ఘరానా మోసం! | Sakshi
Sakshi News home page

ఘరానా మోసం!

Published Sat, Apr 18 2015 2:54 AM

fraud

హోంగార్డు ఉద్యోగాల పేరుతో రూ. 22.5 లక్షల వసూలు
 కర్నూలు(ఓల్డ్‌సిటీ): హోంగార్డు ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను వంచించారు. సాక్షాత్తు ఓ ఏపీఎస్‌పీ ఆర్‌ఎస్‌ఐ, తన ఇద్దరు సహచరులతో వంచనకు పాల్పడ్డారు. నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారు. నకిలీ నియామక పత్రాలతో బోల్తా కొట్టించారు. ఎట్టకేలకు పోలీసులు ఈ వీరి అవినీతి బాగోతానికి తెరదించారు. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక ఏపీఎస్‌పీ రెండో పటాలం ఆర్‌ఎస్‌ఐ బీ.కృష్ణుడు (56), ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడకు చెందిన సందడి మధుసూదన్ (34), స్థానిక కృష్ణానగర్‌కు చెందిన దుంపల విశ్వనాథ్‌రెడ్డి (49) స్నేహితులు. వీరు మందు పార్టీలు చేసుకుంటూ జల్సాలకు అలవాటు పడ్డారు. అక్రమ మార్గంలో డబ్బు సంపాదనకు వ్యూహరచన చేశారు. హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి డబ్బులు దండుకునేందుకు స్కెచ్ వేశారు.
 
  సుమారు ఏడు నెలల క్రితం కర్నూలుకు చెందిన ఆకేపోగు సురేశ్ నుంచి రూ. 2.5 లక్షలు, వెలుగోడుకు చెందిన బాలచంద్రుడు నుంచి ముందస్తుగా రూ.50 వేలు తీసుకుని మోసం చేశారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో వీరిపై రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఆ కేసులను సీసీఎస్‌కు బదలాయించగా, సీసీఎస్ పోలీసులు గురువారం రాత్రి ముగ్గురు నిందితులను స్థానిక బళ్లారి చౌరస్తా వద్ద అదుపులోకి తీసుకున్నారు.
 
 మరో 17మంది బాధితులు : సీసీఎస్ పోలీసుల విచారణలో వీరి బాగోతాలు మరికొన్ని బట్టబయలయ్యాయి. ఫిర్యాదుదారులతో పాటు మరో 17 మంది నుంచి వీరు హోంగార్డు ఉద్యోగాల పేరిట మొత్తం రూ. 22.5 లక్షలు వసూలు చేశారు. ఒక బాధితుడు తులం బంగారు గొలుసు, పదవ తరగతి సర్టిఫికెట్లు ఇచ్చి మోసపోయాడు.
 
 దళారులను నమ్మొద్దు: జిల్లా ఎస్పీ
 హోంగార్డు ఉద్యోగాలిప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి డబ్బు వసూలు చేస్తూ మోసం చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని, వారి నుంచి రూ. 20 లక్షల నగదు, ఒక బంగారు గొలుసు, నకిలీ నియామక పత్రం, అభ్యర్థుల పదో తరగతి సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ వెల్లడించారు.
 
 శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి ఈ వివరాలు వెల్లడించారు. నిందితులను పట్టుకున్న పోలీసులను ఆయన అభినందించారు. వారికి త్వరలో రివార్డులు ప్రకటిస్తామన్నారు. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయని, దళారులను నమ్మవద్దని నిరుద్యోగులకు సూచించారు. ప్రస్తుతం పటిష్టమైన రిక్రూట్‌మెంట్ విధానాలు ఉన్నాయన్నారు. ఎవరైనా ఉద్యోగాలిప్పిస్తామంటూ డబ్బు డిమాండ్ చేస్తే వారి సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీసీఎస్ డీఎస్పీ హుసేన్ పీరా తెలిపారు. సీఐ రవిబాబు, ఎస్‌ఐలు శ్రీహరి, అమీర్‌అలీ, నాయబ్ రసూల్, ఏఎస్‌ఐ నరసింహులు, హెడ్ కానిస్టేబుళ్లు విజయరాజు, మురళి, కానిస్టేబుళ్లు దేవరాజు, సుబ్బరాయుడు, హోంగార్డు రాములను ఎస్పీ అభినందించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ శివకోటి బాబూరావు, కర్నూలు డీఎస్పీ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement