భూ బకాసురుల పలాయనం | Sakshi
Sakshi News home page

భూ బకాసురుల పలాయనం

Published Fri, Nov 28 2014 12:59 AM

భూ బకాసురుల పలాయనం

కాచవరంలో రూ. 20కోట్ల విలువైన భూమి ఆక్రమణకు యత్నం  అడ్డుకున్న గ్రామస్తులు
 పొక్లయిన్లు, జేసీబీలతో సహా వెనుదిరిగిన ఆక్రమణదారులు
 కృష్ణానదికి అవతలివైపు రాజధాని నేపథ్యంలో వాగుపోరంబోకు పెరిగిన డిమాండ్

 
కాచవరం,(ఇబ్రహీంపట్నం రూరల్) : రాజధాని నిర్మాణం నేపథ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూ ఆక్రమణదారులు పెరిగిపోయారు. ఎక్కడ ప్రభుత్వ భూములున్నా వాలిపోతున్నారు. కృష్ణానదికి అవతల వైపు రాజధాని నిర్మాణం నేపథ్యంలో... ఇవతలి వైపు ఉన్న ఇబ్రహీంపట్నం మండలం కాచవరంలో సుమారు రూ.20కోట్ల విలువైన తొమ్మిది ఎకరాల భూమి కబ్జాకు కొందరు యత్నించారు. సర్వే నంబర్లు 8/5, 8/6, 8/7, 8/8, 8/9లో ఈ భూమి ఉంది. దీని విలువ ఎకరం రెండు కోట్లపైమాటే. మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రెండు పొక్లయిన్లు, రెండు జేసీబీలతో 9ఎకరాల భూమిని చదును చేస్తుండగా ఎంపీటీసీ సభ్యుడు కందుల భాస్కరరావు, కొందరు యువకులు అడ్డుకున్నారు.

పత్రాలు చూపాలని నిలదీశారు. లక్ష్మీపార్వతి భర్త రామరావు పేరుతో అడంగళ్ కాపీలో నమోదైన పత్రాలను వారు చూపారు. వారి నుంచి గొల్లపూడికి చెందిన శివకుమార్ అనే వ్యక్తి కొనుగోలు చేసినట్లు అడంగళ్ కాపీలున్నాయి. పట్టా చూపాలని పట్టుబట్టడంతో కంగారు పడిన ఆక్రమణదారులు పత్రాలు రేపు చూపుతామని పలాయనం చిత్తంగించారు. వారి సామగ్రీని తరలించారు.

2005లో ఇక్కడున్న 9.50 ఎకరాల్లో ఇందిరమ్మ కాలనీ ఏర్పాటుకు నిర్ణయించారు.  పట్టాలు, పాస్ పుస్తకాలు అందచేశారు. అప్పట్లో వారు అమ్మేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఉదంతం వెలుగు చూడటంతో గతంలో పట్టాలు పొందిన వ్యక్తులు మేల్కొన్నారు. భూమిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని ఎంపీటీసీ భాస్కరరావు చెప్పారు. ఈ విషయాన్ని మంత్రి దేవినేని ఉమా దృష్టికి తీసుకెళ్లనున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
 
కొండవాగు పోరంబోకు


భూమి కొండవాగు పోరంబోకని కాచవరం వీఆర్‌వో సయ్యద్ ఖాశీం చెప్పారు. అడంగళ్‌లో ఎవరి పేర్లూ లేవన్నారు. విషయం తహశీల్దార్‌కు తెలియజేస్తానని చెప్పారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement