ఉద్యోగులకు ఉచిత చికిత్స | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు ఉచిత చికిత్స

Published Fri, Dec 6 2013 1:43 AM

free health check up to government employees

 కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్ :
 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు హెల్త్‌కార్డుల ద్వారా గురువారం నుంచి ఉచిత వైద్యం అందిస్తున్నట్లు ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ టి.పుల్లన్న తెలిపారు. జిల్లాలోని 14 ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో వీరు ఉచిత చికిత్సను అందుకోవచ్చు. ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు, పెన్షనర్లు యేడాదికి రూ.2 లక్షల వరకు ఉచిత చికిత్సను అందుకునే అవకాశం కల్పించారు. ఒకవేళ భార్యాభర్తలిద్దరూ ఒకేసారి ఆసుపత్రిలో చేరితే ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఉచిత వైద్యం అందిస్తారు. అయితే ఇప్పటిదాకా 20 శాతంమంది ఉద్యోగులు కూడా హెల్త్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకోలేదని సమాచారం. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. తాత్కాలిక హెల్త్‌కార్డులు 2014 మార్చి 31వ తేదీ వరకు వర్తిస్తాయని, ఆ తర్వాత ప్రభుత్వం పర్మినెంట్‌కార్డు మంజూరు చేస్తుందన్నారు. ఉద్యోగులు మొత్తం 1,885 జబ్బులకు చికిత్సనందుకోవచ్చని తెలిపారు. తాత్కాలిక హెల్త్‌కార్డుపై చాలా మంది జిల్లా కలెక్టర్ సంతకం లేదని అనుమాన పడుతున్నారని, ఈ కార్డుపై కలెక్టర్ సంతకం చేయించాల్సిన అవసరం లేదన్నారు.
 
 ఆన్‌లైన్‌లో ఇలా దరఖాస్తు చేసుకోవాలి
 హెల్త్‌కార్డు కోసం ఉద్యోగులు ముందుగా ఠీఠీఠీ.్ఛజిజ.జౌఠి.జీ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. ఉద్యోగుల జీతాలకు సంబంధించి ట్రెజరీలో ఇచ్చే కోడ్ నంబర్‌ను కార్యాలయంలో తీసుకుని వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి. అనంతరం ఆధార్‌కార్డు నంబర్ లేదా ఎన్‌రోల్ నంబర్ రాయాలి. ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్‌లోని ఒకటి, రెండు పేజీలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. వీటితో పాటు ఉద్యోగులు తన ఫొటోతో పాటు కుటుంబసభ్యుల పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలను, వికలాంగుడైతే ధ్రువీకరణ పత్రాన్ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. పెన్షనర్లు సర్వీసు రిజిస్టర్‌కు బదులు పే ఆర్డర్ కాపీని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం వచ్చే ప్రింట్‌ను తీసుకుని సంతకం చేయాలి. దాన్ని తిరిగి స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా దరఖాస్తు చేసిన పత్రం ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు వెళ్తుంది. ట్రస్ట్ వారు దరఖాస్తును పరిశీలించి ఉద్యోగి పనిచేసే కార్యాలయానికి పంపిస్తారు. అక్కడి అధికారులు దరఖాస్తును పరిశీలించి, ఏవైనా తప్పులుంటే సరిచేసి తిరిగి ట్రస్ట్‌కు ఆన్‌లైన్‌లో పంపిస్తారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వారు హెల్త్‌కార్డును తయారు చేసి ఆన్‌లైన్‌లో ఉంచుతారు. ఈ సేవా లేదా ఇంటర్‌నెట్ ద్వారా ప్రింట్ తీసుకోవచ్చు. ఈ కార్డు 2014 మార్చి 31వ తేదీ వరకు వర్తిస్తుంది.
 
 జిల్లాలో ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులు
 జిల్లాలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ కలిగిన ఆసుపత్రులు 14 ఉన్నాయి. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల, నగరంలోని ఆయుష్మాన్ హాస్పిటల్, పద్మచంద్ర హాస్పిటల్, గౌరిగోపాల్ హాస్పిటల్, సాయి సత్యహాస్పిటల్, విజయ నర్సింగ్ హోం, బాలాజీ నర్సింగ్ హోం, జీవీఆర్ హాస్పిటల్, విశ్వభారతి క్యాన్సర్ హాస్పిటల్, ఆదోనిలోని ఏరియా ఆసుపత్రి, నంద్యాలలోని జిల్లా ఆసుపత్రి, శాంతిరామ్ జనరల్ హాస్పిటల్, మెడికేర్ హాస్పిటల్, క్యూర్ హాస్పిటల్ ఉన్నాయి.
 
 
 

Advertisement
Advertisement