అధైర్యం వద్దు.. భవిష్యత్ మనదే: వైఎస్ జగన్ | Sakshi
Sakshi News home page

అధైర్యం వద్దు.. భవిష్యత్ మనదే: వైఎస్ జగన్

Published Fri, Jun 6 2014 3:07 AM

Future is ours, until then don't be afraid, says Ys Jagan mohan reddy

* గ్రామ కమిటీలను పటిష్టం చేస్తాం..
* ప్రతి నెలా సామాజిక, రాజకీయ అంశాలపై చైతన్యం చేసే కార్యక్రమాలు
* రెండోరోజు అరకు, విజయనగరం, అమలాపురం ఎంపీ నియోజకవర్గాలపై సమీక్ష
* పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపిన జగన్‌మోహన్‌రెడ్డి  
* కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా పార్టీ యంత్రాంగమంతా తోడు ఉంటుంది

 సాక్షి ప్రతినిధి, రాజమండ్రి: ‘‘ప్రతి కార్యకర్తకూ నాతో పాటు పార్టీ యంత్రాంగమంతా అండగా ఉంటుంది. వారికి ఏ చిన్న కష్టమొచ్చినా కలసికట్టుగా పోరాడదాం. ఏ ఒక్కరూ అధైర్యపడనవసరం లేదు. అధికారంలోకి రాలేదనే దిగులు అసలే వద్దు. భవిష్యత్తు మనదే. భరోసాతో ముందుకు కదలండి. ఏ కార్యకర్తకు ఏ చిన్న కష్టమొచ్చినా స్థానిక నాయకులే కాదు.. ఆయా జిల్లాల్లోని ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు పార్టీ శ్రేణులంతా ఏకమై అండగా ఉండాలి. అవసరమైతే పక్కనున్న జిల్లాల నుంచి కూడా నేతలు తరలి రావాలి.
 
 కార్యకర్తల్లో మనోస్థైర్యం నింపాలి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాజమండ్రి ఆర్ అండ్ బీ అతిథి గృహంలో చేపట్టిన పార్టీ సమీక్షలో రెండోరోజైన గురువారం అరకు, విజయనగరం పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలుపోటములపై అక్కడి నాయకులు, కార్యకర్తలతో జగన్ సుదీర్ఘంగా చర్చించారు. సంస్థాగతంగా నెలకొన్న సమస్యలతోపాటు క్షేత్రస్థాయిలో పార్టీ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. గ్రామ, బూత్ స్థాయి వరకు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నాయకులు, కార్యకర్తల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు. ఆయా నియోజకవర్గాల నేతలు, గెలుపొందిన ఎమ్మెల్యేలకు రానున్న ఐదేళ్లలో అవలంభించాల్సిన విధివిధానాలపై దిశానిర్దేశం చేశారు.
 
 రెండోసారీ గెలవాలి..
 కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ ‘తొలిసారి గెలవడం గొప్పకాదు. పదవీకాలంలో విశ్వసనీయతతో పనిచేసి వారి మధ్యే ఉంటూ వారి సమస్యలపై పోరాడగలగాలి. అలా చేస్తూ రెండోసారి ప్రజలతో ఎన్నుకోబడినప్పుడే నాయకుడిగా మనకు నిజమైన పాస్‌మార్కులు లభించినట్టు’ అని అన్నారు. రానున్న రోజుల్లో గ్రామ కమిటీలను పటిష్టం చేసి, తెలుగుదేశం ప్రభుత్వం అవలంభించే ప్రజా వ్యతిరేక విధానాలను, మోసాలను వాటి ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చర్యలు చేపడతామన్నారు. ప్రతి నెలా సామాజిక, రాజకీయ అంశాలపై చైతన్యం చేసే కార్యక్రమాలు చేపడతామని, అందుకు కావాల్సిన మెటీరియల్‌ను అవసరమైతే హైదరాబాద్ నుంచి పంపిస్తామని చెప్పారు. పార్టీ యువతకు అవగాహన కార్యక్రమాలు కూడా చేపడతామన్నారు.
 
 ప్రతిపక్షం లేకుండా చేయాలన్నదే బాబు తపన..

 ‘మనం బలమైన ప్రతిపక్షంగా అవతరించాం. ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వపరంగా జరిగే లోపాలను ఎత్తి చూపేందుకు బలమైన ప్రతిపక్షం కావాలని అధికార పక్షం కోరుకుంటుంది. కానీ మన రాష్ర్టంలో అధికారం చేపడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ప్రజలకు సేవచేయడానికంటే ప్రతిపక్షమే లేకుండా చేయాలన్న తపనతో పనిచేస్తారు’ అని జగన్ విమర్శించారు. ‘చంద్రబాబు చేసే మోసాలను కప్పిపుచ్చేందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-9 వంటి మీడియా సంస్థలు నిత్యం కంటికిరెప్పలా పనిచేస్తాయి. ఈ శక్తులన్నీ కలిపి చేసే కుట్రలను తిప్పికొట్టేందుకు మనం సిద్ధంగా ఉండాలి. వైఎస్సార్ కాంగ్రెస్ టార్గెట్‌గా అప్పుడే కుట్రలు, కుతంత్రాలు మొదలు పెట్టారు. ఇప్పటికే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు డబ్బు ఎర చూపి వార్ని తమ వైపు తిప్పుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. కార్యకర్తలపై దాడులు మొదలయ్యాయి. అక్రమ కేసులు కూడా బనాయిస్తారు. కార్యకర్తలకు అండగా నిలవాల్సిన బాధ్యత నాయకులపై ఉంది’’ అని సూచించారు.
 
 బాబు బండారం త్వరలోనే బయటపడుతుంది..
 ‘‘మరో పదిహేను రోజుల్లో వర్షాలు పడనున్నాయి. రైతులు రుణాల కోసం బ్యాంకర్ల వద్దకు వెళ్తారు. పాత రుణాలు చెల్లిస్తే కానీ వారికి కొత్త రుణాలు ఇవ్వరు. అప్పుడు చంద్రబాబు బండారం బయటపడుతుంది. ఇదొక్కటే కాదు.. ఆయన ఇచ్చిన అబద్ధపు హామీలు, మోసాలన్నీ ప్రజలందరూ త్వరలోనే తెలుసుకుంటారు. బాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉంది’’ అని జగన్‌మోహన్‌రెడ్డి కార్యకర్తలకు కర్తవ్యాన్ని నిర్దేశించారు.

Advertisement
Advertisement