బట్టి కుట్రలో భాగస్వాములందరూ పక్కాగా దొరికిపోయినట్లేనని భావిస్తున్నారు. ఈ కుట్ర ప్రారంభమైన తేదీ నుంచీ రేవంత్, సెబాస్టియన్ వారం పాటు ఎవరెవరికి ఫోన్లు చేశారు, ఎక్కడినుంచి చేశారు, వారిద్దరికి ఏ లొకేషన్ నుంచి ఏ నంబర్ల నుంచి ఫోన్లు వచ్చాయనే కాల్‌డేటా ఆధారంగా ఈ కేసు టెక్నికల్‌గా ట్రేస్ అయినట్లేనని ఏసీబీ ఉన్నతాధికారి ఒకరు పేర్కొనడం గమనార్హం. కొన్ని ఫోన్ సంభాషణలను బట్టి సెల్ టవర్ల ద్వారా లొకేషన్లు నిర్ధారణ అయ్యాయని, దీంతో కుట్రలో పాలుపంచుకున్న వారెవరో తేలిపోయిందని ఆయన చెప్పారు. ఇక ప్రధానంగా మే 28 నుంచి 31 మధ్య సాగిన ఫోన్ సంభాషణలపై దర్యాప్తును ఏసీబీ అధికారులు వివిధ కోణాల్లో విస్తరించారు. ఒక ఫోన్ నుంచి దాదాపు 32 సార్లు రేవంత్, సెబాస్టియన్‌ల ఫోన్లకు కాల్స్ వచ్చినట్లు గుర్తించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement