సంక్షేమం.. క్షవరం | Sakshi
Sakshi News home page

సంక్షేమం.. క్షవరం

Published Sat, Feb 7 2015 2:21 AM

సంక్షేమం.. క్షవరం - Sakshi

 వచ్చే బడ్జెట్‌లో పలు పథకాలకు కోత
 కేటాయింపులు జరపబోమని సీఎం చంద్రబాబు స్పష్టీకరణ
 ఒక్కో శాఖ ఒకట్రెండు సంక్షేమ కార్యక్రమాలకే పరిమితం!
 ఫలితాలు వస్తాయని అధికారులు చెబితేనే నిధులు..  ప్రస్తుతం రూ. 9 వేల కోట్ల లోటు
 అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్
 

 సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం అమలులో ఉన్న పలు సంక్షేమ పథకాలకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో కోత విధించాలని భావిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. అనవసరమైన, ప్రజలకు ప్రయోజనకరంగా లేని సంక్షేమ కార్యక్రమాలకు వచ్చే బడ్జెట్‌లో కేటాయింపులు జరపబోమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఒక్కొక్క శాఖలో పదుల సంఖ్యలో సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, వచ్చే బడ్జెట్ నుంచి వాటిని శాఖకు ఒకట్రెండుకు మాత్రమే పరిమితం చేయాలనే ఆలోచన ఉన్నట్టు తెలిపారు. ప్రభుత్వం ఈసారి జీరో బడ్జెట్ ప్రవేశపెడుతుందని, ఎప్పటి మాదిరిగా శాఖలకు బడ్జెట్ కేటాయింపులు జరపకుండా.. ఉన్నతాధికారులు తమ శాఖల్లో ఎలాంటి ఫలితాలు ఇవ్వగలరో ప్రభుత్వానికి చెప్పిన మేరకు కేటాయిస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖలకు ఆర్థిక శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయన్నారు. రాష్ట్ర బడ్జెట్ తయారీ, పలు అభివృద్ధి కార్యక్రమాల అమలుపై చంద్ర బాబు శుక్రవారం సచివాలయం నుంచి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫిబ్రవరి ఆరంభం నాటికి రూ.9 వేల కోట్ల లోటు ఉందని చెప్పారు. వచ్చే ఏడాదిలోనూ రాష్ట్ర ఆదాయం ఆశించినంతంగా ఉండే అవకాశం లేదన్నారు. ఈ కారణంగా ప్రాధాన్యత అంశాల ఆధారంగానే శాఖలకు బడ్జెట్ కేటాయింపులు ఉంటాయన్నారు. రెండు నెలల్లో 14వ ఆర్థిక సంఘం రాబోతుందని, ఈ ఆర్థిక సంఘంలో రాష్ట్రానికి వచ్చే కేటాయింపుల ఆధారంగా రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులకు తుదిరూపు ఇవ్వనున్నట్టు వివరించారు.
 
 కేంద్రం ఆదుకోవాలి..
 
 రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు, రెండు రాష్ట్రాలు సమాన స్థాయికి వచ్చే వరకు కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెప్పారు. తొమ్మిది నెలల ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఏడు శాతం ఆర్థిక వృద్ధి సాధించిందని, ఇది దేశ సగటు ఆర్థిక వృద్ధి కన్నా ఎక్కువ అని చెప్పారు. భవిష్యత్తులో ఇది 13- 14 శాతానికి చేరుకోగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణం వర్షపాతం 36 శాతం తక్కువగా ఉన్నప్పటికీ వ్యవసాయ రంగంలో 11.34 శాతం వృద్ధి రేటు సాధించగలిగామన్నారు.
 
 చార్జీల పెంపు అవసరాన్ని ప్రచారం చేయండి
 
 రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపునకు దారితీసిన పరిస్థితులను ప్రజలకు వివరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. 100 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకునే 1.17 కోట్ల కుటుంబాలపై పెంపు ప్రభావం ఉండబోదన్నారు. ఈఆర్‌సీ ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత వారు ప్రభుత్వానికి అందించే నివేదిక ఆధారంగా విద్యుత్ చార్జీల పెంపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇలావుండగా రాష్ట్రంలో డ్రైవర్లకు ఐదు లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించబోతున్నట్టు చంద్రబాబు తెలిపారు. వీరితో పాటు రాష్ట్రంలోని కోటి మంది వరకు ఉన్న అసంఘటిత కార్మికులకు దీనిని వర్తింపజేస్తామన్నారు. ఈ నెల 19వ తేదీన నీరు- చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని, రాష్ట్రంలో వర్షపాతం పెరగడానికి నాలుగైదు నెలల పాటు ఉద్యమం మాదిరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి వచ్చే ఏడాది వ్యవసాయ ఆర్థిక వృద్ధి రేటు పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. తక్కువ వర్షపాతం కారణంగా రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు బాగా పడిపోయాయని బాబు చెప్పారు. వచ్చే వేసవిలో మంచినీటి ఎద్దడి రాకుండా జిల్లా కలెక్టర్లు ఇప్పటినుంచే సమగ్ర ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు.
 
 అనంత నుంచి కొత్త రాజధానికి రహదారి
 
 అనంతపురం పట్టణం నుంచి కర్నూలు మీదుగా కొత్త రాజధానికి నాలుగు లైన్ల రోడ్లు నిర్మాణం చేపట్టబోతున్నట్టు ముఖ్యమంత్రి వివరించారు. రోడ్డు నిర్మాణానికి అవసరపడే భూ సేకరణను అనంతపురం, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లా కలెకర్లు పూర్తి చేయాలని సూచించారు. మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రభుత్వం చేసే సాయాన్ని రూ.12 వేల నుంచి రూ.15 వేలకు పెంచుతున్నామన్నారు. మరుగుదొడ్ల నిర్మాణానికి రాష్ట్రంలో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి ‘ఆత్మగౌరవం’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో మూకుమ్మడిగా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు.
 
 డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలకు రూ.5 కోట్లు
 
 మద్యం సేవించి వాహనాల నడపడం వల్ల రోడ్లు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించేందుకు అవసరమైన పరికాల కొనుగోలుకు రూ. 5 కోట్లు అందజేస్తామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఆర్ అండ్ బీ, పోలీసు, రవాణా శాఖలు అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో స్వైన్‌ప్లూ నివారణకు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. రుణమాఫీ రెండవ దశలో రైతులు తమ వివరాలను బ్యాంకులకు అందజేయడానికి శనివారంతో గడువు ముగియనుందని, గడువు పెంపుపై శనివారం జరిగే సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
 

Advertisement
Advertisement